logo

మైనింగ్‌ ‘కల’శాల

ఉమ్మడి కర్నూలు జిల్లా ఖనిజాలకు పుట్టినిల్లుగా పేరొందగా, పక్క జిల్లాలైన అనంతపురం, కడపలలో కూడా ఖనిజ నిక్షేపాలకు పేరు పొందాయి.

Updated : 01 Mar 2024 05:32 IST

డోన్‌ ప్రాంతంలో లభించే ఖనిజాలు

డోన్‌, నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లా ఖనిజాలకు పుట్టినిల్లుగా పేరొందగా, పక్క జిల్లాలైన అనంతపురం, కడపలలో కూడా ఖనిజ నిక్షేపాలకు పేరు పొందాయి. ఆయా ఖనిజాలను వెలికితీయడంలో లీజుదారులు వ్యయ, ప్రయాసలకు లోనవుతున్నారు. ఖనిజం ఎక్కడ దొరుకుతుందీ..ఎంతలోతుగా తవ్వాలి..దీని నాణ్యత తదితర విషయాలపై పరిజ్ఞానం గల వారి సూచనలు లభిస్తే బాగుండునని కోరుకుంటున్నారు. ఇలా గనులకు సంబంధించిన అన్ని విషయాలు తెలియాలంటే ఇక్కడ మైనింగ్‌ కళాశాల అవసరం ఉందని, దీన్ని ఏర్పాటు చేస్తామని పదేళ్లుగా రాజకీయ నేతలు హామీలిచ్చేస్తున్నారు. ఆర్థికమంత్రి బుగ్గన హయాంలోనైనా కళాశాల ఏర్పాటవుతుందని భావించిన వారి ఆశలు అడియాసలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ మైనింగ్‌ కళాశాల ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది.

ఇదీ పరిస్థితి

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్‌, బనగానపల్లె, కృష్ణగిరి, ఆలూరు, కోడుమూరు తదితర ప్రాంతాలతో పాటు, అనంతపురం, కడప జిల్లాలు ఖనిజాలకు ప్రసిద్ధి. కర్నూలు జిల్లాలోని డోన్‌ ప్రాంతంలో డోలమైట్‌, వైట్‌షేల్‌, సున్నపురాయి, ఐరన్‌ఓర్‌ పుష్కలంగా లభిస్తుంది. జిల్లాలో 500 వరకు గనులుండగా, వెయ్యి వరకు క్వారీలు ఉన్నాయి. వెయ్యి హెక్టార్ల వరకు వివిధ రకాల ఖనిజాల తవ్వకాలకు ప్రభుత్వ అనుమతులున్నాయి. జిల్లాలో ప్రధానంగా 10 సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. డోన్‌, బేతంచెర్లలో 500 వరకు పాలిష్‌పరిశ్రమలు ఉండగా, వందకు పైగా పౌడర్‌పరిశ్రమలు, 50 వరకు గ్రానైట్‌, సున్నం, చిప్స్‌ పరిశ్రమలు ఉన్నాయి. వాటి ద్వారా పదివేల మందికిపైగానే ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి వాటికి ఆధారం ఖనిజాలే. నిపుణులైన వారి సేవలు ఈ రంగంలో లభిస్తే ప్రత్యక్షంగా..పరోక్షంగా ఎంతోమందికి లబ్ధి చేకూర్చినట్లవుతుంది.

ఏయే కోర్సులంటే..

మైనింగ్‌లో ఎమ్మెస్సీ జియాలజి, మైనింగ్‌ ఇంజినీరింగ్‌, డిప్లమోతో పాటు మైనింగ్‌ ఎమ్మెస్సీలో జియోఫిజిక్స్‌, జియోకెమిస్ట్రీ, జియాలజి ఉంటాయి. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. సర్టిఫికెట్‌ కోర్సుల కోసం మైన్‌మేట్‌ కోర్సులు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ నేర్చుకునేందుకు మైనింగ్‌ కళాశాల ఏర్పాటైతే బీఎస్సీ తర్వాత ఇందులో చేరి మరింత పరిజ్ఞానం పొందొచ్చు. రాయలసీమలో మైనింగ్‌ కళాశాల ఏర్పాటు చేస్తే ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుంది. గనుల తవ్వకాల్లో పాటించాల్సిన పద్ధతులు, నాణ్యమైనవి ఎక్కడ దొరికేవీ..? వాటి గుర్తింపు, వేలం నిర్వహించేటప్పుడు ధరల నిర్ణయం తదితర అంశాల్లో నిపుణుల సలహాలు ఉంటే మేలు కలుగుతుంది. ఈ దిశగా ఇప్పుడైనా  అడుగులు వేగంగా వేయాలని యువత కోరుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని