logo

గొంతు దిగని గోరుముద్ద

జగనన్న గోరుముద్ద గొంతుదిగడం లేదు.. నాణ్యతకు తిలోదకాలిచ్చారు.

Published : 24 Feb 2024 02:20 IST

23,808 మంది తినలేదు
కలెక్టర్‌ ఆదేశాలు బుట్టదాఖలు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: జగనన్న గోరుముద్ద గొంతుదిగడం లేదు.. నాణ్యతకు తిలోదకాలిచ్చారు. పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ఆచరణ అధ్వానంగా ఉంటోంది. కొన్ని పాఠశాలల్లో శుక్రవారం ‘న్యూస్‌టుడే’ పరిశీలించగా.. ముద్దలుగా ఉన్న అన్నాన్ని వడ్డించడంతో విద్యార్థులు సరిగా తినలేకపోయారు. జిల్లాలో 1,459 ప్రభుత్వ యాజమాన్య బడుల్లో 2,71,215 మంది విద్యార్థులు ఉన్నారు. శుక్రవారం 2,15,235 మంది  హాజరయ్యారు. ఇందులో 53,808 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినలేదని అధికారులు లెక్కించారు. అలాగే ఎయిడెడ్‌ బడుల్లో 4,191 మంది విద్యార్థులు చదువుతున్నారు.

ఐజీఎంఎం పాఠశాలలో ముద్దలుగా ఉన్న అన్నం

విద్యార్థుల ఫిర్యాదు

కలెక్టర్‌ బంగ్లాకు కూత వేటు దూరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్‌ పాఠశాలలో కుళ్లిన గుడ్లు, పురుగులు పట్టిన చిక్కీలు, నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్నారంటూ కొందరు విద్యార్థినులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు తాఖీదులిచ్చి చేతులు దులుపుకొన్నారు. పూర్తి స్థాయిలో విచారించాలని కలెక్టర్‌ ఆదేశించినా.. ఆర్జేడీ రాఘవరెడ్డి కర్నూలుకు వచ్చారంటూ విచారణను అటకెక్కించారు.  డిప్యూటీ ఈవో స్థాయిలో విచారణకు వెళ్లిన తనిఖీ అధికారులు ఇందిరాగాంధీ మెమోరియల్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగుందని కితాబు ఇవ్వడం ఏమటిన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

పర్యవేక్షణ కుర్చీకే పరిమితం

మధ్యాహ్న భోజన పథకానికి చెందిన అధికారి కుర్చీకే పరిమితమవ్వడంతో ఈ పరిస్థితి నెలకొందని కొందరు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈయనకు అదనంగా రెండు బాధ్యతలు ఉన్నాయనే సాకుతో కార్యాలయం వదిలి వెళ్లే పరిస్థితి లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో మధ్యాహ్న భోజన పథకానికి ప్రత్యేకంగా ఏడీ స్థాయిలో ఒక అధికారి ఉండేవారు. ఆయన పదోన్నతిపై ఇతర జిల్లాకు వెళ్లినప్పటి నుంచి ఆ పోస్టు అలాగే ఖాళీగా ఉండిపోయింది. ఈ విషయంపై డీఈవో శామ్యూల్‌ మాట్లాడుతూ... భోజనం నాణ్యతగా లేకుంటే ఆయా ఏజెన్సీలను రద్దు చేయడంతోపాటు ప్రధానోపాధ్యాయులకు నోటీసులు ఇస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు