logo

బిందె నింపని గోరుకల్లు నీరు

రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో వాటర్‌గ్రిడ్‌ పనులు చేపట్టాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా డోన్‌ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు.

Published : 29 Feb 2024 02:26 IST

బుగ్గన మాట నీటి మూట

బేతంచెర్ల పట్టణంలో నీటి కష్టాలు

‘‘ డోన్‌ నియోజకవర్గంలో ఇంటింటికీ తాగునీరిస్తాం.. రాష్ట్రంలోనే డోన్‌కు ప్రత్యేకంగా రూ.330 కోట్లతో వాటర్‌గ్రిడ్‌ను తీసుకొచ్చాం.. పనులు త్వరగా పూర్తి చేస్తాం.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందించాలన్నదే లక్ష్యం.’’ 

పలు సమావేశాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పిన మాటలివీ.


2023 మే నాటికి పనులు పూర్తికావాల్సి ఉండగా.. 2024 మే వరకు గడువు పెంచారు. అప్పటి వరకు పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. ‘హామీ’ అమలు చేశామని చెప్పుకోవడానికి మార్చి నాటికి బేతంచెర్ల మండలం వరకు నీటిని తీసుకొచ్చే పనిలో పడ్డారు. గడువు నాటికి డోన్‌, ప్యాపిలి మండలాలకు చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు.

డోన్‌, బేతంచెర్ల, న్యూస్‌టుడే


రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో వాటర్‌గ్రిడ్‌ పనులు చేపట్టాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా డోన్‌ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. 131 గ్రామాల్లో ఇంటింటికి మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో రూ.330 కోట్లతో 2021 ఆగస్టులో పనులు ప్రారంభించారు. గోరుకల్లు జలాశయం వద్ద నీటిని తోడి పాణ్యం వద్ద సుగాలితండాలో నిర్మించే ట్యాంకులో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి బుగ్గానిపల్లెతండా వద్ద 42 ఎంఎల్‌టీ సామర్థ్యమున్న నీటిశుద్ధీకరణ కేంద్రానికి తీసుకెళ్తారు. ఇక్కడ పనులన్నీ పూర్తయితేనే బేతంచెర్ల పట్టణానికి నీరు లభిస్తుంది. ఆర్‌.కొత్తపల్లె వద్ద 2,100 కిలో లీటర్ల సామర్థ్యంతో నీటి సంపుతోపాటు డోన్‌ కొండపై 1,200 కిలో లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు నిర్మాణ పనులు చేపట్టారు. డోన్‌ నుంచి కొత్తకోట వద్ద ట్యాంకుతో పాటు, ఏనుగుమర్రి వద్ద సంపు తదితర నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాటన్నింటికీ రూ.65 కోట్లు కేటాయించారు.

బేతంచెర్లలో పరిస్థితి ఇది

బేతంచెర్ల నగర పంచాయతీ జనాభా 42 వేల మంది ఉండగా 11,500 వరకు గృహాలు ఉన్నాయి. 20 వరకు వార్డులు ఉన్నాయి. పట్టణంలో రెండు నెలలుగా తాగునీటి సమస్య వేధిస్తోంది. బేతంచెర్లకు రోజుకు 30 లక్షల లీటర్ల తాగునీరు అవసరం కాగా.. ప్రస్తుతానికి 14.50 లక్షల లీటర్లు మాత్రమే అందిస్తున్నారు. 15.50 లక్షల లీటర్ల నీటి కోసం జనం అవస్థలు పడుతున్నారు. బేతంచెర్లకు నీరిచ్చాక డోన్‌, ప్యాపిలి మండలాలకు అందివ్వాలి. ఇవన్నీ జరగాలంటే ఇంకో మూడు నెలలు పట్టే అవకాశం ఉందంటున్నారు.


మందకొడిగా పైపులైన్‌ పనులు

నీటి శుద్ధీకరణ కేంద్రం నుంచి బేతంచెర్లకు  పైపులైన్‌ పనులు

మొత్తం 480 కి.మీ.ల మేర డీఐ, ఎంఎస్‌, హెచ్‌డీపీ, జీఐ పైపులైన్‌ పనులకుగాను ఇప్పటికి 250 కి.మీ. మేర మాత్రం పూర్తయినట్లు సమాచారం. ఇంకా 230 కి.మీల మేర వివిధ రకాల పైపులైను పనులు చేపట్టాలి. బేతంచెర్ల నుంచి ఆర్‌.కొత్తపల్లె మీదుగా డోన్‌ వరకు చేపట్టాల్సిన పైపులైన్‌ పనులు ఇంకా జరుగుతున్నాయి. డోన్‌ పట్టణంలోని కొండపై నుంచి ప్యాపిలి వైపు వెళ్లేందుకు వేసిన పైపులు చాలాచోట్ల ఇంకా రోడ్డుపక్కన ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో అనే ఆందోళన అందరిలో ఎక్కువవుతోంది. ‘‘ బేతంచెర్ల పట్టణానికి వారం రోజుల్లో నీరు అందించేందుకు కృషి చేస్తున్నాం. డోన్‌, ప్యాపిలి మండలాల్లో ఇంకా పైపులైను పనులు సాగుతున్నాయి. వీలైనంత త్వరగా నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని’’ డీఈ సోమశేఖర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని