logo

ప్రభుత్వ మద్యం.. అక్రమాలు అధికం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాల పర్వం కొనసాగుతోంది.

Published : 24 Feb 2024 02:13 IST

కల్లూరు వక్కెర వాగు వద్దనున్న ప్రభుత్వ మద్యం దుకాణం

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాల పర్వం కొనసాగుతోంది. ఒకవైపు ప్రభుత్వం అధిక ధరలతో దోపిడీ చేస్తుండగా, మరోవైపు సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. పలువురు మద్యనిషేధ, అబ్కారీ శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ఈ తరహా అక్రమాలకు ఊతమిస్తున్నాయి.

అధిక ధరల దగా..

ఉమ్మడి జిల్లాలో 175 ప్రభుత్వ మద్యం దుకాణాలున్నాయి. ఒక్కో దుకాణంలో ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు సేల్స్‌మెన్లు పని చేస్తున్నారు. మద్యం విక్రయాలు తక్కువగా ఉండేచోట ఒకే సేల్స్‌మెన్‌ను నియమించారు. అధిక శాతం మంది ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఉద్యోగాలు పొందినవారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మద్యం ధరలతో పోల్చితే మన రాష్ట్రంలో ధరలు అధికంగా ఉన్నాయి. మందుబాబులు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనే కొనుగోలు చేసి తాగుతున్నారు. దుకాణాల ముందు ధరల పట్టిక లేకపోవడం, రసీదు విధానం అమలు కాకపోవడంతో పలువురు సేల్స్‌మెన్లు, సూపర్‌వైజర్లు ఇదే అదునుగా చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తూ మోసగిస్తున్నారు. కర్నూలులోని కల్లూరు వక్కెర వాగు వంతెన వద్ద ప్రభుత్వ దుకాణంలో ఎమ్మార్పీ రూ.140 ఉన్న ఓ బ్రాండ్‌ మద్యం సీసాను రూ.180కు విక్రయిస్తుండగా డీసీ తనిఖీ బృందం నిఘా ఉంచి పట్టుకుంది. సేల్స్‌మెన్‌ వడ్డె చక్రిపై కర్నూలు సెబ్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఒక్క సీసాపై రూ.40 అధికంగా తీసుకుంటున్న తీరు చూస్తే మందుబాబులను ఏమేర మోసం జరుగుతుందో అంచనా వేసుకోవచ్చు. సుంకేసులలో వెంకటేశ్‌ అనే సేల్స్‌మెన్‌ అధిక ధరలకు విక్రయిస్తూ దొరికిపోయారు. గతంలో కర్నూలులోని వెంకటరమణ కాలనీలో మద్యం దుకాణాల్లోనూ అధిక ధరలకు విక్రయిస్తూ పట్టుబడ్డారు. పత్తికొండ, ఆలూరు, ఆస్పరి ప్రాంతాల్లో అధిక ధరలకు అమ్ముతున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలో దాదాపు 20 మంది ఉద్యోగులను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై తొలగించారని తెలిసింది. అధికార పార్టీ నేతలకు రూ.లక్షల ముడుపులు ఇచ్చి వారి సిఫారసులతో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు పొందినవారే ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

కల్తీ సరకు అమ్మకం

దుకాణాల్లో మద్యాన్ని కల్తీ చేస్తున్నారనేది వాస్తవమని తేలింది. కర్నూలులోని ఓ మద్యం దుకాణంలో మద్యం కల్తీ చేసి విక్రయిస్తున్నట్లు అబ్కారీ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి పట్టుకున్నారు. ఈ మేరకు సూపర్‌వైజర్‌ జనార్దన్‌, సేల్స్‌మెన్‌ రవికుమార్‌పై కర్నూలు సెబ్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఉమ్మడి జిల్లాలో మరికొన్ని దుకాణాల్లో ఈతరహా మోసం జరుగుతుంది. తక్కువ ధర మద్యాన్ని ఖాళీ ఖరీదైన మద్యం సీసాల్లో నింపి కల్తీ చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బార్‌లలోనూ భారీగా మద్యం కల్తీ చేస్తున్నారు. మద్యం మత్తులో ఉండే మందుబాబులకు కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. పలువురు ఉద్యోగులు గొలుసు దుకాణాలకు మద్యం విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుంటున్నారు. మద్యం విక్రయాలు పెరిగి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్న కారణంగా అబ్కారీ అధికారులు పట్టించుకోవటం లేదు. గొలుసు దుకాణాల్లో తెలంగాణ, కర్ణాటక మద్యాన్ని విక్రయించినట్లయితే దాడులు చేసి కేసు నమోదు చేస్తున్నారు.

దుకాణాల సొమ్ము స్వాహా

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పలువురు సేల్స్‌మెన్లు మద్యం సొమ్మును స్వాహా చేస్తున్నారు. వారి సొంత అవసరాలకు డబ్బును వాడుకుంటుండటా, మరికొందరు మద్యాన్ని అప్పు కింద విక్రయిస్తున్నారు. ఇటీవల ఉల్లిందకొండ పరిధిలో రూ.50 వేలకుపైగా ఇలా స్వాహా చేసినట్లు బయటపడింది. కర్నూలులోని జొహరాపురం మద్యం దుకాణంలో సిబ్బంది రూ.లక్షకుపైగా నగదు స్వాహా చేసినట్లు వెలుగు చూసింది. నంద్యాల జిల్లా కానాలలో రూ.లక్షకుపైగా తన సొంతానికి వాడుకోవడంతో రికవరీ చేయడానికి అధికారులు కష్టపడాల్సి వచ్చింది. పత్తికొండ, చిప్పగిరి, ఆస్పరి, నంద్యాల తదితర ప్రాంతాల్లో ఉద్యోగులు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వినియోగించుకున్న ఘటనలు బయటపడ్డాయి. మండలాల్లో అధికార పార్టీ నేతలు మద్యం దుకాణాలపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఒత్తిళ్లు తట్టుకోలేక గార్గేయపురం గ్రామంలో ఓ సేల్స్‌మెన్‌ తనను మరో దుకాణానికి మార్చాలని అధికారులను కోరుతూ లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని