logo

ఇల కైలాసంలో దేవదేవుని పండగ

శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో డి.పెద్దిరాజు తెలిపారు.

Published : 29 Feb 2024 02:40 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఉత్సవాలను పురస్కరించుకుని అన్ని ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. మార్చి 5 వరకు ఇరుముడి కలిగిన శివదీక్షా భక్తులకు మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం ఉంటుందన్నారు. సాధారణ భక్తులు శ్రీస్వామిఅమ్మవార్ల అలంకార దర్శనం చేసుకోవాలని వెల్లడించారు. మార్చి ఒకటో తేదీ ఉదయం 8.10 గంటలకు ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టనున్నారు. రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ జరుగుతుంది. ఉత్సవాల్లో ప్రతి రోజూ స్వామిఅమ్మవార్లకు వాహనసేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తారు. 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామిఅమ్మవార్లకు ప్రభోత్సవం జరుగుతుంది. రాత్రి 10 గంటలకు స్వామికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, రాత్రి 12 గంటలకు బ్రహ్మోత్సవ కల్యాణం కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. 9న సాయంత్రం 5 గంటలకు రథోత్సవం, రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. 11న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని