logo

శష్టిపూర్తి.. క్రీడా స్ఫూర్తి

లక్ష్యం.. పట్టుదల.. ఆసక్తి ఉంటే విజయం దిగొస్తుందని నిరూపిస్తున్నారు ఈ ఇద్దరు క్రీడాకారులు.

Published : 24 Feb 2024 02:12 IST

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: లక్ష్యం.. పట్టుదల.. ఆసక్తి ఉంటే విజయం దిగొస్తుందని నిరూపిస్తున్నారు ఈ ఇద్దరు క్రీడాకారులు. వయసుతో సంబంధం లేకుండా పతకాలను ఒడిసిపడుతున్నారు. ఆదోనికి చెందిన ఖాజాబందే నవాజ్‌, ఎలిగే సీమ కర్నూలు, ఆదోని మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సహకారంతో ఇటీవల మహారాష్ట్రలోని పుణేలో ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు జరిగిన జాతీయ స్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ క్రీడాపోటీల్లో ఆదోని నుంచి ఐదుగురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఇద్దరు విజయాలు సాధించారు.

హాకీ ఆడేస్తా..

ఎలిగే సీమా

నా పేరు ఎలిగే సీమా. నా భర్త ఎలిగే రమేష్‌ ఎరువుల వ్యాపారి. మాకు ఇద్దరు సంతానం. నేను చిన్నతనం నుంచే హాకీలో గోల్‌ కీపర్‌గా సాధన చేస్తున్నా. కర్ణాటకలో బీదర్‌లో పాఠశాల స్థాయి నుంచే హాకీ పోటీల్లో పాల్గొంటూ..జాతీయ స్థాయి వరకు వెళ్లి అవార్డులు సాధించా. ఆంగ్ల భాష పీజీ పూర్తి చేశా. 2017 నుంచి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొంటున్నా. షాట్‌పుట్‌, డిస్కస్‌ త్రో పోటీల్లో పాల్గొంటున్నా. ఇటీవల పుణేలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో షాట్‌పుట్‌లో వెండి పతకం సాధించా. ఇప్పటి వరకు ఏడు సార్లు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా. జాతీయ స్థాయిలో ఐదు, (1 వెండి, 4 కాంస్యం), రాష్ట్ర స్థాయిలో 25కు పైగా పతకాలు(22 బంగారు, 4 వెండి) పతకాలు సాధించా. పిన్‌ల్యాండ్‌, ఫిలిపిన్స్‌లో జరిగిన రెండు సార్లు అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్నా. నా విజయం వెనుక మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పాటు కర్నూలు, ఆదోని మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రోత్సాహం, శిక్షణ ఎంతో ఉంది. ఈ ఏడాది స్వీడన్‌లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు సాధన చేస్తున్నా. ఎప్పటికైనా అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొని, పతకాలు సాధించి.. దేశానికి.. మన ప్రాంతానికి పేరు తీసుకురావాలనేది నా లక్ష్యం.

ఫుట్‌బాల్‌ ఆటపై ఆసక్తి

ఖాజా బందే నవాజ్‌

నా పేరు ఖాజా బందేనవాజ్‌. బీఏ వరకు చదివాను. వయసు 60 సంవత్సరాలు. వెల్డింగ్‌ పనిచేస్తూ.. జీవనం సాగిస్తున్నా. నలుగురు పిల్లలు ఉన్నారు. రోజూ నా వృత్తి కొనసాగించడంతో పాటు రెండు గంటలు ఫుడ్‌బాల్‌ సాధన చేయడం అలవర్చుకున్నా. ఇటీవల పుణేలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో 60 ప్లస్‌లో వంద మీటర్ల హార్డిల్స్‌, పరుగు పందేం పోటీల్లో బంగారు, 300 మీటర్ల హార్డిల్స్‌లో కాంస్య పతకాలు సాధించా. 20 ఏళ్లుగా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొంటున్నా. నాలుగు జాతీయ స్థాయి, ఓ సారి పిలిఫిన్స్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నా. మొదటి సారి జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో 30కి పైగా పతకాలు అందుకున్నా. అందులో 25 స్వర్ణ పతకాలున్నాయి. చిన్నతనం నుంచే ఫుట్‌బాల్‌ క్రీడాకారుడిని పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ పోటీల్లో పాల్గొనేవాణ్ని. కచ్చితంగా అవార్డులు సొంతం చేసుకునేవాళ్లం. 60 ఏళ్లు పైబడినా నేటికీ క్రీడల్లో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది.కర్నూలు, ఆదోని మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సహకారం మరువలేనిది. చివరి వరకు క్రీడల కోసం సమయం కేటాయిస్తా.. పోటీల్లో పాల్గొంటూనే ఉంటా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని