logo

పసుపు సేన.. ప్రజాఅభ్యర్థి

తెలుగుదేశం- జనసేన దళం తొలి జట్టు ఖరారైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. తొమ్మిది స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. గత నాలుగేళ్లుగా ప్రజల్లో ఉంటూ బలం పెంచుకున్న వారికే అధిష్ఠానం ప్రాధాన్యం కల్పించింది.

Updated : 25 Feb 2024 06:03 IST

తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ఖరారు
తెదేపా-జనసేన శ్రేణుల్లో ఆనందోత్సాహం

తెలుగుదేశం- జనసేన దళం తొలి జట్టు ఖరారైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. తొమ్మిది స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. గత నాలుగేళ్లుగా ప్రజల్లో ఉంటూ బలం పెంచుకున్న వారికే అధిష్ఠానం ప్రాధాన్యం కల్పించింది. నంద్యాల, శ్రీశైలం, పాణ్యం ఆళ్లగడ్డ, బనగానపల్లి, కర్నూలు, పత్తికొండ, నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారే వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవనున్నారు. డోన్‌కు వచ్చేసరికి ‘కోట్ల’ కుటుంబానికి అవకాశం ఇచ్చారు.. ఎస్సీ నియోజకవర్గం కోడుమూరుకు దస్తగిరికి టికెట్‌ కేటాయించారు. మిగిలిన ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, నందికొట్కూరు స్థానాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తమవారికి టికెట్లు రావడంతో అభ్యర్థుల అనుచరులు, అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల ప్రకటనకు ముందే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది.  తెదేపా ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు ఇప్పటికే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. వచ్చే ఎన్నికల్లో వీటి గురించి మరింతగా వివరించేందుకు తగిన సమయం దొరికినట్లవుతుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు.

ఈనాడు, కర్నూలు

డోన్‌లో కోట్ల!

లద్దగిరి (కోడుమూరు మండలం) చదువు: బీఏ

మూడుసార్లు ఎంపీగా పని చేసిన కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. డోన్‌లో ఆర్థిక మంత్రి బుగ్గనకు దీటైన ప్రత్యర్థి ఉండాలన్న ఉద్దేశంతో తెదేపా అధిష్ఠానం కోట్ల జయ సూర్య ప్రకాశ్‌రెడ్డిని రంగంలో దించింది. 1991, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున కర్నూలు నుంచి ఎంపీగా విజయం సాధించారు. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తించారు. గతంలో ఆదోని నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందుకు తెదేపాలో చేరిన ఆయన కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఐదేళ్లుగా తెదేపా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2004లో ఆయన సతీమణి సుజాతమ్మ డోన్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తండ్రి కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి డోన్‌ నుంచి గెలుపొంది ముఖ్యమంత్రిగా పని చేశారు. కోట్ల కుటుంబానికి డోన్‌తో విడదీయరాని అనుబంధం ఉంది.

డోన్‌, న్యూస్‌టుడే

బీసీ జనార్దన్‌రెడ్డి యనకండ్ల (బనగానపల్లి మండలం) బీఏ

న్యూస్‌టుడే, బనగానపల్లి: తెదేపాలో కీలక నేతగా ఉన్న బీసీ జనార్దన్‌రెడ్డి బనగానపల్లి నియోజకవర్గంలో మూడోసారి బరిలో నిలుస్తున్నారు. 1993లో హైదరాబాద్‌ వెళ్లిన ఆయన స్థిరాస్తి వ్యాపారంలో రాణిస్తున్నారు. 2011లో తెదేపాలో చేరి 2014లో తొలిసారి బరిలో దిగారు. వైకాపా అభ్యర్థి కాటసాని రామిరెడ్డిపై విజయం సాధించారు. 2019లో కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్‌ స్థానాల ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు. తండ్రి బీసీ గుర్రెడ్డి సర్పంచిగా పనిచేశారు. సోదరుడు బీసీ రాజారెడ్డి బనగానపల్లి పట్టణ  సర్పంచిగా పనిచేశారు. ‘‘ 15 ఏళ్లపాటు ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం రాత్రి పూట రోగులకు, వారికి చెందిన ఒక బంధువుకు భోజనం పెట్టేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆసుపత్రిలో భోజనం పెట్టకుండా చేశారు. ఓట్లకు సంబంధం లేకుండా కేవలం ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని’’ ఆయన అన్నారు

టీజీ భరత్‌ కర్నూలు ఎంబీఏ (యూకే)

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాజకీయ, వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన టీజీ భరత్‌ రెండోసారి బరిలో దిగుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి 5,353 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019 నుంచి ఇప్పటివరకు తెదేపా నియోజకవర్గ బాధ్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి టీజీ వెంకటేశ్‌ మాజీ ఎంపీగా ఉన్నారు. 1999, 2009లో ఆయన కర్నూలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. టీజీవీ సంస్థల సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘‘ గత ఐదేళ్లుగా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోపాటు టీజీవీ సంస్థల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. తెదేపా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. నాకుంటూ ఓ విజన్‌తో ముందుకెళ్తున్నా. రానున్న ఎన్నికల్లో కర్నూలు నుంచి భారీ మెజార్టీతో గెలుపొంది చంద్రబాబు నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని’’ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అనుభవానికి అందలం

ఎన్‌ఎండీ ఫరూక్‌ నంద్యాల పట్టణం 12వ తరగతి

ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన ఎన్‌ఎండీ ఫరూక్‌  ఎనిమిదో సారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో నిలవబోతున్నారు. 1981లో కౌన్సిలర్‌గా ఎన్నికైన ఆయన నంద్యాల మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. 1985లో తొలిసారి తెదేపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. 1989లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 1994లో రెండోసారి గెలిచి డిప్యూటీ స్పీకరుగా పనిచేశారు. 1999లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. 2004లో ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2009, 2014లో నంద్యాల ఎంపీగా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2017లో ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యారు. కొంతకాలం శాసనమండలి ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆరు నెలలపాటు మంత్రిగానూ సేవలు అందించారు. ఆయనకు భార్య, ఐదుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. మూడో కుమారుడు ఫిరోజ్‌ తెదేపా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ‘‘42 ఏళ్ల పాటు పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఎనిమిదో సారి అవకాశం కల్పించారు.. ఇవే నాకు చివరి ఎన్నికలు. అందరి తోడ్పాటుతో ఈసారి విజయం సాధిస్తానని’’ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

భూమా ధీమా

ఆళ్లగడ్డ - బీబీఏ

తల్లి శోభానాగిరెడ్డి మృతితో 2014లో రాజకీయ ప్రవేశం చేసిన అఖిలప్రియ మూడోసారి బరిలో నిలవబోతున్నారు. 2014లో ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. 2017లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా చంద్రబాబు మంత్రివర్గంలో ప్రమాణస్వీకారం చేశారు. 2019 ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తండ్రి భూమా నాగిరెడ్డి రెండు సార్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా, నంద్యాల ఎమ్మెల్యేగా ఒకసారి పనిచేశారు. మూడుసార్లు నంద్యాల పార్లమెంట్‌ అభ్యర్థిగా పని చేశారు. భూమా శోభానాగిరెడ్డి ఐదుసార్లు (రెండుమార్లు ఉప ఎన్నిక) ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో నంద్యాల పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అఖిలప్రియ పెద్దనాన్న భూమా శేఖర్‌రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె తాత ఎస్వీ సుబ్బారెడ్డి రెండు సార్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పనిచేశారు. ‘‘టిడ్కోలో దరఖాస్తు చేసుకుని అర్హత ఉన్నప్పటికీ కొందరి పేర్లను వైకాపా నాయకులు తొలగించారు. ఇలాంటి అరాచక పాలనకు ఆళ్లగడ్డ ప్రజలు ముగింపు పలకబోతున్నారని ఆమె పేర్కొన్నారు.

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే

గౌరు చరితారెడ్డి కొణిదేడు

(పగిడ్యాల మండలం)డిగ్రీ

గత 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్న గౌరు చరితారెడ్డి పాణ్యం నుంచి మూడోసారి బరిలో నిలవనున్నారు.  గృహిణిగా ఉన్న ఆమె 2002లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004లో నందికొట్కూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గాన్ని ఎస్సీ వర్గానికి కేటాయించడంతో 2009లో ఆమె పోటీకి దూరమయ్యారు. 2014లో పాణ్యం నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో ఆ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో తెదేపాలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. భర్త గౌరు వెంకట్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. కుమారుడు, కుమార్తె ఉన్నారు. ‘‘ నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీని జనం గుర్తించారు.. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తానని’’ ఆమె ధీమా వ్యక్తం చేశారు.

న్యూస్‌టుడే, పాణ్యం

బుడ్డా రాజశేఖర్‌రెడ్డి

రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన బుడ్డా రాజశేఖర్‌రెడ్డి శ్రీశైలం నుంచి నాలుగోసారి బరిలో నిలవబోతున్నారు. 2009లో ఏరాసు ప్రతాపరెడ్డిపై తెదేపా అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైకాపా తరఫున పోటీ చేసిన ఆయన శిల్పా చక్రపాణిరెడ్డిపై గెలుపొందారు. ఏడాదిన్నర తర్వాత ఆ పార్టీని వీడి తెదేపాలో చేరారు. 2019లో శిల్పా చక్రపాణిరెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 2004లో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సతీమణి బుడ్డా శైలజ తెదేపా తరఫున పోటీ చేసి ఏరాసు ప్రతాపరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తండ్రి బుడ్డా వెంగళరెడ్డి తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగారు. 1983, 1985, 1989లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో కరవు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1999లో నక్సల్స్‌ దాడిలో మృతి చెందారు. బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి భార్య, కుమార్తె, తల్లి ఉన్నారు. ‘‘ శ్రీశైలం అసెంబ్లీ స్థానాన్ని చంద్రబాబుకు కానుకగా అందిస్తాం... జగన్‌మోహన్‌రెడ్డి అరాచక పాలనలో ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి గ్రామంలో కార్యకర్తలు పార్టీ కోసం పనిచేశారు. వారి కృషి ఫలితంగా నాకు టికెట్‌ లభించిందని’’ ఆయన పేర్కొన్నారు.

న్యూస్‌టుడే, ఆత్మకూరు

వేల్పనూరు (వెలుగోడు మండలం)

న్యాయ విద్య పూర్తి చేశారు

కేఈ శ్యాంబాబు కంబాలపాడు (కృష్ణగిరి) చదువు:ఎంబీఏ

మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి రెండో కుమారుడు కేఈ శ్యాంబాబు పత్తికొండ నుంచి రెండోసారి బరిలో దిగబోతున్నారు. 2014 నుంచి 2019 వరకు నియోజకవర్గంలో పర్యటిస్తూ వస్తున్నారు. 2019లో తెదేపా అభ్యర్థిగా బరిలో దిగినా ఆయన ఓటమిని చవిచూశారు. కేఈ మాదన్న రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేసిన కేఈ కృష్ణమూర్తి రాష్ట్రంలో తెదేపా ఆవిర్భావం అనంతరం కీలకంగా వ్యవహరించి రాష్ట్ర స్థాయిలో పేరు సంపాదించారు. ‘‘ నాన్న కేఈ కృష్ణమూర్తి, చిన్నాన్న కేఈ ప్రభాకర్‌ అందించిన సేవలు తన విజయానికి దోహదపడతాయని’’ ఆయన పేర్కొన్నారు.

న్యూస్‌టుడే, పత్తికొండ కోడుమూరు కొత్తగా

కర్నూలు గ్రామీణం, కోడుమూరు పట్టణం: ఎస్సీ నియోజకవర్గం కోడుమూరు తెదేపా అభ్యర్థిగా కర్నూలు గ్రామీణ మండలం పసుపలకు చెందిన బొగ్గుల దస్తగిరిని అధిష్ఠానం ఖరారు చేసింది. ఆయన తండ్రి రాముడు గతంలో సర్పంచిగా విధులు నిర్వర్తించారు. ఆయన తల్లి శీలమ్మ ప్రస్తుతం పసుపల సర్పంచిగా కొనసాగుతున్నారు. ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. న్యాయవాదిగా స్థిరపడ్డారు. తెదేపా నేత ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డికి నమ్మకమైన అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఆయనకు భార్య సుధారాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని