logo

24 మంది ఉప తహసీల్దార్ల బదిలీ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 24 మంది ఉప తహసీల్దార్లను బదిలీలు చేస్తూ జిల్లా కలెక్టర్‌ డా.జి.సృజన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 24 Feb 2024 02:09 IST

నంద్యాల జిల్లాకు ఒకరి కేటాయింపు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 24 మంది ఉప తహసీల్దార్లను బదిలీలు చేస్తూ జిల్లా కలెక్టర్‌ డా.జి.సృజన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెలవులో ఉన్న డీటీ రవికుమార్‌ను నంద్యాల జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఏడాది నుంచి రెండేళ్లలోపు ఒకేచోట పని చేస్తున్న ఉప తహసీల్దార్లను ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేశారు. వారిలో కర్నూలు అర్బన్‌ డీటీ శివరాం, ఎమ్మిగనూరు డీటీ గురురాజారావు, కర్నూలు రూరల్‌ సహెరాబాను, ఎమ్మిగనూరు సీఎస్‌డీటీ శివప్రసాద్‌, గోనెగండ్ల డీటీ లక్ష్మీరాజు, దేవనకొండ డీటీ సుదర్శన్‌, పెద్దకడబూరు డీటీ వీరేంద్రగౌడ్‌, ఆదోని డీటీ ఎజాజ్‌ అహ్మద్‌, నందవరం డీటీ రఘువీర్‌ బదిలీలకు అనర్హులు. నిబంధనల ప్రకారం మూడేళ్ల నుంచి నాలుగేళ్లలోపు ఒకే ప్రాంతంలో పని చేసిన ఉప తహసీల్దార్లను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈ నెల 13న అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయగా, అవి ఈ బదిలీల్లో అమలు కాలేదు. కృష్ణగిరి డీటీ పి.రవిచంద్రను దేవనకొండ డీటీగా నియమిస్తూ డిప్యూటేషన్‌పై కలెక్టరేట్‌ కార్యాలయానికి నియమించడం కొసమెరుపు. అయితే దేవనకొండ డీటీగా ఎవరినీ నియమించలేదు.  

అంతా ఆయన చెప్పినట్టే..

ఏపీఆర్‌ఎస్‌ఏ సంఘం నాయకులు, జిల్లా కలెక్టరేట్‌లో పని చేసే కొందరు ఉప తహసీల్దార్లు చెప్పినట్లుగానే వారి ప్రోద్బలంతో బదిలీలు జరిగాయని రెవెన్యూ అధికారులు గుసగుసలాడుతున్నారు. సంఘ నాయకులు కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు చేయించుకున్నారు. జిల్లా కేంద్రంలో మూడేళ్లకుపైబడి పని చేసిన గిరికుమార్‌రెడ్డిని తిరిగి జిల్లా కేంద్రంలోనే కర్నూలు అర్బన్‌ డీటీగా నియమించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘం అధ్యక్షునిగా కొనసాగుతున్న ఈయన్ని లూప్‌లైన్‌ పోస్టులో నియమించాల్సి ఉంది. ఆయనపై సీసీఎల్‌ఏ స్థాయిలో ఆరోపణలున్నాయి. సంఘాన్ని అడ్డం పెట్టుకొని జిల్లా పాలనాధికారులతో సన్నిహితంగా ఉంటూ తాను కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతన్నాయి. ఆయనకు అనుకూలంగా ఉన్నవారిని జిల్లా కేంద్రానికి దగ్గరి ప్రాంతాలకు బదిలీలు చేయించుకున్నారనే పలువురు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని