logo

అరాచక వైకాపాచిక

ఎన్నికల వేళ అధికార పార్టీ నేతలు కుట్రలకు తెరతీశారు.. విధేయులైన పోలీస్‌ అధికారులను అస్త్రాలుగా ఉపయోగించుకుంటూ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Updated : 29 Feb 2024 05:23 IST

ఎన్నికల వేళ అక్రమ కేసులు
భయపెట్టి దారికి తెచ్చుకునే యత్నం

న్నికల వేళ అధికార పార్టీ నేతలు కుట్రలకు తెరతీశారు.. విధేయులైన పోలీస్‌ అధికారులను అస్త్రాలుగా ఉపయోగించుకుంటూ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. భయపెడుతున్నారు.. వినకపోతే అక్రమ కేసులు బనాయిస్తున్నారు.. ఏకంగా రౌడీషీట్లు తెరిపిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. జడ్పీ మాజీ ఛైర్మన్‌, నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌పై ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ తెరవడం చర్చనీయాంశంగా మారింది. గత ఐదేళ్లుగా పోలీసులకు కనిపించని కేసులు ఎన్నికల వేళ తిరగతోడి.. మూడు కంటే ఎక్కువ కేసులు నమోదై ఉంటే రౌడీషీట్‌ తెరిపిస్తుండటం గమనార్హం. నేరాలు తగ్గించి ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన పోలీసులు అక్రమ కేసులతో వర్గ కక్షలు మరింత పెరిగేలా చేస్తుండటం గమనార్హం.

కర్నూలు నేరవిభాగం, నంద్యాలగ్రామీణం న్యూస్‌టుడే

ప్రతిపక్ష పార్టీల్లో కీలక నేతలపై

అధికారం ‘గాలి’ బలహీనపడింది.. అందుకోసమే అభ్యర్థులను మార్చుతున్నట్లు ఆ పార్టీ అధిష్ఠానమే చెబుతోంది. ఆ పార్టీ వ్యవహారాలు నచ్చని పలువురు ఇతర పార్టీల్లోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.. వారిని భయపెట్టి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రధాన ప్రతిపక్షం తెదేపాలో కీలకంగా ఉన్న నేతలపై దృష్టి సారించి అక్రమ కేసులు బనాయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గడివేముల మండలం కొరటమద్దికి చెందిన తెదేపా నాయకుడు కృష్ణమాచారి, ఇదే మండలానికి చెందిన మరో నాయకుడిపై రౌడీషీట్‌ తెరిపించినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. గడివేములకు చెందిన ఓ వ్యక్తి పార్టీలో చురుకుగా తిరుగుతున్నారన్న ఉద్దేశంతో గతంలో మూసేసిన రౌడీషీట్‌ను మళ్లీ తెరిపించారని తెదేపా నేతలు వాపోయారు. రౌడీషీట్‌ తెరిచే విషయాన్ని ఉన్నతాధికారులకూ సమాచారం ఇవ్వకుండా పోలీసు అధికారులు ఈ చర్యలకు పాల్పడుతుండటం గమనార్హం. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 1,630 మంది, నంద్యాల జిల్లాలో 1,300 మంది రౌడీషీటర్లు ఉండగా వైకాపా నేతల కుట్రలతో ఆ సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. 

అక్రమ కేసులకు లెక్కేలేదు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురు పోలీసు అధికారుల పక్షపాత ధోరణిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్యాయానికి గురైన బాధితులు పలుమార్లు ఠాణాకు వెళ్తే పట్టించుకోవడం లేదు. వారంతా జిల్లా కేంద్రంలోని స్పందనకు వెళ్లినా కేసు నమోదు చేయని పోలీస్‌ అధికారులు వైకాపా ప్రజాప్రతినిధుల ఒక్క మాటతో అక్రమ కేసులు నమోదు చేస్తూ విధేయత చాటుకుంటున్నారు. గత నాలుగున్నరేళ్లలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైకాపా నేతల ఒత్తిడితో నమోదైన అక్రమ కేసులు చాలా ఉన్నాయి.

  • కర్నూలులో పార్టీ మారేందుకు సిద్ధపడిన ఓ వైకాపా కార్పొరేటర్‌పై అక్రమ కేసు నమోదు చేయగా, ప్రజాప్రతినిధిని విమర్శించారన్న ఉద్దేశంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
  • ఇటీవల అధికార పార్టీకి చెందిన మరో కార్పొరేటర్‌ కుటుంబంపై అధికార నేతలే దాడి చేయడం సంచలనంగా మారింది. నిందితులపై కేసు నమోదు చేయించేందుకు బాధిత కార్పొరేటర్‌కు తలకు మించిన భారమైంది.
  • కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన ఓ మహిళ నాయకురాలిపై అక్రమ కేసు నమోదు చేసి మానసికంగా వేధించారు. ః గతంలో కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అనుచరుడు దేవనకొండ మండల కున్నూరుకు చెందిన సిద్ధప్పకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో కోడుమూరు పట్టణంలో దారుణ హత్యకు గురయ్యాడన్న ఆరోపణలు వచ్చాయి.
  • గతంలో సారా అమ్మకాలకు దూరంగా ఉన్న నంద్యాలలోని బసవతారకరామ కాలనీకి చెందిన ఓ వ్యక్తి తెదేపాలో తిరుగుతున్నారన్న ఉద్దేశంతో ఆయనపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయగా ఆయన హైకోర్టును ఆశ్రయించి బయటపడ్డారు.
  • నంద్యాలలోని 19 వార్డుకు చెందిన తెదేపా నాయకుడిపై గంజాయి కేసు నమోదు చేసి ఇబ్బంది పెట్టారు.  బండిఆత్మకూరు మండలం బరకల కాలనీకి చెందిన తెదేపా నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు.
  • రుద్రవరం మండలం నర్సాపురానికి చెందిన ఓ తెదేపా నాయకుడిపై కేసు నమోదు చేసి హింసించడం కలకలం రేపింది.

రాజశేఖర్‌పై రౌడీషీట్‌ తొలగించాలి

ఓర్వకల్లు జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న నాయకులు

కర్నూలు, న్యూస్‌టుడే: జడ్పీ మాజీ ఛైర్మన్‌, నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌పై అక్రమంగా పెట్టిన రౌడీషీట్‌ను వెంటనే తొలగించాలని తెదేపా నాయకులు రామచంద్రుడు, మహబూబ్‌ బాషా డిమాండు చేశారు. రౌడీషీట్‌ను వ్యతిరేకిస్తూ బుధవారం ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. . బీసీ నాయకుడైన మల్లెల రాజశేఖర్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకు అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేయటం సరికాదన్నారు.  నా ఎస్సీ, నా బీసీ అంటూ మాటలు చెప్పడం తప్ప వారిని రాజకీయంగా ఎదగనీయడం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని