logo

ఆరోగ్యశ్రీకి పక్షవాతం

కొనగంటి అంజలికి పదేళ్లు. కాలు, చేయీ పడిపోయిందంటూ 2022 మే 2న ఆరోగ్యశ్రీ కింద ఓ నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో వైద్యం చేశారు.

Published : 24 Feb 2024 02:18 IST

  • కొనగంటి అంజలికి పదేళ్లు. కాలు, చేయీ పడిపోయిందంటూ 2022 మే 2న ఆరోగ్యశ్రీ కింద ఓ నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో వైద్యం చేశారు. ఇందుకు ఆ పాపకు ఆసరా సొమ్ము రూ.30 వేలు, ఆసుపత్రి వైద్యసేవల కింద రూ.20 వేలు జమయ్యాయి.
  • చిన్నారి ఎ.సాక్షికి కాలు, చేయీ పడిపోయిందంటూ 2022 సెప్టెంబరు 17న అదే నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో చేరారు. ఆ కుటుంబానికి ఆసరా సొమ్ము రూ.30 వేలు, ఆసుపత్రికి రూ.20 వేలు నిధులొచ్చాయి.
  • సురేఖకు కాలు, చేయీ పనిచేయడం లేదని 2022 సెప్టెంబరు 17న అదే నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో చేరారు. ఈమెకూ ఆసరా సొమ్ము, ఆసుపత్రికి నిధులు సమకూరాయి.

... ఈ ముగ్గురే కాదూ.. 2022 ఏప్రిల్‌ నుంచి 2024 జనవరి వరకు 2,500 మంది కాలు, చేయీ పడిపోయినట్లు కర్నూలు నగరంలో ఓ నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు పక్క జిల్లాల వారికీ ఇక్కడ వైద్య సేవలు అందించినట్లు లెక్కలు రాసుకొని సొమ్ము బొక్కేశారు. డయోగ్నోస్టిక్‌ ల్యాబ్‌తో కుమ్మక్కై కాలు, చేయీ పడిపోయినట్లు నకిలీ నివేదికలు సృష్టించి ఆరోగ్యశ్రీ కింద రూ.కోట్లలో కాజేశారు.

న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం

పదేళ్ల పిల్లల పేరిట కాజేత  

సదరు నెట్‌వర్క్‌ ఆసుపత్రి నుంచి 2,500 కేసుల వివరాలు పంపిస్తే ఆరోగ్యశ్రీ ట్రస్టు ఒక్క కేసు కూడా తిరస్కరించకపోవడం గమనార్హం. ట్రస్టు సభ్యుల సహకారంతోనే ఆసుపత్రి యాజమాన్యం రూ.కోట్లు కొట్టేశారనే ఆరోపణలున్నాయి. కర్నూలు సర్వజన వైద్యశాలలో ఎక్స్‌రే, ఎమ్మారై, చిన్నచిన్న వాటికి లేవని నెలకు సుమారు వందల సంఖ్యలో కేసులు తిరస్కరిస్తున్నారు. అలాంటిది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పక్షవాతం కేసులు సదరు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద చేర్చి నిధులు కాజేయడం గమనార్హం. ఆలస్యంగా గుర్తించిన ట్రస్టు సభ్యులు నాలుగు రోజుల కిందట ప్రత్యేక వైద్యులతో విచారణ చేపట్టారు. ఈ సమయంలో కేవలం ఇద్దరు ఎంబీబీఎస్‌ వైద్యులు, మధ్యాహ్న సమయంలో ఈఎస్‌ఐ ఆసుపత్రిలో పని చేసే ఓ వైద్యుడు ఉండటం గమనార్హం.

నగరంలో ఓ ఆసుపత్రితో దోపిడీ పర్వం

కర్నూలు సర్వజన వైద్యశాలకు ఉమ్మడి కర్నూలు, అనంతపురం, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర నుంచి రోగులు వస్తుంటారు. ఇక్కడ న్యూరోకు సంబంధించి మూడు నెలల్లో 400 నుంచి 500 కేసులు ఆరోగ్యశ్రీ కింద నమోదు కాలేదు. ఏడాది లెక్కలు తీసుకుంటే 1,600 నుంచి 2 వేలలోపే ఉంటాయి. నగరంలోని కొత్త బస్టాండు సమీపంలో ఉన్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందిన వారి లెక్కలు తీసుకుంటే అన్నీ అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. సదరు నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో జనరల్‌ ఫిజిషియన్‌, న్యూరో ఫిజిషియన్‌ లేరు, ప్రభుత్వ వైద్యుడు ఒకరు మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంటారు. అలాంటి చోట 2,500 మందికి వైద్యం అందించడం ఏవిధంగా సాధ్యమైందన్నది అనుమానం.

డోన్‌లో రూ.1.80 కోట్లు నొక్కేశారు

ఆరోగ్యశ్రీలో టైఫాయిడ్‌, డెంగీతోపాటు యాంజియోగ్రామ్‌ పరీక్షలకు బిల్లులు పొందే అవకాశం ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఉంది. డోన్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి నిర్వాహకులు నకిలీ రోగులతో మోసానికి పాల్పడ్డారు. ఈ ఆసుపత్రిలో నెలకు రూ.1.80 కోట్ల వరకు మోసం జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని నడిపించడానికి డోన్‌ ఆసుపత్రి నిర్వాహకులు గుత్తి, పామిడిలో ఏజెంట్లను నియమించుకున్నారు. నకిలీ రోగిని ఆసుపత్రికి తీసుకొస్తే రూ.5 వేలు, రోగికి రూ.వెయ్యి వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు