logo

పాతాళానికి జలం.. భోరుమంటున్న పల్లె జనం

ఆస్పరి మండల పరిధిలోని పుప్పాలదొడ్డిలో 270 వరకు ఇళ్లు ఉన్నాయి. 1,200 మంది జనాభా ఉన్న ఈ గ్రామానికి రెండు బోర్ల నీరే ఆధారం. వాటి నుంచి ట్యాంకుల్లో నిల్వ చేసి అందిస్తున్నారు.

Published : 23 Feb 2024 02:11 IST

ఆస్పరి మండల పరిధిలోని పుప్పాలదొడ్డిలో 270 వరకు ఇళ్లు ఉన్నాయి. 1,200 మంది జనాభా ఉన్న ఈ గ్రామానికి రెండు బోర్ల నీరే ఆధారం. వాటి నుంచి ట్యాంకుల్లో నిల్వ చేసి అందిస్తున్నారు. గ్రామస్థులంతా అక్కడికే వెళ్తారు. నీటి మట్టం తగ్గడంతో వచ్చే కొద్దిపాటి నీటికి గంటల సేపు నిరీక్షిస్తున్నారు. పదే పదే ట్యాంకుల వద్దకు వెళ్లలేక150 మంది రెండు చక్రాల తోపుడు బండ్లు తెప్పించుకున్నారు. ఒక్కో దానికి రూ.5 వేలు ఖర్చు వెచ్చించారు. ఒక్కోదాంట్లో ఆరు బిందెలు పెట్టి నీటిని తీసుకెళ్తున్నారు.

 న్యూస్‌టుడే, ఆస్పరి

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది.. బోర్లకు మరమ్మతులు చేయించేందుకు నిధుల్లేవు.. జల్‌జీవన్‌ పనులు ముందుకు సాగడం లేదు.. ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని పలువురు జడ్పీటీసీ సభ్యులు రెండు రోజుల కిందట జరిగిన సర్వసభ్య సమావేశంలో జనావేదన వినిపించారు. ఇందుకు ఆర్థిక మంత్రి స్పందిస్తూ సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్లను ఆదేశించారు. చిల్లిగవ్వ లేకుండా ఎలా ముందుకెళ్లాలని పల్లె ప్రజాప్రతినిధులు, అధికారులు తలపట్టుకున్నారు.

300 గ్రామాల్లో ముప్పుతిప్పలు

ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు వందల గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. బోరు, బావుల్లో జలమట్టం అడుగంటిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వారం, పది రోజులకోసారి మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచే పల్లెల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు.కర్నూలు జిల్లా పరిధిలోని పలు గ్రామాలకు గతేడాది తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. రూ.87.20 లక్షల మేర బిల్లులు చెల్లించాల్సి ఉండగా ఓ సంస్థ ద్వారా రూ.27 లక్షల వరకు ఇచ్చినట్లు తెలిసింది. మిగిలిన బిల్లులు పెండింగులో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నా.. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం జరుగుతోంది. పశ్చిమ ప్రాంతంలోని పలు గ్రామాల్లో పది రోజులకోసారి మంచినీరు సరఫరా అవుతోంది.

రూ.22.75 కోట్లకు ప్రతిపాదన

ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేసవిలో మంచినీటి సమస్యను అధిగమించేందుకు గ్రామీణ నీటి సరఫరా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. బోర్లకు మరమ్మతులు, ట్యాంకర్లతో రవాణా, బోరు బావులు అద్దెకు తీసుకోవడం తదితర వాటి కోసం రూ.22.75 కోట్లు అవసరమని అంచనా వేశారు. గత నెలలో ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. కర్నూలు జిల్లాలో 112 గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు రూ.8.10 కోట్లు అవసరమని గతేడాది ప్రభుత్వానికి నివేదించినా ఒక్క రూపాయి విడుదల చేయకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని