logo

ఉపాధిలో అవినీతి ఘనులు

వలసలు నివారించి గ్రామాల్లో అర్హులైన వారికి పనులు చూపే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉపాధి పథకం పక్కదారి పడుతోంది. పథకంలోని లొసుగులను అవకాశంగా తీసుకుని కొందరు నిధులు స్వాహా చేస్తున్నారు.

Published : 01 Mar 2024 02:43 IST

ఆదోని మండలంలో ఉపాధి పనులు

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: వలసలు నివారించి గ్రామాల్లో అర్హులైన వారికి పనులు చూపే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉపాధి పథకం పక్కదారి పడుతోంది. పథకంలోని లొసుగులను అవకాశంగా తీసుకుని కొందరు నిధులు స్వాహా చేస్తున్నారు. పేదలకు పని చేపే మాటేమిటోగానీ.. పెద్దలకు ఉపాధిగా మారింది. పనులకు రాకపోయినా.. వచ్చినట్లు హాజరు వేయడం.. వచ్చిన సొమ్మును స్వాహా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనికితోడు సామాజిక తనిఖీలు నామమాత్రంగా మారాయి. ఆదోని మండలం అరేకల్‌, చిన్నపెండేకల్‌, దొడ్డనగేరి, కపటి, నారాయణపురం, అలసందగుత్తి తదితర గ్రామాల్లో జరిగిన ఉపాధి పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. కొందరు పనులకు రాకున్నా ఖాతాల్లో వేతనాలు జమవుతున్నాయి. మరికొందరు వేరే ప్రాంతాల్లో ఉండి ఇక్కడికి ఎప్పుడో ఒకసారి వచ్చిపోతున్నా నగదు వేస్తున్నారు. కొందరు ఒప్పంద ఉద్యోగులు జాబ్‌ కార్డులు తీసుకున్నారు. వారు ఉపాధి పనులు ఎపుడు చేస్తారో? ఉద్యోగానికి ఎప్పుడు వెళ్తారో తెలియాల్సి ఉంది. పర్యవేక్షణ చేయాల్సిన కొందరు మండల ఏపీవోలు ఆ దిశగా దృష్టి సారించడం లేదు.

తనిఖీలు నామమాత్రం

ఉపాధి పనులకు సంబంధించి ఏడాదికోసారి జరిగే సామాజిక తనిఖీలు నామమాత్రంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. అవినీతిని వెలికి తీయాల్సిన సామాజిక తనిఖీలు మొక్కుబడిగా సాగుతున్నాయి. అరేకల్‌ గ్రామంలో పరిశీలిస్తే 2019-20లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద 64 పనులకు రూ.13,86,386 ఖర్చు చేశారు. సామాజిక బృందం సభ్యులు తనిఖీ చేసి రూ.3,500 దుర్వినియోగమైనట్లు తేల్చారు. 2020-21లో రూ.32,63,313తో 25 పనులు చేయగా రికవరీ రూ.1,000గా చూపడం గమనార్హం. 2021-22లో 41 పనులకు రూ.27,19,529 వెచ్చించారు. రికవరీ రూ.3,647 తేల్చారు. 2022-23లో 46 పనులకు రూ.66,94,674 ఖర్చు చేయగా సామాజిక తనిఖీ నిర్వహించి కేవలం రూ.1,557 రికవరీకి ఆదేశించడం గమనార్హం. దీనిని పరిశీలిస్తే సామాజిక తనఖీ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

పర్యవేక్షణ కరవు

ఉపాధి పనుల్లో కొందరు ఇంజినీరింగ్‌ ప్రతినిధులు, సాంకేతిక, క్షేత్ర సహాయకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఉపాధి పనులపై దృష్టి సారించి విచారణ చేయాల్సిన సామాజిక తనిఖీ బృందాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. నిధులు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా చూడాల్సి ఉండగా నిర్లక్ష్యం కనపడుతోంది.

ఆదోని మండల ఉపాధి కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్లే అన్నీ తామై నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు క్షేత్ర సహాయకులు తెచ్చిన నివేదికలను పైఅధికారులకు పంపించాల్సింది ఆపరేటర్లే. వారికి ఎంతో కొంత ముట్టజెప్పి తప్పుడు నివేదిక పంపేలా చేస్తున్నారు. ఇటీవల వారిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని