logo

భూమి పోయింది.. భుక్తి కరవైంది

‘జలం’ తీసుకొస్తాం.. జనం బాగుపడతారని పాలకులు నమ్మించారు.. ఎలాంటి నష్టం జరగకుండా పరిహారం అందజేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. జలాశయాలకు వేలాది ఎకరాల సాగు భూములు లాక్కుకున్నారు.

Updated : 01 Mar 2024 05:27 IST

సాగునీటి ప్రాజెక్టులకు వేల ఎకరాలు సేకరణ
పరిహారం అందక బాధితుల జీవన పోరాటం
నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే

జొలదరాశి కోసం సేకరించిన తన 2.5 ఎకరాల పొలంలో పాతిన
హద్దు రాళ్లను చూపిస్తున్న రైతు ఈర్నపాటి పెద్ద వెంకట సుబ్బయ్య

‘జలం’ తీసుకొస్తాం.. జనం బాగుపడతారని పాలకులు నమ్మించారు.. ఎలాంటి నష్టం జరగకుండా పరిహారం అందజేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. జలాశయాలకు వేలాది ఎకరాల సాగు భూములు లాక్కుకున్నారు. బహిరంగ విపణిలో రూ.లక్షల ధర పలుకుతున్న పొలాలకు అరకొర పరిహారం ప్రకటించారు. అదైనా ఇచ్చారా అంటే ఏళ్లు గడుస్తున్నా ఆ ఊసే లేదు. దిక్కుతోచని రైతులు న్యాయస్థానం గడప తొక్కారు. బాధితులకు వెంటనే డబ్బులు చెల్లించాలని న్యాయస్థానాలు ఆదేశించినా సర్కారులో స్పందన కరవైంది. జరిమానాలు విధించినా సరే ఉలుకూపలుకు లేదు.

నాలుగేళ్లుగా న్యాయం చేయడం లేదు

ఎస్సార్బీసీ కాల్వ విస్తరణలో భాగంగా 2006లో  మిడుతూరు, గడివేముల మండలాలకు చెందిన 200 మంది రైతుల నుంచి 600 ఎకరాలు సేకరించారు. ఎకరాకు రూ.65 వేల పరిహారంగా చెల్లిస్తామన్నారు. న్యాయం చేయాలని రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎకరాకు రూ.1.60 లక్షలు ఇవ్వడంతోపాటు, ఆలస్యమైనందున వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికీ ప్రభుత్వం వారికి డబ్బు చెల్లించలేదు. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు 200 మంది రైతులకు ఎకరాకు రూ.4.50 లక్షలు చొప్పున రావాల్సి ఉంది. నాలుగేళ్లుగా ప్రభుత్వం దాటవేస్తూ వస్తోంది. దీంతో రూ.4 కోట్ల పరిహారం మొత్తం రూ.24 కోట్లకు చేరింది. ప్రాజెక్టు విస్తరణతో ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ధర పలుకుతోంది.

15 ఏళ్లు గడిచినా పైసా ఇవ్వలేదు

ఎమ్మిగనూరు మండలం బువ్వలదొడ్డి వద్ద చెరువు నిర్మాణం కోసం 60 మంది రైతుల నుంచి 118 ఎకరాలు సేకరించారు. ఎకరం ధర రూ.6.30 లక్షలుగా నిర్ణయించారు. 2009లో చెరువు నిర్మాణం పూర్తిచేశారు. 15 ఏళ్లు గడిచినా రైతులకు చిల్లి గవ్వ ఇవ్వలేదు. ప్రస్తుతం బహిరంగ విపణిలో ఈ పొలాల ధర ఎకరం రూ.20 లక్షల పైనే పలుకుతోంది. రైతులు పరిహారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం శూన్యం.

జొలదరాశికి కాసుల కష్టం

కోవెలకుంట్ల మండలం జొలదరాశి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించాలని మూడేళ్ల కిందట రైతుల నుంచి 2,465 ఎకరాల భూములు సేకరించారు. ఎకరాకు రూ.16 లక్షల పరిహారం నిర్ణయించారు. జొలదరాశి, వల్లంపాడు, కోవెలకుంట్ల, కలుగొట్ల, రేవనూరు, చిన్నకొప్పెర్ల, గోవిందిన్నె, వెలగటూరు, గోస్పాడు మండలం ఎస్‌.కూలూరు, బనగానపల్లి మండలం టంగుటూరు గ్రామాలకు చెందిన రైతుల నుంచి భూములు సేకరించారు. ఇంత వరకు పైసా పరిహారం ఇవ్వలేదు. జలాశయాన్నీ నిర్మించలేదు. వీటిపై ప్రభుత్వం ‘రెడ్‌మార్క్‌’ పెట్టడంతో రైతులు విక్రయించుకోలేక, పంట రుణాలు పొందలేక తీవ్రంగా నష్టపోతున్నారు.

రైతులపై రాజోలిబండ

ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలంలోని రాజోలి వద్ద 2.30 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న జలాశయం కోసం మూడేళ్ల కిందట 706 ఎకరాల భూమి సేకరించారు. ఎకరం ధర రూ.12.50 లక్షలుగా నిర్ణయించారు. చాగలమర్రి మండలం గొట్లూరు, రాజోలి, ఉయ్యాలవాడ మండలం కాకరవాడ, ఆర్‌.జంబులదిన్నె గ్రామాల్లోని రైతుల నుంచి ఈ భూమిని సేకరించారు. ఇంత వరకు ఒక్కపైసా పరిహారం కూడా రైతులకు ఇవ్వలేదు. సేకరించిన భూములను రెడ్‌మార్క్‌లో ఉంచడంతో రైతులు వాటిని విక్రయించుకోలేక, మార్టిగేజ్‌ చేసుకోలేక, రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని