logo

వేసవి నిప్పు.. నల్లమలకు ముప్పు

ఏటా వేసవిలో నల్లమల అరణ్యంలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతంలో నిప్పు రాజుకుంటోంది.

Updated : 23 Feb 2024 05:41 IST

నల్లమలలో వ్యాపిస్తున్న మంటలు

ఏటా వేసవిలో నల్లమల అరణ్యంలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతంలో నిప్పు రాజుకుంటోంది. శివరాత్రి, ఉగాది పర్వదినాల్లో నల్లమల గుండా పాదచారులు నడిచి వెళ్తుంటారు. పొలపర్లు, వేటగాళ్లు అక్రమంగా అడవిలోకి ప్రవేశిస్తున్నారు. వీరివల్ల అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. నల్లమలలోని కాలిబాటలో భక్తుల పాదయాత్రలు ప్రారంభమయ్యే లోపే అధికారులు రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. దారులకు ఇరువైపులా ఎండు గడ్డిని తొలగించి, మంటలు విస్తరించేందుకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

 న్యూస్‌టుడే, ఆత్మకూరు

కారణాలు అనేకం

నల్లమలలోని అన్ని రేంజ్‌లలో వేసవిలో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల మహానంది వద్ద అడవికి నిప్పంటుకుంది. కర్నూలు- గుంటూరు ప్రధాన రహదారి, శ్రీశైలం- దోర్నాల దారి వెంట వాహనదారులు, పాదచారులు తాగి పడేసే బీడీ, సిగరెట్‌ పీకలు, అగ్గిపుల్లలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. మరోవైపు వెదురు బొంగుల మధ్య రాపిడి కారణంగా నిప్పు రవ్వలు రాజుకుంటున్నాయి. శ్రీశైల జల విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి కరెంటు సరఫరా చేసే భారీ తీగలు నల్లమల గుండా వెళ్తున్నాయి. వాటి నుంచి అప్పుడప్పుడు రాలిపడే నిప్పురవ్వల వల్ల కూడా మంటలు వ్యాపిస్తున్నాయి.

ఎండుగడ్డితో ప్రమాదం

ఏటా వేసవిలో అటవీ ప్రాంతంలో పెరిగిన ఎండుగడ్డి వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాలి బాటలు, దారుల పక్కన ఉన్న ఎండు గడ్డి, ఎండిన ఆకులపై చిన్న నిప్పురవ్వలు పడినా క్షణాల్లో మంటలు వ్యాపించే ఆస్కారం ఉంది. ప్రమాద స్థాయిని తగ్గించేందుకు దారుల వెంబడి ఎండిన గడ్డి, ఆకులను పూర్తిస్థాయిలో తొలగించాల్సిన ఆవశ్యకత ఉంది.

సంరక్షణ చర్యలు అంతంత మాత్రమే

ఈ ప్రమాదాలకు ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి అరికట్టేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు, సిబ్బంది సరిపడా లేకపోవడం సమస్యగా మారింది. ఎన్‌ఎస్‌టీఆర్‌ పరిధిలోని 63 బేస్‌ క్యాంప్‌లలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలో 23, మార్కపురం పరిధిలో 24, జీబీఎం పరిధిలో 16 బేస్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు, మార్కాపురం డివిజన్ల పరిధిలో 200 మంది ఫైర్‌ ప్రొటెక్షన్‌ వాచర్లు పనిచేస్తున్నారు. వీరంతా నిప్పు రాజుకోకుండా, మంటలు వ్యాపించకుండా కొన్ని సంరక్షణ చర్యలు తీసుకుంటున్నా పూర్తిస్థాయి ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. మంటలను ఆర్పేందుకు వినియోగించే సామగ్రి కార్యాలయాల్లోనే ఉంటోంది. క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది చెట్ల కొమ్మలు, ఇతర పద్ధతుల్లో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

అగ్ని నిరోధకాలు అవసరం

పొరపాటున అడవికి నిప్పంటుకున్నా అగ్నికీలలు వ్యాపించకుండా అక్కడికక్కడ ఆగిపోయేలా అడవిలో అగ్ని నిరోధకాలు (ఫైర్‌ట్రాక్‌లు) ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నడక మార్గంతో పాటు అడవిలోని పలు దారుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేస్తే వన సంపదకు నష్టం వాటిల్లే ఆస్కారం తక్కువ ఉంటుంది.


అడవుల పరిరక్షణ అందరి బాధ్యత
- అలెన్‌చాన్‌ టెరాన్‌,  అటవీశాఖ డిప్యూటీ డైరెక్టరు

అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత. అడవి బాగుంటే మనం బాగుంటాం. శ్రీశైలానికి వెళ్లే పాదచారుల వల్ల ప్రమాదాలు జరుగకుండా ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నాం. పాదచారులను తనిఖీ చేసి వారివద్ద అగ్గిపెట్టెలు, బీడీ, సిగరెట్‌ వంటివి లేకుండా చూస్తాం. నల్లమలలో అగ్ని ప్రమాదాల నివారణ కోసం ముందస్తు చర్యల్లో భాగంగా ఫైర్‌లైన్స్‌, వ్యూలైన్స్‌ ఏర్పాటు చేయించాం. మంటలను ఆర్పేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బ్లోయర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు కూడా అటవీ సంరక్షణకు సహకరించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు