logo

శ్రీగిరికి బ్రహ్మోత్సవ శోభ

జ్యోతిర్లింగ శ్రీశైల క్షేత్రం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో దేవస్థాన యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది.

Published : 29 Feb 2024 02:21 IST

ఏర్పాట్లు చేస్తున్న ఆలయ సిబ్బంది
నేడు కలెక్టర్‌ సమీక్షా సమావేశం

ఆంధ్ర బస్సుల పార్కింగ్‌ ప్రదేశం

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : జ్యోతిర్లింగ శ్రీశైల క్షేత్రం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో దేవస్థాన యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు జిల్లా యంత్రాంగం, దేవస్థానం అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించనున్నారు.

వెంకయ్యసత్రం వద్ద షామియానా

  • కలెక్టర్‌ ఆదేశాలతో దేవస్థానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో డి.పెద్దిరాజు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వేగవంతం చేశారు.  గత ఏడాది కన్నా 20 శాతం అధిక వసతులు కల్పించడానికి సిద్ధం చేస్తున్నారు.
  • పార్కింగ్‌ ప్రదేశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, హైమాస్ట్‌ విద్యుత్‌ దీపాలు వంటి సదుపాయాలు కల్పించారు.
  • ఆలయ పరిసరాలు, ఉద్యానవనాల్లో షామియానాలు, పెండాల్స్‌, చలువ పందిళ్లు ఏర్పాట్లు చేశారు.
  • ఉచిత దర్శనం కోసం క్యూలైన్లను పెంచారు. ఆలయ వీధుల్లో తాత్కాలిక క్యూలైన్లను సిద్ధం చేస్తున్నారు.

నడిచి వస్తున్న శివస్వాములు

  • బ్రహ్మోత్సవాల్లో 35 లక్షల లడ్డూలు తయారు చేయడానికి పనులు జరుగుతున్నాయి.
  • పీహెచ్‌సీ వద్ద 30 పడకల తాత్కాలిక వైద్యశాల సిద్ధం చేస్తున్నారు. కాలినడక భక్తుల కోసం మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వెంకటాపురం నుంచి నాగులూటి, పెచ్చెరువు, కైలాస ద్వారం, శ్రీశైలం పరిసరాల్లో మెడికల్‌ క్యాంపులు అందుబాటులోకి రానున్నాయి. దేవస్థానం వైద్యశాల, పీహెచ్‌సీ, సున్నిపెంట ప్రాజెక్ట్‌ వైద్యశాలలో కూడా  వైద్యులకు అదనపు డ్యూటీల ప్రణాళిక సిద్ధం చేశారు.
  • పాదయాత్ర భక్తుల కోసం తాగునీటి ఏర్పాట్లు చేస్తున్నారు. కైలాస ద్వారం వద్ద నుంచి భీముని కొలను వరకు తాగునీటి పైపులైన్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు.
  • దాతలు చేపట్టే అన్నదాన కేంద్రాలకు దేవస్థానం తరఫున వసతులు కల్పిస్తారు. ప్రత్యేక విధులకు వచ్చే ఉద్యోగులకు అన్నపూర్ణ భవన్‌లో అల్పాహారం, భోజన సదుపాయాలు ఉంటాయి.
  • శివదీక్ష భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు, వసతి కల్పిస్తున్నారు.
  • పాతాళగంగ స్నానఘాట్ల వద్ద బారికేడ్లు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజుల సత్రం, ఆర్టీసీ బస్టాండు వెనుక జల్లు స్నానం ఏర్పాట్లు చేస్తున్నారు.
  • భక్తుల కోసం రూట్‌ మ్యాప్‌ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా భక్తులు తమ గమ్యస్థానాలకు సులువుగా చేరుకుంటారు.

భక్తులు స్నానాలు చేసుకోవడానికి రాజుల సత్రం వద్ద ఏర్పాటు చేసిన షవర్లు

ఉచిత బస్సులు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎప్పుడూ లేని విధంగా 10 ఉచిత బస్సులు నడపాలని దేవస్థాన అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పార్కింగ్‌ ప్రదేశాల నుంచి ఆలయ ప్రధాన వీధుల వరకు భక్తులను ఉచితంగా బస్సుల్లో తీసుకెళ్లనున్నారు. టెండర్‌ పద్ధతిలో హైర్‌ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని