logo

దళితుల భూములపై కన్ను

‘ నా ఎస్సీ.. నా ఎస్టీ.. నా బీసీ.. నా మైనార్టీ అంటూ వేదిలెక్కిన ప్రతిసారి చెప్పే జగన్‌.. తన ఏలుబడిలో వారు దగా పడుతున్నారు.

Published : 23 Feb 2024 02:10 IST

సాగు చేసుకోవద్దంటూ హెచ్చరికలు
తెర వెనుక కథ నడిపిస్తున్న పెద్దలు

పంప్‌హౌస్‌ నుంచి దళితుల పొలాల్లోకి ఇలా నీరు వదిలేశారు

ఈనాడు, కర్నూలు, కర్నూలు గ్రామీణం, న్యూస్‌టుడే : ‘‘ నా ఎస్సీ.. నా ఎస్టీ.. నా బీసీ.. నా మైనార్టీ అంటూ వేదిలెక్కిన ప్రతిసారి చెప్పే జగన్‌.. తన ఏలుబడిలో వారు దగా పడుతున్నారు. ఆ పార్టీ నేతల భూదాహానికి బలవుతున్నారు. నిబంధనల కొర్రీలు పెట్టి దళితుల భూముల్లో పాగా వేయాలని చూస్తున్నారు. కర్నూలు నగర సమీపంలోని రూ.200 కోట్లు విలువ చేసే భూములపై ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు కన్నేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగా సాగులో ఉన్న ‘ నా ఎస్సీ.. నా ఎస్టీ.. నా బీసీ.. నా మైనార్టీ అంటూ వేదిలెక్కిన ప్రతిసారి చెప్పే జగన్‌.. తన ఏలుబడిలో వారు దగా పడుతున్నారు.కు అధికారులతో మౌఖిక ఆదేశాలు జారీ చేయిస్తుండటం కలకలం రేపుతోంది. ‘‘ ఇటీవల కొందరు రైతులను పోలీసులు పిలిపించారు.. పొలాల్లోకి వెళ్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.. న్యాయస్థానాలకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోవాలని చెబుతున్నారు.. ఇదెక్కడి న్యాయమని సుంకన్న అనే రైతు ప్రశ్నిస్తున్నారు.

అనుభవంలో లేరని నిరూపించే ప్రయత్నం

ఆయా భూముల్లో రైతులు ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. వాటిని ఎలాగైనా లాక్కోవాలన్న ఉద్దేశంతో వివిధ మార్గాల్లో ఒత్తిళ్లు ప్రారంభించారు. రైతులను సాగుకు దూరం చేసి.. వారి అనుభవంలో లేవని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా భూముల్లోకి సమీప ఎస్‌.ఎస్‌. ట్యాంకు నుంచి నీటిని వదులుతున్నారు. భూసేకరణ జరుగుతోంది.. పంటలు సాగు చేస్తే నష్టపోతారంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకు భూ సేకరణ చేయడం లేదో మాత్రం చెప్పడం లేదు. పందుల్ని తీసుకొచ్చి పొలాల్లో వదులుతుండడం... పొక్లెయిన్లతో భూములను ధ్వంసం చేయిస్తున్నారు. దీంతో బాధిత రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వారికి తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారం. మరో ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. కేసీ కాల్వను ఆనుకునే భూములు ఉండటంతో నీటి కొరత లేదు. ఈ నేపథ్యంలో పచ్చగా ఉండాల్సిన భూములు భూబకాసురుల భూదాహం కారణంగా బీడు భూములుగా మారుతున్నాయి.

ఎందుకు సేకరిస్తున్నారో చెప్పరు

‘‘ మా పూర్వీకుల నుంచి తరతరాలుగా 4.5 ఎకరాలు సాగు చేసుకుంటున్నాం. డీపట్టా ఉంది. భూసేకరణ చేస్తామని ప్రచారం చేస్తుండటంతో పంట వేయాలా? వద్దా? అన్న విషయం తేల్చుకోలేక భయాందోళనకు గురవుతున్నాం.  మా భూములు మాకు దక్కుతాయా? లేదా? అన్న విషయం తెలియక తీవ్ర ఆందోళనతో ఉన్నాం. ఇప్పటికే ఓ మహిళ గుండెపోటుతో చనిపోయింది. భూసేకరణ ప్రచారం జరుగుతుండటంతో ఆందోళనతో నిద్రపట్టక ఆరోగ్యం క్షీణిస్తోందని’’ దేవరాజ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

కాల్వ భూమిగా దస్త్రాల్లో నమోదు

కర్నూలు మండలం మునగాలపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 46/సీ, 50, 233, 236, 237, 238, 239, 240, 241, 243, 244, 245, 248, 249, 250, 252, 254, 255, 256, 257, 415, 416, 417, 418, 423, 430, 431, 432లో ఉన్న భూమి కాల్వ భూమిగా దస్త్రాల్లో నమోదై ఉంది. అక్కడ కొందరు దళిత రైతులకు గతంలో పట్టాలు ఇచ్చారు. వాటికి సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకాలు తీసుకోలేకపోయారు. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోలేదు. ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్నారు. ఇవి కర్నూలు-హైదరాబాద్‌ జాతీయ రహదారి నుంచి ఒకటిన్నర కి.మీ. పరిధిలో ఉన్నాయి. ఆయా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రహదారి పక్కన పొలాలైతే ఎకరా రూ.1.50 కోటి వరకు పలుకుతోంది. దాదాపు రెండు వందల ఎకరాల మేర ప్రభుత్వ భూములు ఉన్నాయి.


పోలీసులతో భయపెట్టిస్తున్నారు

‘‘ దశాబ్దాలుగా మేము మునగాలపాడులోని భూములు సాగు చేసుకుంటున్నాం..భూ పత్రాలు ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశా. ఆయా భూముల్లోకి రావొద్దని నగర పాలక అధికారులు పోలీసులతో చెప్పించి భయపెట్టిస్తున్నారు.. గతంలో ఎస్‌.ఎస్‌.ట్యాంకు పేరు చెప్పి 350 ఎకరాలు సేకరిస్తే దళిత రైతులే నష్టపోయారు. భూమిలో సాగు చేసే అవకాశం లేకుండా ఎస్‌.ఎస్‌.ట్యాంకు నీటిని వదిలారని’’ రామదాసు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని