logo

ఇసుక తిన్నెలు తినేశారు

పర్యావరణ అనుమతుల్లేకుండానే 11 నెలలుగా తుంగభద్రను తోడేశారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించారు. భారీ యంత్రాలతో ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్‌) వెల్లడించింది.

Updated : 23 Feb 2024 05:39 IST

పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వకాలు
నివేదిక సమర్పించిన ఎంవోఈఎఫ్‌

గుడికంబాలి వద్ద తవ్వకాలు

పర్యావరణ అనుమతుల్లేకుండానే 11 నెలలుగా తుంగభద్రను తోడేశారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించారు. భారీ యంత్రాలతో ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్‌) వెల్లడించింది. ఇసుక దోపిడీని జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు ఇచ్చిన నివేదిక కళ్లకు కట్టినట్లు వివరించింది.
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఇసుక తవ్వకాలకు గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (సియా) కొత్తగా పర్యావరణ అనుమతులు (ఈసీలు) జారీ చేయలేదు. గుడికంబాలిలో 2, మరళి-1 ఇసుక రీచ్‌లకు 11 నెలలుగా ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవు. అయినప్పటికీ భారీ యంత్రాలతో ఇసుకను తవ్వేశారు. ఇసుక గుత్తేదారు, రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల తీరుపై ఎన్జీటీ మండిపడింది. జగన్‌ ప్రభుత్వం చేస్తున్న ఇసుక దందా పచ్చి నిజమని.. దోపిడీ పక్కాగా సాగుతోందని తేలిపోయింది.

రెండు నెలల్లో రూ.240 కోట్ల ఆర్జన

ఇసుక రీచ్‌ల్లో గతేడాది డిసెంబరు 11 నుంచి ప్రతిమ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ తవ్వకాలు చేపట్టింది. ఈ సంస్థా ఈసీ అనుమతులు భేఖాతరు చేసింది. నిత్యం ఒక్కో రీచ్‌ నుంచి రెండు వేల టన్నుల చొప్పున తరలించినట్లు తెలుస్తోంది. రెండు నెలల్లో 3.60 లక్షల టన్నుల మేర ఇసుకను తీశారు.  12 వేలకుపైగా టిప్పర్లు తరలించి రూ.240 కోట్ల వరకు జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇసుకను తీసుకెళ్తున్న టిప్పర్లు

అన్నీ ఉల్లంఘనలే

రీచ్‌ల వద్ద కంప్యూటరైజ్డ్‌ బిల్లులు లేవు. సీసీ కెమెరాలు కానరాలేదు. ఇసుకను ఒక్కో టిప్పర్‌కు తగినంత పరిమాణంలో తీసుకెళ్లేందుకు వేబ్రిడ్జి ఏర్పాటు చేయలేదు. తరలించే టిప్పర్లకు, భారీ వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ లేదు. ఇలా అడుగడుగునా అన్నీ ఉల్లంఘనలే జరిగాయి. పది రోజుల కిందట కర్నూలు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆదోని సబ్‌ కలెక్టర్‌ పర్యవేక్షణలో రెవెన్యూ, గనులు, పోలీసు, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల సమన్వయంతో ఇసుక రీచ్‌ల్లో తనిఖీలు చేపట్టారు. వీరి పరిశీలనలో కౌతాళం మండలంలోని ఇసుక రీచ్‌ల ప్రాంతంలో హిటాచీ యంత్రం పట్టుబడింది. ఇది కర్ణాటక రాష్ట్రానికి చెందిన వీరభద్రప్పదిగా గుర్తించారు. దీనిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. ఇక అధికారుల బృందం తనిఖీలు చేసే సమయంలో ఇసుక రీచ్‌ల వద్ద ఓ టిప్పర్‌ నిలిపి ఉండగా అధికారులను చూసి సదరు టిప్పర్‌ డ్రైవర్‌ కర్ణాటక రాష్ట్రంలోని మాన్వీ ప్రాంతంలోకి తీసుకెళ్లిపోయారు.

నాడు రూ.వెయ్యి కోట్ల దోపిడీ

2021 నుంచి జారీ చేసిన ఈసీల షరతులను జేపీ పవర్స్‌ పూర్తిగా విస్మరించింది. కౌతాళం మండలంలోని గుడికంబాలి, మరళిలోని మూడు రీచ్‌ల్లో రెండేళ్లపాటు ఇసుక తవ్వకాలు జరిపింది. 2021 నుంచి 2023 నవంబరు వరకు 2.7 ఏళ్లపాటు యథేచ్ఛగా దోపిడీ సాగింది. నిత్యం సగటున 2 వేల టన్నుల వరకు తరలించారు. ఈసీ అనుమతులు లేకపోయినా గతేడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు 8 నెలలపాటు జేపీ పవర్స్‌ సంస్థ ఈ మూడు రీచ్‌ల్లో అక్రమంగా తవ్వకాలు చేశారు. ఎన్జీటీ లెక్కల ప్రకారం సరాసరిన 14.40 లక్షల టన్నుల ఇసుకను తోడేశారు. ఎనిమిది నెలల్లో 50 వేలకుపైగా టిప్పర్లను కర్ణాటక రాష్ట్రంతోపాటు హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ ఒక్కో టిప్పరు ఇసుకను రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అమ్మారు. ఈ లెక్కన జిల్లా నుంచి రూ.1000 కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని తెలుస్తోంది. జిల్లాలో ఎనిమిది నియోకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన ఇసుక డిపోల్లో ప్రజలకు టన్ను రూ.475 నుంచి రూ.1,095 వరకు అమ్మారు. వైకాపా ప్రజాప్రతినిధులు ఈ ఇసుక అక్రమ రవాణాలో భాగస్వాములై రూ.కోట్లు దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని