logo

హఫీజ్‌ఖాన్‌ అభిమానుల్లో అలజడి

కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను కాకుండా డాక్టర్‌ ఇలియాస్‌ బాషాను వైకాపా అధిష్ఠానం నిర్ణయించడంతో ఆయన అభిమానులు అలకబూనారు.  హఫీజ్‌ఖాన్‌ను కాకుండా మరొకరిని పోటీకి దించాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం పెద్ద తప్పిదమని..

Published : 25 Feb 2024 03:01 IST

భవిష్యత్తు కార్యాచరణపై మంతనాలు
నేడు ప్రాంతీయ సమన్వయకర్తతో భేటీ

ఈనాడు, కర్నూలు, కర్నూలు నగరం, న్యూస్‌టుడే : కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను కాకుండా డాక్టర్‌ ఇలియాస్‌ బాషాను వైకాపా అధిష్ఠానం నిర్ణయించడంతో ఆయన అభిమానులు అలకబూనారు.  హఫీజ్‌ఖాన్‌ను కాకుండా మరొకరిని పోటీకి దించాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం పెద్ద తప్పిదమని.. కండువాలు మార్చే అలవాటు ఉన్న వ్యక్తుల మాటలు విన్నారని కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి వైరల్‌ చేస్తున్నారు. పార్టీలు మారే నాయకుల మాటలు వింటున్నారని ఆ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎంత మంచి నాయకుడు ఉన్నా కేవలం రెడ్ల పెత్తనమే నడుస్తోందని అందులో పేర్కొనడం గమనార్హం.

ప్రత్యామ్నాయాలపై సమాలోచనలు

హఫీజ్‌ఖాన్‌ అనుకూల కార్పొరేటర్లు, నాయకులు, నామినేటెడ్‌ పదవులు పొందినవారు శనివారం సమావేశమయ్యారు. హఫీజ్‌ఖాన్‌కు టికెట్‌ నిరాకరిస్తూ వైకాపా పెద్దలు తీసుకున్న నిర్ణయంపై ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ టికెట్‌ అడగాలని కొందరు... ఎమ్మెల్సీ అడగాలని ఇంకొందరు ఆయనకు సూచించారు. ఎమ్మెల్సీ అయితే వైకాపా అధికారంలోకి వచ్చిన పక్షంలో మంత్రి పదవి దక్కే అవకాశాలుంటాయని ఆయనకు వివరించారు. ముందుగా జిల్లా అధ్యక్ష పదవి కూడా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. బి.వై.రామయ్య ఎంపీగా పోటీచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవిని తీసుకోవాలని కోరారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి ఆదివారం హఫీజ్‌ఖాన్‌ను కలవనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని