logo

ఆగిన బతుకు చక్రం..పల్లెవీడి పట్నానికి పయనం

జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో మొదటగా వినిపించేది పత్తికొండ నియోజకవర్గ పల్లెలే. ఉపాధి కోసం సుగ్గిబాట పట్టాయి. కరవును తట్టుకోలేక, ఉపాధి కరవై పల్లెలు ఖాళీ అవుతున్నాయి.

Published : 23 Feb 2024 02:26 IST

చక్కరాళ్లలో ఆటోలకు పట్టాలు చుట్టి పెట్టారిలా..

జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో మొదటగా వినిపించేది పత్తికొండ నియోజకవర్గ పల్లెలే. ఉపాధి కోసం సుగ్గిబాట పట్టాయి. కరవును తట్టుకోలేక, ఉపాధి కరవై పల్లెలు ఖాళీ అవుతున్నాయి. పాడిపంటలతో కళకళ లాడాల్సిన జిల్లా పశ్చిమ పల్లెలు బోసిపోతున్నాయి.

న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం

ఇదీ పరిస్థితి..

పత్తికొండ రెవెన్యూ డివిజన్‌, నియోజకవర్గ పరిధిలోని పత్తికొండ, తుగ్గలి, దేవనకొండ, ఆస్పరి తదితర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది కుటుంబాలు గ్రామాలను వీడి వెళ్తున్నాయి. పత్తికొండ మండలంలోని చక్కరాళ్ల, చందోలి, పులికొండ, దూదేకొండ, పందికోన, కోతిరాళ్ల, జూటూరు, పెద్దహల్తి, నలకదొడ్డి, దేవనబండ, తుగ్గలి మండలంలోని గిరిగెట్ల, పగిడిరాయి, రాంపల్లి, పెండేకల్లు, మారెళ్ల, ముక్కెళ్ల, బొందిమడుగుల తదితర గ్రామాల నుంచి వలస వెళ్లిన కుటుంబాలు వందల్లో ఉన్నాయి.

స్వయం ఉపాధికి సవాల్‌

కొందరు నిరుద్యోగులు, యువకులు స్వయం ఉపాధితో ఆటోలు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన ఆటోలను సైతం ప్రయాణికులు లేక ఇళ్ల వద్దే పట్టాలు(టార్పాలిన్లు) చుట్టి ఇళ్ల వద్దే ఉంచి వెళ్లిపోతున్న ఘటనలు కరవు పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

అద్దెలు లేక కదలని ట్రాలీ ఆటోలు

పత్తికొండ మండలం చక్కరాళ్లలో సుమారు 35 ఆటోలు ఉన్నాయి. ప్రయాణికులు లేక 30 ఆటోలకు పైగా ఇళ్ల వద్దే ఉంచగా కేవలం ఐదారు ఆటోలు మాత్రం పత్తికొండ, ఇతర ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. కనీసం రోజు వారీ ఖర్చులు కూడా రావటంలేదని ఆటో చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


వాయిదాలు చెల్లించలేకపోతున్నాం..
- రంగన్న, ఆటో చోదకుడు, చక్కరాళ్ల

ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలతో రూ.లక్షలు అప్పుచేసి ఆటోలు కొన్నాం. గ్రామాల్లో అధిక సంఖ్యలో వలసబాట పట్టడంతో ఆటోలు ఎక్కే వారే కరవయ్యారు. గ్రామంలో పదుల సంఖ్యలో ఆటోలు ఉన్నా.. కనీసం రెండు మూడు ఆటోలకు కూడా ప్రయాణికులు సరిపోవటంలేదు. ఫైనాన్స్‌ కంపెనీలకు నెలనెలా వాయిదాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. పట్నాలకు వలస వెళ్లక తప్పడం లేదు.


డీజిల్‌కు కూడా రావటంలేదు
- రంగస్వామి, ఆటో చోదకుడు, కురువలదొడ్డి

రెండు మూడు నెలల కిందటి వరకు ఆటోల్లో జనం కిక్కిరిసి ప్రయాణం చేసేవారు. నిత్యం వందలాది మంది ప్రయాణికులను చేరవేసే వాళ్లం. అన్ని ఖర్చులు పోనూ.. రోజుకు కనీసం రూ.వెయ్యి ఇంటికి తీసుకెళ్లేవాళ్లం. ప్రస్తుతం రోజుకు కనీసం మూడు వందలు కూడా రావడంలేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో కొంత మంది ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు మాత్రమే ఆటోలు ఎక్కుతున్నారు. దీంతో పూటగడవటమే కష్టంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని