logo

నిమిషం ఆలస్యమైనా నిరాకరణ

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 1వ తేదీ నుంచి 20 వరకు జరగనున్న పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75,814 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

Published : 29 Feb 2024 03:02 IST

మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు

పునశ్చరణలో ఇంటర్‌ విద్యార్థులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 1వ తేదీ నుంచి 20 వరకు జరగనున్న పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75,814 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 121 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించకూడదని ఇంటర్‌ బోర్డు నుంచి ఇప్పటికే ఆదేశాలందాయి. హాల్‌టిక్కెట్లను ఇప్పటికే ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్లలో ఉంచారు. కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మంచినీరు, వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. అవకతవకలు, మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తాడేపల్లిలోని ఇంటర్‌ బోర్డు, కర్నూలు నగరంలోని ఇంటర్‌ ప్రాంతీయ కార్యాలయానికి అనుసంధానం చేశారు. పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని, ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు ఉంటుందని కర్నూలు ఆర్‌ఐవో గురువయ్య శెట్టి బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు.

75,814 మంది విద్యార్థులు

కర్నూలు జిల్లాలో మొత్తం 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల విద్యార్థులు మొత్తం 47,412 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష ప్రశ్నపత్రాలు నిల్వ చేసేందుకు 23 కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిపార్టుమెంట్‌ ఆఫీసర్లు 69 మంది, చీఫ్‌ సూపరింటెండెంట్లు 69 మంది, కస్టోడియన్లు ఐదుగురు, ఫ్లయింగ్‌ స్క్వాడ్లు ముగ్గురు, సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఆరుగురు, ఒక హైపవర్‌ కమిటీ, డీఈసీ కమిటీలు 4, డీవీఈవోలు 2 ఇద్దరు, ఇన్విజిలేటర్లను సుమారు 1,000 మందిని నియమించారు. నంద్యాల జిల్లాలో 52 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 28,402మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి

కర్నూలు జిల్లాలో 5, నంద్యాలలో 4 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు గుర్తించారు. ఆలూరు, పత్తికొండ, దేవనకొండ, కోసిగి, చిప్పగిరి మండల కేంద్రాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ‘‘ సమస్యాత్మక కేంద్రాల్లో రెండింతల పకడ్బందీ చర్యలు చేపట్టాం. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. ఇన్విజిలేటర్లు, విద్యార్థులు చరవాణులు తీసుకెళ్లకూడదు. సమాచార సేకరణకు ఇంటర్‌ బోర్డు అందజేసిన కీప్యాడ్‌ ఫోన్లు అందజేశాం. వీటిని మాత్రమే వాడాలి. పరీక్ష కేంద్రాల్లో ఏమైనా సమస్యలుంటే కంట్రోల్‌ రూం నంబరు 08518 222047కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చని’’ జిల్లా పరీక్షల కన్వీనర్‌ గురువయ్యశెట్టి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని