logo

అవినీతి తీర్మానం

ఉపాధి హామీ నిధులు పక్కదారి పడుతున్నాయి.. పనులు చేసేంది ఒకరైతే నిధులు మరొకరికి ఇవ్వడం గమనార్హం. అధికారులు, కొందరు నాయకులు కుమ్మక్కై అడ్డగోలుగా నిధులు బొక్కేస్తున్నారు.

Updated : 01 Mar 2024 05:28 IST

దళిత గుత్తేదారును ముంచేశారు
రూ.36.43 లక్షలు పక్కదారి
ఈనాడు, కర్నూలు

కె.బిజినవేములలో సచివాలయ భవనం

ఉపాధి హామీ నిధులు పక్కదారి పడుతున్నాయి.. పనులు చేసేంది ఒకరైతే నిధులు మరొకరికి ఇవ్వడం గమనార్హం. అధికారులు, కొందరు నాయకులు కుమ్మక్కై అడ్డగోలుగా నిధులు బొక్కేస్తున్నారు. పనులు చేసిన దళిత గుత్తేదారును నిలువునా ముంచేయడంతో బాధితుడు సంబంధిత అధికారుల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా నేటికీ ఎలాంటి న్యాయం జరగలేదు. నందికొట్కూరు మండలం కె.బిజినవేములలో గ్రామ సచివాలయ నిర్మాణ బాధ్యతను నాగటూరుకు చెందిన ఎస్‌.వెంకటేశ్వర్లు చేపట్టారు. గ్రామ ప్రత్యేకాధికారి అధ్యక్షతన 2020లో నిర్వహించిన సమావేశంలో తీర్మానించారు. పని పూర్తి చేసేందుకు రూ.40 లక్షలు ఖర్చవుతుందని తీర్మానంలో పేర్కొన్నారు. 2021లో పూర్తి చేయగా రూ.6,56,364 చెల్లించారు. మిగిలిన డబ్బుల కోసం ఆరా తీయగా ఇతరులకు రూ.24.42 లక్షలు పలు దఫాలుగా చెల్లించినట్లు తేలింది. తర్వాత మరో రూ.12 లక్షలూ చెల్లించారు.

ఏక పక్ష రాతలు

నిధులు ఎవరెవరికి చెల్లించారన్న అంశంపై సమాచార హక్కు చట్టం ద్వారా వెంకటేశ్వర్లు కొన్ని వివరాలు సేకరించారు. ఏఏ పేర్లతో చెక్కులు ఇచ్చారన్న సమగ్ర వివరాలను అధికారులకు అందించారు. నిర్మాణ అనుమతిని రద్దు చేసి మరో వ్యక్తికి అప్పగించినట్లు ప్రత్యేకాధికారి ఒక తీర్మానం చేసినట్లు విచారణ నివేదికలో పేర్కొన్నారు. ఒకరికి అప్పగించిన పనులను రద్దు చేసి మరో వ్యక్తికి అప్పగించడంలో ఎలాంటి తప్పు లేదుగానీ... అంతకు ముందు పనిచేసిన వ్యక్తికి అనుమతిని ఏ కారణంగా రద్దు చేశారన్న కారణాలు చూపాల్సి ఉంది. నోటీసులిచ్చి వివరణ తీసుకుని చట్టబద్ధంగా మరొకరికి పనులు అప్పగించొచ్చు. పాత గుత్తేదారు చేసిన పని విలువను నిర్ధారించి... ఆ మొత్తాన్ని చెల్లిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఇవేమీ జరగలేదు. మరో వ్యక్తికి పనులు అప్పగించినట్లు తీర్మానం చేసి పుస్తకాల్లో రాసి చెల్లింపులు చేసేశారు.

నిజాలకు పాతర

సచివాలయ నిర్మాణానికి సంబంధించి గుత్తేదారు ఎస్‌.వెంకటేశ్వర్లుకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ తీర్మానం పుస్తకంలో నేరుగా రాయకుండా ఒక పేపరు అతికించారని విచారణ అధికారి డి.సుబ్రహ్మణ్యశర్మ తన నివేదికలో రాశారు. నిర్మాణ బాధ్యతల నుంచి తప్పించినందుకు కారణాలను తీర్మానాల పుస్తకంలో రాయలేదని, పంచాయతీరాజ్‌ ఏఈ ఏమి సిఫార్సు చేశారన్న విషయం తీర్మానంలో నమోదు కాలేదని పేర్కొన్నారు. అనుమతి రద్దు విషయాన్ని ఆయనకు చెప్పినట్లు ఎలాంటి ఆధారాలను గ్రామ పంచాయతీ అధికారులు తన విచారణలో చూపలేదని నివేదికలో స్పష్టంగా రాశారు. కర్నూలు పంచాయతీరాజ్‌ ఈఈ మద్దయ్య మాట్లాడుతూ పనులు జరిగినప్పుడు తాను లేనని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని