logo

శ్రీగిరి బ్రహ్మోత్సవాలు చూతము రారండీ

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శుక్రవారం ఉదయం వేడుకలకు అంకురార్పణ చేయనున్నారు. ఈనెల 11 వరకు శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

Published : 01 Mar 2024 02:37 IST

భక్తులకు అలంకార దర్శనం
ఇరుముడి శివదీక్ష భక్తులకు స్పర్శ దర్శనం

మల్లన్న ఆలయానికి విద్యుద్దీప కాంతుల శోభ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శుక్రవారం ఉదయం వేడుకలకు అంకురార్పణ చేయనున్నారు. ఈనెల 11 వరకు శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈసందర్భంగా భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. భక్తులకు తాత్కాలిక వసతి, దర్శనం క్యూలైన్లు, మంచినీరు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, పార్కింగ్‌ వంటి ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేశారు.

వాహన సేవలు

  • 2న భృంగి వాహన సేవ
  • 3న హంస వాహన సేవ
  • 4న మయూర వాహన సేవ
  • 6న రావణ వాహన వాహనం, పుష్పపల్లకి సేవ
  • 7న గజ వాహన సేవ
  • 8న  నందివాహన సేవ
  • 9న రథోత్సవం, తెప్పోత్సవం

విశేష కార్యక్రమాలు

2న ద్వారకా తిరుమల దేవస్థానం, 3న విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం, 4న తితిదే తరఫున, 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

30 లక్షల లడ్డూలు సిద్ధం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 30 లక్షల లడ్డూలను విక్రయించడానికి దేవస్థానం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గణేశ్‌ సదన్‌ ఎదురుగా రెండు తాత్కాలిక కౌంటర్లు, అన్నప్రసాద వితరణ కేంద్రం వద్ద నాలుగు కేంద్రాలు అందనంగా ఏర్పాటు చేస్తున్నారు.

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జేసీ

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలంలోని దేవస్థానం సీసీ కంట్రోల్‌ సమావేశ మందిరంలో జిల్లా ప్రభుత్వశాఖ అధికారులు, దేవస్థానం అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ...అన్ని శాఖల అధికారులు ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లపై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రత్యేక విధుల నిమిత్తం వచ్చిన సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక వైద్యులతో మెరుగైన సేవలు అందించాలన్నారు. భక్తుల కోసం హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా అటవీశాఖ అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంతో జేసీ మండిపడ్డారు. అటవీశాఖ చెక్‌పోస్టుల వద్ద భక్తుల వాహనాల నుంచి ఎటువంటి రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించారు. సమావేశంలో మార్కాపురం జేసీ రాహుల్‌మీనా, అదనపు ఎస్పీ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఛైర్మన్‌ చక్రపాణిరెడ్డి, ఈవోపెద్దిరాజు, ఉత్సవాల అధికారి చంద్రశేఖర్‌ఆజాద్‌ పాల్గొన్నారు.

దర్శనం.. సేవల వివరాలు

  • ఉచిత దర్శనం భక్తులకు రథశాల వద్ద నుంచి క్యూలైన్‌ ద్వారా ఆలయ ప్రవేశం కల్పిస్తారు.
  • రూ.200 శీఘ్ర దర్శనం, రూ.500 అతిశీఘ్ర దర్శనం టిక్కెట్లు తీసుకున్న భక్తులకు క్యాంప్‌కోర్టు వద్ద ఉన్న క్యూలైన్ల నుంచి ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తారు.
  • చంటిపిల్లల తల్లులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేశారు.  విరాళ కేంద్రం వద్ద ఉన్న మైక్‌ అనౌన్స్‌ గది వద్ద నుంచి దివ్యాంగులను అనుమతిస్తారు.
  • ఆలయ క్యూ కంపార్ట్‌మెంట్లలో భక్తులకు నిరంతరం మంచినీటితో పాటు అల్పాహార ప్రసాదాలు అందజేస్తారు.
  • శివదీక్షా భక్తులను చంద్రావతి కల్యాణ మండపం వద్ద నుంచి క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.

భ్రమరాంబాదేవికి కానుకగా బంగారు ఆభరణాలు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైలంలో కొలువైన శ్రీభ్రమరాంబాదేవికి చిలకలూరిపేటకు చెందిన ఎన్‌.రమేశ్‌బాబు దంపతులు బంగారు హారం, కమ్మలను కానుకగా సమర్పించారు. 79 గ్రాముల బంగారు హారం, 8 గ్రాముల కమ్మలను ఆలయ ప్రధానార్చకులు ఉమానాగేశ్వరశాస్త్రి, ఇన్‌స్పెక్టర్‌ కె.మల్లికార్జునకు గురువారం అందజేశారు. దాతలను అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని