logo

వసతిగృహం.. శిథిలభవనం

నాడు- నేడు పేరుతో ప్రభుత్వం విద్యకు పూర్తిస్థాయి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నా.. వసతిగృహాల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులు నేటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు.

Published : 23 Feb 2024 02:22 IST

పత్తికొండలోని బీసీ బాలికల వసతిగృహ భవనం ఇది. ఇక్కడ 170

మంది విద్యార్థులు అసౌకర్యాలతో కుస్తీ పడుతున్నారు.

నాడు- నేడు పేరుతో ప్రభుత్వం విద్యకు పూర్తిస్థాయి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నా.. వసతిగృహాల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులు నేటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు. వసతిగృహాల తీరు నేటికీ మారలేదు. పత్తికొండలోని బీసీ వసతిగృహ కొత్త భవనానికి ప్రహరీ లేకపోవడంతో బాలికలకు రక్షణ కరవైంది. తల్లిదండ్రుల విన్నపం మేరకు పాత భవనంలోకి మార్చారు. అసౌకర్యాలతో అవస్థలు పడుతున్నారు. పత్తికొండలోని బాలికల వసతిగృహంతో పాటు, మద్దికెరలోని ఎస్సీ వసతిగృహ భవనాలు నిరుపయోగంగా మారాయి. ఒక్కో భవనానికి రూ.80లక్షలకు పైగా వెచ్చించారు.

 న్యూస్‌టుడే, పత్తికొండ, మద్దికెర

ఒకే భవనంలో 170 మంది

పత్తికొండలో ఒకే భవనంలో 170 మంది బాలికలు చదువుకుంటున్నారు. పాత భవనంలోని రెండు హాల్లలో.. సరైన సౌకర్యాలు, వసతి లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వారు కనీసం పడుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. వసతిగృహ ఆవరణలోని చేతి పంపు వద్ద నుంచి బిందెలతో తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. అన్ని సౌకార్యలున్నా.. ప్రహరీ లేకపోవడంతో మరో భవనంలో  ఉండాల్సిన 5 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులను సైతం అక్కడి నుంచి ఇంటర్‌ విద్యార్థులు ఉంటున్న వసతిగృహం భవనంలోకి మార్చడంతో అందరికీ అక్కడ అవసరమైన వసతులు కొరవడ్డాయి.

పత్తికొండలో నిర్వహణ లేక అధ్వానంగా మారిన బీసీ వసతిగృహం

ఆకతాయిల వేధింపులతో..

పత్తికొండలోని బీసీ వసతిగృహ భవనాన్ని మూడేళ్ల కిందట ఎమ్మెల్యే శ్రీదేవి ప్రారంభించారు. ఆ భవనానికి ప్రహరీ లేకపోవడంతో ఆకతాయిల చేష్టలతో బాలికలు ఇబ్బందులు పడేవారు. దీంతో ఇంటర్‌ కళాశాల పక్కన ఉన్న పాత భవనంలోకి మార్చారు. దీంతో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన వసతిగృహం భవనం నిరుపయోగంగా మారడంతో పాటు, అక్కడి విలువైన వస్తువులన్నీ చోరీకి గురయ్యాయి. నిర్వహణ లేకపోవడంతో భవనం సైతం శిథిలావస్థకు చేరింది.

ఇక్కడ ఇలా..

మద్దికెరలో 2018లో ఎస్సీ వసతిగృహ భవనం ప్రారంభమైన ఆరు నెలలకే  మూసివేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న కారణంగా మరో వసతిగృహంలో విలీనం చేశారు. దీంతో రూ.80లక్షలు వెచించి నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. ఇక్కడ చదివే విద్యార్థులు సవతి లేక అవస్థలపాలయ్యారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని