logo

ప్రమాదంలో యువకుడి మృతి

సోదరుడి వివాహం.. ఆ ఇల్లంతా సందడిగా ఉంది.. ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.. అంతలోనే అందిన సమాచారం ఆ ఇంట విషాదాన్ని నింపింది.

Published : 29 Feb 2024 02:16 IST

పెళ్లింట విషాదం

నవీన్‌ (పాతచిత్రం)

పెరవలి(మద్దికెర), న్యూస్‌టుడే: సోదరుడి వివాహం.. ఆ ఇల్లంతా సందడిగా ఉంది.. ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.. అంతలోనే అందిన సమాచారం ఆ ఇంట విషాదాన్ని నింపింది. మద్దికెర మండలం పెరవలికి చెందిన సుధారాణి, రామాంజనేయులు దంపతులకు ఇద్దరు కెమార్తెలు, కుమారుడు నవీన్‌(25) ఉన్నారు. నవీన్‌ ఇంటి నిర్మాణ పనులకు వెళ్తూ జీనవం సాగించేవాడు. ఈ యువకుడు బుధవారం వేకువ జామున మరో ఇద్దరితో కలిసి పెళ్లి పనుల్లో భాగంగా కారులో గుంతకల్లు వెళ్లారు. అయితే మద్దికెర- కసాపురం గ్రామాల మధ్య టైరు పేలిపోయి అదుపుతప్పింది. వాహనం బోల్తా పడిన సమయంలో తీవ్రంగా గాయపడిన నవీన్‌ను అనంతపురం, తర్వాత కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందటంతో ఆ తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. అండగా ఉండాల్సిన సమయంలో అందని లోకాలకు వెళ్లాడని వారు రోదిస్తున్న తీరు బంధుమిత్రులను కంటతడి పెట్టించింది. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుడి మృతితో పెళ్లి ఆగిపోయింది.


దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడి దుర్మరణం

ఎ.వీరప్రకాశ్‌

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పత్తికొండ పట్టణ సమీపంలోని పుచ్చకాయలమడ గ్రామానికి వెళ్లే దారిలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఎ.వీరప్రకాశ్‌(50) మృతిచెందారు. మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పత్తికొండ నుంచి గ్రామానికి వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. కృష్ణమూర్తి, ఆనంద్‌ తీవ్రంగా గాయపడగా.. సురేశ్‌, సువర్ణకు స్వల్పగాయాలయ్యాయి. వీరిలో కృష్ణమూర్తిని కర్నూలుకు తరలించాలని వైద్యులు సూచించారు. ఆదర్శ దివ్యాంగుల కమిటీ, మహాత్మ దివ్యాంగుల ప్రాంతీయ సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎ.వీరప్రకాశ్‌ గురువారం కర్నూలులో జరగనున్న దివ్యాంగుల సింహగర్జన ఏర్పాట్లపై తోటి వారితో చర్చించారు. సాయంత్రం గ్రామానికి ఆటోలో బయల్దేరారు. పుచ్చకాయలమడ గ్రామ సమీపంలో ఆటోను ట్రాక్టర్‌ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు.

ఆసుపత్రిలో బాధితులను పరామర్శిస్తున్న కేఈ శ్యాంబాబు

పత్తికొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. వీరప్రకాశ్‌ మృతిచెందారు. సమాచారం అందుకున్న భార్య ఉరుకుందమ్మ, కుమారుడు హర్ష ఆసుపత్రి వద్దకు చేరుకొని రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న తెదేపా నియోజకవర్గ బాధ్యుడు కేఈ శ్యాంబాబు, సీనియర్‌ నాయకులు సాంబశివారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వెంకటపతి తదితరులు ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని కేఈ శ్యాంబాబు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పత్తికొండ పోలీసులు తెలిపారు.


కుళాయి ఘర్షణలో మరొకరు..

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : మండల పరిధిలోని కందనాతిలో ఇటీవల ఇంటి కుళాయి విషయంలో జరిగిన ఘర్షణలో నరసింహులు(50) అనే మరొక వ్యక్తి కర్నూలులో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు. ఈ నెల 21న జరిగిన ఘర్షణలో రవి, నరసింహులుపై కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రవి చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందగా... నరసింహులు బుధవారం మృతి చెందారు. నరసింహులుకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో ఇద్దరు హత్యకు గురికావడంతో గ్రామీణ సీఐ మోహన్‌రెడ్డి అధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


హత్య కేసులో నిందితుల అరెస్టు...

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : కందనాతిలో కుళాయి విషయంలో జరిగిన హత్య కేసులో 12 మంది నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు గ్రామీణ సీఐ మోహన్‌రెడ్డి, ఎస్సై శరత్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నిందితులు బోయ గోవిందు, బోయ లోకేశ్‌ అలియాస్‌ గోనెగండ్ల లోకేశ్‌, బోయ వెంకటేశ్‌ అలియాస్‌ గోనెగండ్ల వెంకటేశ్‌, బోయ శ్రీను, బోయ నరసయ్య, బోయ పరమేశ్‌, బోయ మారెన్న అలియాస్‌ ఉడతల మారెన్న, బోయ ఈరన్న, బోయ కేశన్న అలియాస్‌ గొర్రెల కేశన్న, బోయ మహేశ్‌, బోయ కేశన్న అలియాస్‌ గువ్వోడు, బోయ మారెన్న అలియాస్‌ చిన్నమారెన్నను కందనాతి వద్ద అరెస్టు చేసినట్లు సీఐ, ఎస్సై వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని