logo

గ్రూప్‌-2 నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షలో కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ పరీక్ష కేంద్రంలో నిబంధనల ఉల్లంఘన జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 01 Mar 2024 02:29 IST

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

ఈనాడు, కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షలో కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ పరీక్ష కేంద్రంలో నిబంధనల ఉల్లంఘన జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదోనిలోని భాష్యం విద్యాసంస్థలో గది నంబరు 6కు ఇన్విజిలేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఓ వ్యక్తి ప్రశ్నపత్రాలను నేరుగా గదిలోకి తీసుకురావడంతో పరీక్ష రాసేందుకు వచ్చినవారు నివ్వెరపోయారు. పరీక్ష హాలులో ప్రశ్నపత్రాల కవర్‌ సీల్‌ తెరవాల్సి ఉండగా.. ఎలాంటి కవర్‌ లేకుండా నేరుగా పత్రాలు తేవడంపై కొందరు అభ్యంతరాలు తెలిపారు. ఆయా ప్రశ్నపత్రాల కవర్లను ఇన్విజిలేటర్లకు ఇచ్చిన గదిలోనే దానిని తెరిచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు ఓ ప్రశ్నపత్రానికి ఉండాల్సిన స్టిక్కర్‌ సీల్‌ కూడా లేదని అభ్యర్థులు గుర్తించారు. ఆ విషయాన్ని ఇన్విజిలేటర్‌ దగ్గర కొందరు ప్రస్తావించగా సీల్‌ అలాగే ఊడిపోయి ఉందని ఇన్విజిలేటర్‌ చెప్పినట్లు సమాచారం. పరీక్ష ముగిసిన తర్వాత ఆ గదిలో పరీక్ష రాసిన విద్యార్థులు విషయాన్ని అదే రోజు పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించిన ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పత్రంపై సుమారు 40 మంది సంతకాలు చేసినట్లు తెలిసింది. దీనిని ఉన్నతాధికారులకు పంపి విచారణ చేయిస్తామని ఆ రోజు విధుల్లో ఉన్నవారు హామీ ఇవ్వడంతో అభ్యర్థులందరూ పరీక్ష కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఫిర్యాదును ఆదోని సబ్‌ కలెక్టర్‌ శివనారాయణశర్మకు పంపి విచారణ చేయిస్తామని, పోలీసులకు కూడా ఫిర్యాదు ఇస్తామని నాడు పరీక్ష కేంద్రంలోని అధికారులు అభ్యర్థులకు చెప్పారు. ఫిర్యాదుదారుల సెల్‌ నంబర్లను సైతం పరీక్ష కేంద్రం అధికారులు తీసుకున్నారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా ఎలాంటి ఫోన్లు రాకపోవడంతో కొందరు నాడు జరిగిన సంఘటన గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. తమ ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలియడంతో విస్మయానికి గురయ్యారు. ఆ ఘటన వివరాలను మీడియాకు తెలపడంతో నిబంధనల ఉల్లంఘనల గుట్టు రట్టైంది.

ఎన్నో అనుమానాలు..

పరీక్ష కేంద్రంలో పాటించాల్సిన నిబంధనలపై స్పష్టమైన మార్గదర్శకాలుంటాయి. ఆయా నిబంధనలను ఉల్లంఘించడం వెనక ఎవరి హస్తం ఉందోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థులు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పట్టించుకోలేదన్న విషయం వెలుగులోకి రావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ఉల్లంఘన జరిగిన పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించిన అధికారులు ఎవరికి ఫిర్యాదు చేశారన్న విషయం మిస్టరీగా మారింది. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆదోని సబ్‌ కలెక్టర్‌ శివనారాయణ శర్మ, ఆదోని సీఐ శివనారాయణస్వామి ‘ఈనాడు’కు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని