logo

గడపలో మాట.. నీటి మూట

గడప.. గడపకొచ్చారు.. సమస్యలపై ప్రజలు నిలదీస్తే ‘హామీ’ ఇచ్చి వీధి దాటారు.. ఇదిగో అంటూ ప్రజాప్రతి‘నిధు’లు గొప్పలు చెప్పారు. ‘బిందెడు’ నీళ్లు ఇవ్వలేకపోయారు.. వీధిలో స్తంభం పెట్టలేకపోయారు..

Published : 01 Mar 2024 02:47 IST

ఆలూరు గ్రామీణ: మంచినీటి సమస్య పరిష్కరించాలని గడప.. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆస్పరి మండలం కైరుప్పలకు వచ్చిన మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు గ్రామస్థులు విన్నవించారు. 2022లో మాట ఇచ్చారు.. ఇప్పటికీ పరిష్కరించలేదు.

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : గడప.. గడపకొచ్చారు.. సమస్యలపై ప్రజలు నిలదీస్తే ‘హామీ’ ఇచ్చి వీధి దాటారు.. ఇదిగో అంటూ ప్రజాప్రతి‘నిధు’లు గొప్పలు చెప్పారు. ‘బిందెడు’ నీళ్లు ఇవ్వలేకపోయారు.. వీధిలో స్తంభం పెట్టలేకపోయారు.. కర్నూలు జిల్లా పరిధిలో 3,671 పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపించగా 441, నంద్యాలలో 2,033 పనులు ప్రతిపాదిస్తే 717 పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో 720 పనులకు సంబంధించి రూ.34.69 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ప్రభుత్వంపై నమ్మకం లేక పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో కొందరు ముందుకొచ్చినా బిల్లులు ఇవ్వలేదు. వారంతా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

5,087 పనులకు ఆమోదం

కర్నూలు జిల్లాలో 3,132 పనులకు కలెక్టర్‌ ఆమోదముద్ర వేశారు. వీటికి రూ.163.06 కోట్లు ఖర్చవుతాయని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో రూ.87.73 కోట్ల విలువ చేసే 1,779 పనులే ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.24.06 కోట్ల విలువైన 441 పనులు పూర్తి చేశారు. 133 పనులకు సంబంధించి రూ.7.82 కోట్ల విలువ చేసే బిల్లులు అప్‌లోడ్‌ చేశారు. నంద్యాల జిల్లాలో రూ.97.25 కోట్లు విలువ చేసే 1,955 పనులు మంజూరయ్యాయి. వీటిల్లో రూ.68.23 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టగా 1,462 పనులే ప్రారంభించారు.

విద్యుత్తు వెలుగులు ఎప్పుడో

ఇళ్ల మధ్య నుంచి వెళ్తున్న విద్యుత్తు లైన్ల మార్పు, కొత్తవి ఏర్పాటు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాల ఏర్పాటుకు సంబంధించి పనులను గుత్తేదారుల ద్వారా చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో రూ.లక్షల విలువ చేసే పనులు చేపట్టగా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా బిల్లులు అప్‌లోడ్‌ చేశారు. ఇప్పటికీ నిధులు మంజూరు కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు విద్యుత్తు శాఖ పనులకు మాత్రం ఏపీఎస్‌పీడీసీఎల్‌ చెల్లించాలని చెప్పడం గమనార్హం. అప్‌లోడ్‌ చేసిన బిల్లులన్నీ మంజూరవుతున్నాయని ముఖ్య ప్రణాళిక శాఖ అధికారులు చెబుతున్నారు. జీజీఎంపీ పథకం కింద సకాలంలో బిల్లులు రావడం లేదనే కారణంతో పనులు చేసేందుకు గుత్తేదారులు సుముఖత చూపడం లేదన్న విమర్శలున్నాయి.

నత్తను తలపిస్తున్నాయ్‌

  • చిప్పగిరి, దేవనకొండ, హొళగుంద, కోడుమూరు, నందవరం మండలాలతోపాటు ఎమ్మిగనూరు పట్టణంలో ఒక్క పనీ పూర్తి కాలేదు. సి.బెళగల్‌ మండలంలో 64 పనులు మంజూరు చేయగా 37 వరకు వివిధ దశల్లో ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క పని పూర్తైంది.
  • దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేశారు. ప్రస్తుతం 91 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కటీ పూర్తి కాలేదు.
  • తుగ్గలి మండలంలో రూ.6.63 కోట్లతో 175 పనులు మంజూరు చేశారు. 174 పనులు వివిధ దశలో ఉన్నాయి. కేవలం ఒక్కటి మాత్రమే పూర్తైంది.
  • ఎమ్మిగనూరు పట్టణంలో రూ.2.59 కోట్లతో 27 పనులకు ఆమోదం తెలిపారు. 11 పనులు వివిధ దశలో నత్తనడకన సాగుతున్నాయి.. ఒక్కటీ పూర్తి కాలేదు.

జలం అందక.. జనం గొంతెండుతోంది

  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు గ్రామాల్లో జనం గొంతెండుతోంది. రోడ్లెక్కి ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కల్లుదేవకుంటలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలకలడోన, మంత్రాలయానికి వెళ్లి నీటిని తెచ్చుకొనే పరిస్థితి నెలకొంది.
  • నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని 10 బొల్లవరంలో గత నెల రోజులుగా తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. సమస్య తీర్చాలంటూ అధికారులు, పాలకులను జనం నిలదీస్తున్నారు. కర్నూలు-గుంటూరు రోడ్డెక్కి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
  • డోన్‌ మండలంలోని చనుగొండ్ల, ఎద్దుపెంట, కొత్త బురుజు, తిమ్మాపురం, మల్లంపల్లి తదితర గ్రామాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలని వామపక్ష పార్టీల నాయకులు అధికారులకు మొరపెట్టుకున్నారు.
  • వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను హొళగుంద మండలంలోని నెరణికి, నెరణికితండా, ఎల్లార్తి, హెబ్బటం, పెద్ద గోనేహల్‌ తదితర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు విన్నవించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు