logo

కార్పొరేటర్‌ కుటుంబంపై దాడి

కర్నూలులో అధికార పార్టీకి చెందిన 28వ వార్డు కార్పొరేటర్‌ నారాయణరెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈనెల 23న లక్ష్మీపురంలో శ్రీసుంకులమ్మ జాతరకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వెంట వేర్వేరు వాహనాల్లో వెళ్తున్న క్రమంలో 41వ వార్డు కార్పొరేటర్‌ శ్వేతారెడ్డి, నారాయణరెడ్డి వాహనాన్ని పెద్దపాడు మాజీ సర్పంచి శ్రీధర్‌రెడ్డి వాహనం ఢీకొన్న నేపథ్యంలో ఇరువురి మధ్య గొడవ చోటుచేసుకుంది.

Published : 25 Feb 2024 03:03 IST

డిప్యూటీ మేయర్‌, ఆమె భర్త, మరో 13 మందిపై కేసు

దాడికి వస్తున్న నిందితులు..(సీసీ ఫుటేజీలో నమోదైన చిత్రం)

 కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలులో అధికార పార్టీకి చెందిన 28వ వార్డు కార్పొరేటర్‌ నారాయణరెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈనెల 23న లక్ష్మీపురంలో శ్రీసుంకులమ్మ జాతరకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వెంట వేర్వేరు వాహనాల్లో వెళ్తున్న క్రమంలో 41వ వార్డు కార్పొరేటర్‌ శ్వేతారెడ్డి, నారాయణరెడ్డి వాహనాన్ని పెద్దపాడు మాజీ సర్పంచి శ్రీధర్‌రెడ్డి వాహనం ఢీకొన్న నేపథ్యంలో ఇరువురి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో శనివారం ఉదయం 6.30 సమయంలో రాంరహీంనగర్‌లో ఉంటున్న నారాయణరెడ్డి ఇంటికి కొందరు వ్యక్తులు వెళ్లి ఆయనతోపాటు కుటుంబసభ్యులైన శేషారెడ్డి, హేమలత, శేషమణిపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. బాధితులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఈ క్రమంలో శ్వేతారెడ్డితో కలిసి నారాయణరెడ్డి శనివారం రాత్రి కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలో నిందితులు వచ్చిపోయే దృశ్యాలు నమోదు కాగా అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దాడికి వచ్చిన వారిలో 13 మంది ఉన్నట్లు గుర్తించగా కొద్దిదూరంలో మరికొందరు వాహనాల్లో సిద్ధంగా ఉండి తీసుకెళ్లినట్లు తెలిసింది. దాడికి పాల్పడిన వారిలో నగరపాలకసంస్థలో పనిచేసే ఉద్యోగులు చినబాబు, చిరంజీవి, బార్‌లో పనిచేసే సురేష్‌, శ్రీధర్‌రెడ్డి డ్రైవర్‌ మల్లి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. కాగా డిప్యూటీ మేయర్‌ రేణుక, ఆమె భర్త శ్రీధర్‌రెడ్డితోపాటు మరో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని