logo

పశ్చిమాన నెత్తుటి తిలకం

ఆరుగాలం కష్టపడి.. అప్పులు చేసి.. పంటలు సాగు చేస్తారు. వచ్చిన దిగుబడి విక్రయించాలంటే స్థానికంగా సరైనా మార్కెట్‌ సౌకర్యం లేదు. ఉన్న మార్కెట్‌లో గిట్టుబాటు ధర రాదు.

Updated : 03 Apr 2024 05:06 IST

మిరప దిగుబడి విక్రయాలకు వెళ్తూ మృత్యువాత
స్థానిక మార్కెట్‌లో ధర కరవు..

హాలహర్వి, ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: ఆరుగాలం కష్టపడి.. అప్పులు చేసి.. పంటలు సాగు చేస్తారు. వచ్చిన దిగుబడి విక్రయించాలంటే స్థానికంగా సరైనా మార్కెట్‌ సౌకర్యం లేదు. ఉన్న మార్కెట్‌లో గిట్టుబాటు ధర రాదు. కష్టానికి ఫలితం దక్కాలనే ఉద్దేశంతో పశ్చిమ ప్రాంతం నుంచి సుమారు 450 కి.మీ. దూరంలోని గుంటూరు, కర్ణాటక రాష్ట్రంలోని బ్యాడిగ మార్కెట్లకు వెళ్తారు. ఈ ప్రయాణంలో ప్రమాదాల బారిన పడి రైతులు మృత్యుఒడికి చేరుతున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా పెద్దకడబూరు, మంత్రాలయం మండలాలకు చెందిన రైతులు నలుగురు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. కుటుంబాలు వీధినపడ్డాయి.

విక్రయాలకు ప్రాణాలు పణం

కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతాలైనా ఆదోని, మంత్రాలయం, పెద్దకడబూరు, కోసిగి, కౌతాళం, ఎమ్మిగనూరు, ఆలూరు, హాలహర్వి, హొళగుంద మండలాల్లో బ్యాడిగి రకం మిరపను, ఆస్పరి, దేవనకొండ మండలాల్లో గుంటూరు, బ్యాడిగి రకానికి చెందిన మిరప సాగు చేస్తారు. పంట ఎదుగుదల, దిగుబడి కోసం రూ.లక్షలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తారు. వచ్చిన  దిగుబడి విక్రయించేందుకు అన్నదాతలకు సరైన మార్కెట్‌ సౌకర్యం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుతం ఆదోని మార్కెట్‌లో వారంలో మూడు రోజుల పాటు మిరప విక్రయాలు కొనుగోలు చేసినా.. కర్షకులకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ఇబ్బందులు పడుతూనే గుంటూరు, కర్ణాటక రాష్ట్రం బ్యాడిగి వంటి ప్రాంతాలకు తరలించి విక్రయించుకొని వస్తున్నారు. దిగుబడి విక్రయించేందుకు వెళ్తున్న రైతులు ప్రమాదాల బారినా పడుతుండటంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

దృష్టిసారించని ప్రభుత్వం

స్థానికంగా సరైన మార్కెట్‌ సౌకర్యం లేక అన్నదాతలు మృత్యువాగ పడుతున్నా.. ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.  జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో బ్యాడిగి రకం మిరప సాగు చేస్తున్నారు. ఈ రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి గ్రామాల్లోనే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలి. దీని ద్వారా రైతులకు మంచి జరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

పోటీ లేని వ్యాపారం

ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మిర్చి విక్రయాలు గత ఏడాది డిసెంబరులో ప్రారంభించారు. కానీ వ్యాపారుల మధ్య పోటీ లేకపోవడంతో క్రయవిక్రయాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఆరంభంలో వారంలో రెండు రోజులు(బుధ, ఆదివారం) మార్కెట్‌ నిర్వహించే వారు. హామాలీల విన్నపం మేరకు వారంలో మూడు రోజులు(సోమ, బుధ, శుక్రవారం) మిర్చి వ్యాపారాలను సాగిస్తున్నారు. ఆరంభంలో దిగుబడులు ఫర్వాలేదనపించినా, అనంతరం పేలవంగా వస్తున్నాయి. సరాసరి 1400-4 వేల బస్తాల దాకా సరకు అమ్మకానికి వస్తోంది. స్థానిక టోకు వ్యాపారులే వస్తుండటం, ధర చూసి కొనుగోలు చేయడంతో ఆశించిన ప్రయోజనం కలగడం లేదు. పెద్ద వ్యాపారులు, ప్రధానంగా ఎగుమతి చేసే వ్యాపారులు వస్తే ధరలు బాగా పలికే అవకాశముందంటున్నారు. ఇలాంటి వ్యాపారులు వస్తే, మిర్చి శీతల గోదాములు, కారం మిషన్లు మర యంత్రాలు, ప్యాకింగ్‌ వంటి పరిశ్రమలు ఏర్పడతాయంటున్నారు.


బతుకులు రోడ్డుపాలు

  • ఫిబ్రవరి 26న పెద్దకడబూరు మండలం నాగలాపురం, మంత్రాలయం మండలం సింగరాజనహళ్లి గ్రామాలకు చెందిన కొందరు రైతులు తాము పండించిన మిరప కాయల దిగుబడులను కర్ణాటకలోని బ్యాడిగ మార్కెట్‌లో విక్రయించడానికి టెంపో (బోలెరో) వాహనంలో బయల్దేరారు. ఆదివారం అర్ధరాత్రి బ్యాడిగ సమీపంలోని దావణగేరి వద్దకు చేరుకోగానే టైరు పంచర్‌ కావడంతో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నాగలాపురానికి చెందిన పెద్ద ఎంకన్న(40), పింజరి మస్తాన్‌(45), సింగరాజనహళ్లికి చెందిన ఆటో ఈరన్న(35) అక్కడికక్కడే మృతిచెందారు. లింగన్న, చిన్నారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
  • మార్చి 4వ తేదీన పెద్దకడబూరు మండలం కంబళదిన్నె గ్రామానికి చెందిన కొందరు రైతులు మిరప పంటను విక్రయించేందుకు బొలేరో వాహనంలో కర్ణాటకలోని బ్యాడిగకు శనివారం సాయంత్రం బయల్దేరారు. బళ్లారి జిల్లా రాంపురం ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా టైరు పేలి వారి వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో బోయ నాగేంద్ర అలియాస్‌ రోగెన్న(38) వాహనం కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని బళ్లారి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ప్రమాదంలో నలుగురు రైతులు గాయాలతో బయటపడ్డారు.
  • గతేడాది మిరప పంటను విక్రయించేందుకు వెళ్లిన హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామానికి చెందిన రైతులు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని