logo

బటన్‌ నొక్కినా.. ఆసరా కరవు

దళారుల ప్రమేయం లేకుండా నా అక్కాచెల్లెళ్ల ఖాతాల్లోకి నేరుగా ఆసరా సొమ్ము జమ చేస్తున్నా’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల 23న ఉరవకొండలో ఆసరా కార్యక్రమానికి హాజరై బటన్‌ నొక్కారు. నెల రోజులవుతున్నా ఖాతాల్లో సొమ్ము జమ కాలేదు.

Published : 25 Feb 2024 02:58 IST

బ్యాంకుల చుట్టూ మహిళల ప్రదక్షిణలు

న్యూస్‌టుడే,  కర్నూలు సచివాలయం: దళారుల ప్రమేయం లేకుండా నా అక్కాచెల్లెళ్ల ఖాతాల్లోకి నేరుగా ఆసరా సొమ్ము జమ చేస్తున్నా’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల 23న ఉరవకొండలో ఆసరా కార్యక్రమానికి హాజరై బటన్‌ నొక్కారు. నెల రోజులవుతున్నా ఖాతాల్లో సొమ్ము జమ కాలేదు. పలితంగా మహిళలు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వివిధ పథకాలకు సంబంధించి ఇటీవల ఏ బటన్‌ నొక్కినా సొమ్ము సకాలంలో ఖాతాలకు జమ కావడంలేదు. ఫలితంగా లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖాతాల్లో సొమ్ము పడాలంటే నెలలకొద్దీ వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎన్నికల ప్రకటన వచ్చేలోపు అందుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • మీ సంఘంలో ఒక్కో లబ్ధిదారురాలికి రూ.1,000 మొదలు రూ.50 వేలు, రూ.లక్ష వరకు ఆసరా సొమ్ము వస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామ, మండల మహిళా సమాఖ్యలు, పట్టణ మహిళా సమాఖ్యల ప్రతినిధులు రుణమాఫీ లబ్ధిపొందే సంఘాల నుంచి ముడుపులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
  • గ్రామీణ ప్రాంతాల్లో బుక్‌ కీపర్లకు డబ్బులు ఇవ్వాలంటూ ఒక్కో సభ్యురాలి నుంచి రూ.100 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ.500 నుంచి రూ.1,000 పైబడి బలవంతంగా తీసుకుంటున్నారు.

నాలుగు వారాలైనా..

కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌ ఆసరా పథకం కింద నాలుగో విడత ద్వారా గ్రామీణ ప్రాంతాలకు చెందిన 17,334 స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలకు రూ.90.87 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 8,371 సంఘాలకు రూ.51.49 కోట్లు కలిపి మొత్తం 25,705 సంఘాలకు రూ.142.36 కోట్లు ఆసరా మంజూరైంది. నాలుగు వారాలు దాటినా కనీసం 50 శాతం మందికి కూడా నగదు జమ కాలేదు. 

సంబరాలు చేసుకొని..

  • నాలుగో విడత రుణమాఫీ అమలును ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవాలనే ఆలోచనతో ఆసరా ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పెద్దఎత్తున సభలు నిర్వహించారు. లబ్ధిదారులు తప్పనిసరిగా హాజరయ్యేలా క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఆయా సభల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు హాజరై రానున్న ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలనే రీతిలో ఉపన్యాసాలు చేశారు. సభలు ముగిసినా నగదు మాత్రం జమ కాలేదు.
  • ఆసరా సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమైనప్పటికీ నెల రోజుల తర్వాత నగదు తీసుకోవాలంటూ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు తర్వాత ఖాతాల నుంచి సొమ్ము తీసుకోవాలని చెప్పడంతో చాలామంది తీవ్ర నిరాశ చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని