logo

పాద బాట.. పన్ను మోత

దట్టమైన అడవి.. ఏటా మహా శివరాత్రి, ఉగాది పర్వదినాల్లో భక్తులు పాదబాటలో వెళ్తుంటారు.

Published : 24 Feb 2024 02:17 IST

శ్రీశైలానికి నడిచి వెళ్లే భక్తులపై భారం
నిబంధనల పేరిట అటవీ సిబ్బంది బాదుడు

దట్టమైన అడవి.. ఏటా మహా శివరాత్రి, ఉగాది పర్వదినాల్లో భక్తులు పాదబాటలో వెళ్తుంటారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి లక్షలాది భక్తులు నడిచి వెళ్లి భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వార్లను దర్శనం చేసుకుంటారు. ఈ ఏడాది   ఐదు లక్షల మంది భక్తులు నడిచి వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది ఒక్కో భక్తుడి నుంచి రూ.10 వసూలు చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. దీనిపై భక్తులు మండిపడుతున్నారు.

న్యూస్‌టుడే, ఆత్మకూరు

రశీదులు చూపుతున్న కన్నడిగులు

ఆత్మకూరు పట్టణ సమీపంలో మొదలైన నడక వెంకటాపురం, నాగలూటి, దామెరకుంట, పెద్ద చెరువు, మఠంబావి, భీముని కొలను, కైలాస ద్వారం మీదుగా ఇలకైలాసం(శ్రీశైలం) వరకు కొనసాగుతుంది. మొత్తం 40 కి.మీ నల్లమల అడవిలో వెళ్లాల్సి ఉంటుంది. పల్లెకట్ట వద్ద అటవీ సిబ్బంది బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసింది. పాదచారుల వద్ద రూ. 10  తీసుకొని రశీదు ఇస్తున్నారు. డబ్బులు చెల్లించకపోతే వెనక్కి పంపిస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసమట

డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కన్నడిగులు ఆందోళన చేపట్టారు. ఒక్కో భక్తుడి నుంచి రూ.పదేసి వసూలుకు సంబంధించి ఉత్తర్వు కాపీ చూపమని భక్తులు అడిగితే అటవీ శాఖ సిబ్బంది నీళ్లు నములుతున్నారు. ‘‘ ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి జీవో కాపీ లేదు.. అధికారుల ముద్రతో ఉన్న రశీదు మాత్రమే ఇస్తున్నాం.. అటవీ మార్గంలో నడిచి వెళ్లే భక్తులు ప్లాస్టిక్‌ తదితర చెత్త వేస్తున్నారు.. వాటిని తొలగించేందుకు, సిబ్బంది వేతనాలు.. పర్యావరణ నిర్వహణ ఛార్జీలు వసూలు చేయమని అధికారులు చెప్పారంటూ సిబ్బంది సమాధానం ఇస్తున్నారు.

వాహనదారులకు

శ్రీశైలానికి వెళ్లే వాహనదారుల నుంచి పర్యావరణ పరిరక్షణ, నిర్వహణ ఖర్చుల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో టోల్‌ గేట్‌ ఏర్పాటు చేశారు.. పెద్ద వాహనాలైతే రూ.100, చిన్నవైతే రూ.50 చెల్లించాలి. సాధారణ రోజుల్లో రూ.40 వేలు, శివరాత్రి, ఉగాది పర్వదినాల్లో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు రోజుకు వసూలవుతోంది. నల్లకాల్వ సమీపంలోని రుద్రకోటేశ్వర క్షేత్రానికి వెళ్లాలన్నా అటవీ సిబ్బంది ఆంక్షలు విధించారు. భక్తులు తాము వచ్చిన వాహనంలోనే అడవిలోకి వెళ్లాలంటే రూ.300 చెల్లించాలి.

15 రోజులు.. రూ.50 లక్షలు

మహాశివరాత్రికి పదిహేను రోజుల ముందు నుంచే నడక మార్గంలో భక్తులు వెళ్తుంటారు. ఈసారి ఐదారు లక్షల మంది వస్తారని అంచనా. దాదాపు రూ.50 లక్షలు పోగయ్యే అవకాశం ఉంది. ఉగాదికి  ఇంత కంటే రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కేవలం రెండు నెలల్లో రూ. కోటికి పైగా సొమ్ము వసూలయ్యే అవకాశం ఉంది.

సౌకర్యాలు కల్పించాలి
గురురాజ్‌, కర్ణాటక

వేల కి.మీ. నుంచి కన్నడిగులం ఏటా స్వామి దర్శనానికి కాలిబాటన వస్తుంటాం. ప్రభుత్వం, దేవస్థానం అధికారులు అటవీ మార్గంలో కనీస సౌకర్యాలు కల్పించకపోగా..ఛార్జీల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అడవి మార్గంలో అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. దేవుడి దర్శనానికి నడిచి వెళ్తూ డబ్బులు ఎలా చెల్లించాలి. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ముఖ్యమంత్రి చొరవ చూపి ఛార్జీల వసూలు జరగకుండా చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని