logo

అధికారం అండ.. ఆక్రమణ కంచె

మధ్యతరగతి కుటుంబాలు.. పైసా.. పైసా పోగు చేసి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారు. ధరలు పెరగడంతో ‘అధికారం’ కన్నేసింది..

Updated : 24 Feb 2024 03:52 IST

రూ.40 కోట్ల విలువైన భూమిపై కన్ను
పంచాయితీ పెట్టిన ప్రజాప్రతినిధి అనుచరులు

లేఅవుట్‌కు వెళ్లే ప్రధాన దారిలో ఇలా..

ఈనాడు, కర్నూలు: మధ్యతరగతి కుటుంబాలు.. పైసా.. పైసా పోగు చేసి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారు. ధరలు పెరగడంతో ‘అధికారం’ కన్నేసింది.. పేదలు కొనుగోలు చేసిన స్థలాలు తమ పూర్వీకులవని, వారు ఎవరికీ విక్రయించలేదు.. తమకే చెందుతాయంటూ కంచెలు వేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు పంచాయితీ పెట్టారు. ఆ భూమి జోలికి రాకుండా ఉండాలంటే రూ.10 కోట్లు చెల్లించాలంటూ రంగంలోకి దిగారు. సెంటుకు రూ.3 లక్షలు ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. అంత సొమ్ము చెల్లించుకోలేమని పేదలు విన్నవించుకున్నా పెద్దలు వినిపించుకోవడం లేదు.

హద్దులు చెరిపి.. పునాదులు కూల్చి

సదరు వ్యక్తి ప్లాట్లలోకి నంబరు లేని ఓ జేసీబీని తీసుకెళ్లి సరిహద్దు రాళ్లను తొలగించారు. భూమిని దున్నేశారు. ఓ ప్లాటు యజమాని ఇంటి నిర్మాణానికి తీసిన పునాదులు కూల్చేశారు. కొన్నిచోట్ల గుంతలు తవ్వేశారు. ఆ ప్లాట్లలోకి వెళ్లే ప్రధాన మార్గానికి అడ్డంగా కంచె వేసి ఆ భూమిలోకి వెళ్లడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేసేసరికి ఆయా ప్లాట్ల యజమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఇదెక్కడి దౌర్జన్యమంటూ నిలదీసినా వారికి సమాధానం చెప్పేవారే కరవయ్యారు. ఆ భూమిపై హక్కు ఉంటే దాన్ని చట్టపరంగా నిరూపించుకోవాలి, న్యాయస్థానాల నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని వెళ్లాలి.. కానీ అందుకు భిన్నంగా దౌర్జన్యం చేయడమేంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

4.22 ఎకరాలు.. 44 ప్లాట్లు

కర్నూలు నగర శివారులోని జొహరాపురం గ్రామ పొలిమేరలో సర్వే నంబరు 124లో సుమారు 4.22 ఎకరాల పొలం ఉంది. దాన్ని 2008లో ఓ స్థిరాస్తి వ్యాపారి కొనుగోలు చేసి 44 ప్లాట్లుగా విభజించి విక్రయించారు. సెంటు రూ.50 వేల నుంచి రూ.60 వేల చొప్పున పలువురు కొనుగోలు చేశారు. అందులో ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. మూడు సెంట్ల ప్లాటును గరిష్ఠంగా రూ.1.80 లక్షలు చెల్లించారు. ఒక్కరూ ఇల్లు నిర్మించుకోలేదు.. ప్రస్తుతం అక్కడ సెంటు రూ.10 లక్షలు పలుకుతోంది. ఆ భూమి తమ పూర్వీకులదని రెండేళ్ల కిందట ఓ వ్యక్తి హంగామ చేశారు. దస్తావేజులు, లింకు దస్తావేజులన్నింటినీ పరిశీలన చేయించుకున్నారు. తమకు విక్రయించిన వ్యక్తి ఎలాంటి మోసం చేయలేదని నిర్ధారించుకున్నారు.

ఎస్పీకి ఫిర్యాదు చేసినా

తమ భూముల్లోకి అక్రమంగా వెళ్లారని కొందరు బాధితులు రెండేళ్ల కిందట నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన సూచన మేరకు మూడో పట్టణ పోలీసులనూ ఆశ్రయించారు. నాటి మూడో పట్టణ సీఐ పలువురిని పిలిపించి హెచ్చరించడంతో వివాదానికి కొంత కాలంపాటు తెర పడింది. గతేడాది వివాదం మళ్లీ మొదలైంది. దీంతో బాధితులు గతేడాది అక్టోబరులో ఎస్పీని ఆశ్రయించారు. ఆయన సూచన మేరకు మళ్లీ సీఐ వద్దకెళ్లారు. అది సివిల్‌ వివాదమని, న్యాయస్థానాల్లో తేల్చుకోవాలని సూచించడంతో వారికి ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. తమ భూముల్లోకి అక్రమంగా జేసీబీతో వెళ్తే అది సివిల్‌ వివాదం ఎందుకవుతుందని, అక్రమ చొరబాటు కింద కేసు నమోదు చేయాలని కోరినా పోలీసులు నేటికీ కేసు పెట్టిన దాఖలాలు లేవు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని