logo

బరిలో నేత.. బలగం సందడి

కోడుమూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరిని నియమించడంపై శనివారం గూడూరులోని విష్ణు వర్గీయులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. గూడూరు మండలానికి చెందిన నేతలు కర్నూలులోని విష్ణు నివాసానికి వెళ్లి దస్తగిరికి శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 25 Feb 2024 06:04 IST

కోట్లసూర్యప్రకాశ్‌రెడ్డికి అభినందనలు తెలుపుతున్న నాయకులు

గూడూరు, న్యూస్‌టుడే: కోడుమూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరిని నియమించడంపై శనివారం గూడూరులోని విష్ణు వర్గీయులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. గూడూరు మండలానికి చెందిన నేతలు కర్నూలులోని విష్ణు నివాసానికి వెళ్లి దస్తగిరికి శుభాకాంక్షలు తెలిపారు. నగర పంచాయతీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ రామాంజనేయులు, కౌన్సిలర్‌ బుడ్డంగిలి, కోడుమూరు షాషావళి, చాంద్‌బాషా, కృష్ణ ఉన్నారు.

నాలుగు స్తంభాల కూడలి వద్ద బాణసంచా కాల్చుతున్న తెదేపా నాయకులు, అభిమానులు

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే : తెదేపా  పత్తికొండ అభ్యర్థిగా కేఈ శ్యాంబాబు పేరు అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడంతో  పార్టీ మండల కన్వీనర్‌ కె.సుధాకర్‌ ఆధ్వర్యంలో  ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. శ్యాంబాబును అభ్యర్థిగా ప్రకటించడం హర్షనీయమని, పత్తికొండలో తెదేపాను గెలిపించి అధినేతకు కానుకగా  ఇస్తామని నాయకులు కార్యకర్తలు తెలిపారు. వైకాపా హయాంలో ఐదేళ్లపాటు  విధ]్వంసకర పాలన సాగిందన్నారు.  తెదేపా అధికారంలోకి వస్తే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రానున్న ప్రభుత్వంలో చేపట్టబోయే పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమ్లానాయక్‌, బీటీ గోవిందు, వెంకటపతి, శ్రీనివాసులు, చెన్నమనాయుడు, దివాకర్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

డోన్‌, న్యూస్‌టుడే: డోన్‌ తెదేపా అభ్యర్థిగా కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటించటంతో తెదేపా నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. శనివారం తొలుత మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ కేశన్నగౌడ్‌ ఇంటి నుంచి నాయకులు, కార్యకర్తలు పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. పాతబస్టాండ్‌లో పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. డోన్‌ పట్టణం నుంచే కాకుండా మండలంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు కర్నూలు వెళ్లి సూర్యప్రకాశ్‌రెడ్డిని కలసి అభినందనలు తెలిపారు. లక్కసాగరం లక్ష్మిరెడ్డి, కేశన్నగౌడ్‌, చండ్రపల్లె ఆచారి, ఓం ప్రకాష్‌, శేషిరెడ్డి, వలసలరామకృష్ణ, సలీంద్రశ్రీనివాసులు, అలేబాదుపరమేష్‌తో పాటు, జనసేన నాయకులు ఆలామోహన్‌రెడ్డి, మహేష్‌ పాల్గొన్నారు.

టి.జి భరత్‌ను సన్మానిస్తున్న నాయకులు

కర్నూలు సచివాలయం : కర్నూలు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు టి.జి.భరత్‌ పేరును ప్రకటించడంతో తెదేపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నగరంలో పార్టీ నాయకులు, అభిమానుల సమక్షంలో శనివారం టి.జి.భరత్‌ కేక్‌ కోసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఆళ్లగడ్డలో సంబరాలు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా భూమా అఖిలప్రియకు సీటు ఖరారవ్వడంతో తెదేపా కార్యకర్తల సంబరాలు అంబరాన్ని తాకాయి. శనివారం పాతబస్టాండు, సత్రంవీధితో పాటు పలు చోట్ల కార్యకర్తలు బాణసంచా కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఓర్వకల్లు, కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను చంద్రబాబునాయుడు శనివారం ప్రకటించగా అందులో మాజీ ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి పేరు ఉండటంతో మండల పరిధిలోని గ్రామాల్లో సంబరాలు మిన్నంటాయి. నన్నూరు, హుసేనాపురం, కాల్వ, ఓర్వకల్లు తదితర గ్రామాల్లో తెదేపా నాయకులు, అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెటు ఖరారు కావడంతో శ్రీశైలంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు శనివారం సంబరాలు చేసుకున్నారు. ఆలయ గంగాధర మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి స్వామిఅమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. ఆయన ప్రచారాలను కూడా వేగవంతం చేశారు.

తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల, ఫరూక్‌లను సత్కరిస్తున్న నాయకులు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : తెదేపా నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో నంద్యాల ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకుని చంద్రబాబునాయుడుకు బహుమతిగా అందిస్తామని నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌ చెప్పారు. ఫరూక్‌ను తెదేపా అభ్యర్థిగా ప్రకటించడంతో నాయకులు, కార్యకర్తలు శనివారం స్థానిక తెదేపా కార్యాలయంలో ఆయనను కలిసి పూలమాలలతో సత్కరించారు. కార్యాలయం వద్ద, వివిధ ప్రాంతాల్లో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఫరూక్‌ మాట్లాడుతూ.. నంద్యాలలో ప్రతి అభివృద్ధి పని తెదేపా హయంలోనే జరిగిందని తెలిపారు. శిల్పా కుటుంబం సాగిస్తున్న అరాచక పాలనకు అంతం పలికేందుకు తెదేపా నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేయాలని కోరారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, రాష్ట్ర కార్యదర్శులు ఏవీఆర్‌ ప్రసాద్‌, మునగాల విశ్వనాథరెడ్డి, ఎన్‌ఎండీ ఫిరోజ్‌, శివశంకర్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని