logo

మాట రాదు.. అడుగేయలేదు

వయసు పెరుగుతున్నా.. ఎదుగుదల లేదు. బుద్ధిమాంద్యంతో ఉన్న చోటు నుంచి కదల్లేదు. ఆకలేసినా అడగలేదు.. అడుగేయలేదు.

Published : 23 Feb 2024 02:23 IST

మానసిక దివ్యాంగురాలితో తల్లి రంగమ్మ

వయసు పెరుగుతున్నా.. ఎదుగుదల లేదు. బుద్ధిమాంద్యంతో ఉన్న చోటు నుంచి కదల్లేదు. ఆకలేసినా అడగలేదు.. అడుగేయలేదు. 11 సంవత్సరాలు వచ్చినా.. అన్ని సపర్యలు తల్లే చేయాల్సిన పరిస్థితి.

పత్తికొండ మండలం నలకదొడ్డి గ్రామానికి చెందిన రంగమ్మకు కొన్నేళ్ల కిందట చందోలి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వారికి ఆడపిల్ల పుట్టింది. మల్ల్లీశ్వరి అని పేరుపెట్టారు. పదకొండేళ్లు వచ్చినా అమ్మఒడిని వీడని పరిస్థితి. రంగమ్మకు భర్త చనిపోవటంతో పుట్టినిల్లైన నలకదొడ్డిలోని తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఆమెకే ఆసరా లేక తల్లిదండ్రులను ఆశ్రయిస్తే.. దివ్యాంగురాలైన కుమార్తె ఆమెకు మరింత భారమైంది. చంటిపాపలా అన్ని సపర్యలు తల్లి రంగమ్మ చేస్తోంది. పాపను వదలి ఎక్కడికీ వెళ్లేందుకు వీల్లేదు. చిన్నతనం నుంచి పాపకు దివ్యాంగుల పింఛను కోసం అష్టకష్టాలు పడుతున్నా.. వేలిముద్రలు, ఐరిష్‌ పడటంలేదనే కారణంతో పింఛన్‌ మంజూరు చేయటంలేదని తల్లి వాపోతోంది. అధికారులు కరుణించి దివ్యాంగురాలి పింఛను మంజూరు కోసం తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి, అధికారులను వేడుకున్నారు. కర్నూలుకు వెళ్లి సదరం శిబిరంలో దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం తెస్తే పింఛను మంజూరుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. పాపకు పింఛను వచ్చేలా సహకారించాలని ఆమె అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

  న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని