logo

పుర ఆస్తుల అన్యాక్రాంతంపై రగడ

అధికారుల నిర్లక్ష్యం వల్లే నంద్యాల పట్టణంలోని పురపాలక ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని అధికార, విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 01 Mar 2024 02:39 IST

సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్ల ఆగ్రహం

మాట్లాడుతున్న తెదేపా ఫ్లోర్‌లీడర్‌ మహబూబ్‌వలి

ఈనాడు డిజిటల్‌, నంద్యాల- న్యూస్‌టుడే, నంద్యాల పురపాలకం : అధికారుల నిర్లక్ష్యం వల్లే నంద్యాల పట్టణంలోని పురపాలక ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని అధికార, విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక పరిధిలోని 2.30 ఎకరాల స్థలానికి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఛైర్‌పర్సన్‌ మాబున్నిసా అధ్యక్షతన గురువారం నంద్యాల పురపాలక కౌన్సిల్‌ సమావేశం జరిగింది. మొదట అజెండాలోని అంశాలకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. అనంతరం అమృత్‌ పథకం పనుల వివరాలను ప్రొజెక్టర్‌ ద్వారా వివరించారు. పలువురు సభ్యులు తమ వార్డుల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా తెదేపా ఫ్లోర్‌లీడర్‌ మహబూబ్‌ వలి, వైస్‌ఛైర్మన్‌ పాంషావలి, 12వ వార్డు కౌన్సిలర్‌ శ్యాంసుందర్‌లాల్‌ మాట్లాడుతూ సుమారు రూ.50 కోట్ల విలువైన 2.30 ఎకరాల స్థలానికి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అధికారులను నిలదీశారు. ఇందుకు ఛైర్‌పర్సన్‌ స్పందిస్తూ పూర్తి వివరాలను సభ్యులకు తెలపాలని ఆదేశించారు. అధికారులు సరైన వివరాలు చెప్పకపోవడంతో ఈ అంశంపై వాడీవేడి చర్చ జరిగింది. మహబూబ్‌వలి మాట్లాడుతూ.. రికార్డుల్లో పురపాలక ఛైర్మన్‌ పేరుతో ఉన్న స్థలాన్ని 43 ప్లాట్లుగా విభజించి గుట్టుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని చెప్పారు. దీనిపై ఇంతవరకు కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

మాకూ పత్రికల ద్వారానే తెలిసింది

సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు వివరణ ఇస్తున్న సందర్భంలో.. పట్టణ ప్రణాళిక అధికారి నరసింహమూర్తి మాట్లాడుతూ.. పురపాలక స్థలం ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్‌ జరిగిందన్న విషయం తమకు కూడా పత్రికల ద్వారానే తెలిసిందని చెప్పడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికల్లో వచ్చేంత వరకు స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోరా అని నిలదీశారు.


తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు

ఛైర్‌పర్సన్‌ మాబున్నిసా మాట్లాడుతూ పురపాలక ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. సెంటు స్థలం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తానన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ల విషయం తమకు తెలిసిన వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇందులో తన ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనని చెప్పారు. సమావేశంలో పురపాలక కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని