logo

వాము రైతుకు వాత

వాము రైతులను కమీషన్‌ ఏజెంట్లు దగా చేస్తున్నారు... దాన్ని మార్కెట్‌ కమిటీ సమర్థిస్తోంది.  

Published : 24 Feb 2024 02:22 IST

కర్నూలు మార్కెట్లో కమీషన్ల పర్వం
ఏజెంట్ల జేబుల్లోకి రూ.28.50 లక్షలు

బండిలో వెళ్తోంది 41 సంచులు

వాము రైతులను కమీషన్‌ ఏజెంట్లు దగా చేస్తున్నారు... దాన్ని మార్కెట్‌ కమిటీ సమర్థిస్తోంది.  ఒక్కో లాట్‌ నుంచి రెండు కిలోల మేర కోత పెడుతున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు వాము క్రయవిక్రయాలకు ప్రసిద్ధి. ఉమ్మడి కర్నూలు, తెలంగాణ, కర్ణాటక నుంచి రైతులు పెద్ద ఎత్తున సరకు తీసుకొస్తుంటారు. గత నెల 23 నుంచి క్రయవిక్రయాలు ప్రారంభయ్యాయి. సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి 9,500 లాట్లకు 2 కిలోల చొప్పున ఇప్పటి వరకు 190 క్వింటాళ్లు స్వాహా చేశారు. సరాసరి ఒక క్వింటాలు వాము ధర రూ.15,000 లెక్కన 190 క్వింటాళ్లకు రూ.28.50 లక్షల విలువ చేసే వాము పైకం కమీషన్‌ ఏజెంట్ల జేబుళ్లోకి వెళ్లింది.

న్యూస్‌టుడే, కర్నూలు మార్కెట్‌

మైకులో మాట.. అమల్లో దాటవేత

గేట్‌ పాస్‌ రసీదులో  38.33 సంచులు

వాము రైతుల నుంచి 2 కిలోలు కమీషన్‌ ఏజెంట్లు తీసుకోరాదని మైకుల్లో ప్రచారం చేస్తున్నారు. అంత వరకు బాగానే ఉన్నా... అదే మార్కెట్‌ కమిటీవారు 2 కిలోలు తగ్గించి ఈ.నామ్‌ బిల్లులు ఇస్తున్నారు. కమీషన్‌ ఏజెంట్లు రెండు కిలోలు స్వాహా చేయడాన్ని మార్కెట్‌ కమిటీ సమర్థిస్తోందన్నమాట. మార్కెట్‌కు ఓ రైతు వామును తీసుకురాగా.. తూకం వేసి 2.77 క్వింటాళ్లు ఉన్నట్లు పచ్చ రశీదులో రాసి ఇచ్చారు. దానికి సంబంధించి మార్కెట్‌ యార్డులో ఈ.నామ్‌ బిల్లు తెచ్చుకోగా 2.75 క్వింటాళ్లు చూపారు. ఇలా ప్రతి ఒక్క రైతుకు కోత పెడుతున్నారు.

సెస్సుకు ఎగనామం

ఓ వ్యాపారి శకుంతల ట్రేడర్స్‌ ద్వారా కొనుగోలు చేసిన వామును బయటకు తీసుకెళ్లారు. మొత్తం 38.33 సంచులున్నట్లు గేట్‌ పాస్‌ రశీదులో నమోదై ఉంది. వాస్తవంగా తీసుకెళ్లింది 41 సంచులు. పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన వ్యాపారులు మార్కెట్‌కు సెస్‌ కట్టాల్సి వస్తుందని ఇలా తప్పుడు రశీదు పత్రాలతో సరకును బయటకు తరలిస్తున్నారనే విమర్శలున్నాయి. నిత్యం వందల సంచులు ఇలా బయటకు తరలిస్తున్నా సిబ్బంది పట్టుకోవడం లేదు.

రెండు కిలోల కోత

‘‘ కర్నూలు పెద్ద మార్కెట్లో కమీషన్‌ ఏజెంట్‌ (లైసెన్సు నంబరు 407) దుకాణంలో వాము విక్రయానికి ఉంచా.. క్వింటా రూ.15,369 పలికింది.. మూడు సంచులు విక్రయానికి తీసుకురాగా 98 కిలోల తూకమైంది.. ఈ-నామ్‌లో 96 కిలోలే నమోదు చేసి బిల్లు ఇచ్చారు. కమీషన్‌ ఏజెంట్‌ దుకాణం వారికి 2 కిలోలుపోనూ 96 కిలోలకే నగదు చెల్లించారు. 2 కిలోల వామును కమీషన్‌ ఏజెంట్‌ కొట్టేశారు. సాధారణంగా 2 శాతం కమీషన్‌తోపాటు రెండు కిలోల వాము ధర కలిపి రూ.602.40 కమీషన్‌ ఏజెంట్‌ పట్టుకొని మిగిలిన పైకం ఇచ్చారని ’’ అవుకు మండలం కొండమనాయనిపల్లెకు చెందిన గంగాధర్‌ వాపోయారు.

కమీషన్‌ భారం

‘‘ ఆరు సంచుల వాము విక్రయానికి తెచ్చా. క్వింటా రూ.17,444 పలికింది. 2.77 క్వింటాళ్లు విక్రయించగా ఈ.నామ్‌ బిల్లు 2.75 క్వింటాళ్లకే ఇచ్చారు. కమీషన్‌ ఏజెంట్‌ 2 శాతం కమీషన్‌ రూ.959.42 పట్టుకొని మిగిలిన పైకం చెల్లిస్తున్నారు.. మళ్లీ 2 కిలోలు తీసేసి 2.75 క్వింటాళ్లకే బిల్లు ఇస్తున్నారు.. రెండు శాతం కమీషన్‌తోపాటు 2 కిలోల వాముకు రూ.348.88 కలిపి మొత్తం రూ.1,308.3 కమీషన్‌ తీసుకున్నారని’’ కొండమనాయనిపల్లెకు చెందిన వెంకటకృష్ణ వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని