logo

జగన్‌ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హెలికాప్టర్ల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 24 Feb 2024 02:11 IST

మాట్లాడుతున్న బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హెలికాప్టర్ల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. బనగానపల్లిలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు రోడ్లు బాగా లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం భద్రతను సాకుగా చూపి రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంపై మండిపడ్డారు. ప్రతి సభలో పేదలకు పెత్తందార్లకు జరుగుతున్న పోరాటం అని చెప్పె ముఖ్యమంత్రికి మూడు హెలికాప్టర్లు ఎందుకని ప్రశ్నించారు. 20 కి.మీ. ప్రయాణం చేయాలన్నా సీఎంకు హెలికాప్టరు కావాలని విమర్శించారు. ప్రజల సొమ్మును నీళ్లలా ఖర్చు చేయడం మంచిది కాదని హితవు పలికారు. మరో మూడు నెలల్లో ముఖ్యమంత్రి పదవి పోతుందని ప్రజల సొమ్ముతో జల్సా చేస్తున్నారన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే జగన్‌ మాత్రం స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు.

వైకాపా నిర్ణయాలు స్వలాభానికే: మాండ్ర

మాట్లాడుతున్న నంద్యాల పార్లమెంట్‌ తెదేపా బాధ్యుడు శివానందరెడ్డి

నందికొట్కూరు, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు స్వలాభం కోసం నందికొట్కూరు పురపాలక కార్యాలయాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారని నంద్యాల పార్లమెంట్‌ తెదేపా బాధ్యుడు మాండ్ర శివానందరెడ్డి విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తెదేపా పాలనలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రస్తుతం ఉన్న కార్యాలయం స్థానంలో కొత్త భవనం, కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలని పాలకవర్గం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం మారడంతో వాటిని తుంగలో తొక్కేశారన్నారు. వైకాపా నాయకులు కొన్న భూములకు ధరలు రావాలని వాటి పక్కనే నేడు పురపాలక కార్యాలయం నూతన భవనం ఏర్పాటుకు శ్రీకారం చుట్టి ప్రజలకు చేరువలో ఉన్న కార్యాలయాన్ని అందుబాటులో లేకుండా చేయాలని వారు ఆలోచిస్తున్నారన్నారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం బాధ్యురాలు గౌరు చరిత, తానూ పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం ఎక్కువవుతోందని, ఇలాంటివి నమ్మొద్దన్నారు. భాస్కరరెడ్డి, జయసూర్య, జాకీర్‌, గిరీశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని