logo

చెత్త పన్నులు.. వింత పనులు

ఆదోని పట్టణంలో పురపాలక సంఘం పరిధిలో నెలవారీ చెత్త పన్ను విధింపుతో ప్రజలపై ఆర్థిక భారం మోపినట్లైంది.

Published : 13 Apr 2024 02:19 IST

పురపాలికల్లో వికటించిన ప్రయోగం
వ్యతిరేకిస్తున్న పట్టణ వాసులు

ఆదోని పురపాలకం, ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో పురపాలక సంఘం పరిధిలో నెలవారీ చెత్త పన్ను విధింపుతో ప్రజలపై ఆర్థిక భారం మోపినట్లైంది. క్లాప్‌(క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌)పేరుతో ఇంటింటి చెత్త సేకరణ చేసి, స్వచ్ఛత కల్పిస్తామంటే ప్రజలు సంతోషపడ్డారు. పన్ను భారంతో అవస్థలు పడుతున్నారు.  వైకాపా ప్రభుత్వం వింత పోకడలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, తదితర వాటిపై దృష్టిసారించాల్సిన పాలకులు.. పురవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చెత్త సేకరణ పన్ను విధిస్తున్నారు. చెల్లించకపోతే కుళాయి కనేక్షన్లు తొలగించడం, సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం, చెత్తాచెదారం తెచ్చి ఇళ్ల ముంగిట, వ్యాపార స్థలా ముందు వేయడం వంటి వికృత చేష్టలతో మరింత విసిగిపోతున్నారు. పట్టణాల్లో చెత్త పన్ను విధించడాన్ని వార్డుల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని ముక్తకంఠంతో చెబుతున్నారు.


ఇదో వింత పద్ధతి

- సూజాత, గృహిణి.

ఇంటింటి చెత్త సేకరణ పేరుతో రుసుం వసూలు చేయడం విడ్డూరంగా ఉంది. నెలకు రూ.45 వసూలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు. ఏడాదికి ఆస్తి, నీటి పన్నులు చెల్లిస్తున్నాం. వచ్చే ఆదాయానికి.. చేసే ఖర్చులకు పొంతన ఉండటం లేదు. కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారాయి. వారికి ఆర్థిక ఉన్నతికి తోడ్పాటు అందించాల్సి పోయి.. ఇంకా బలహీనులను చేస్తోంది ప్రభుత్వం.


అద్దెలు చెల్లించలేకపోతున్నాం

- నరేంద్రకుమార్‌, వ్యాపారి

చెత్త పన్ను ఆర్థిక భారమే. దుకాణానికి రూ.150 విధించారు. పోటీ మార్కెట్‌ వల్ల వ్యాపారాలు పడిపోయాయి. దుకాణాల అద్దెలు సైతం చెల్లించలేని పరిస్థితి. గుమాస్తాలు జీతాలు, విద్యుత్తు బిల్లులు, నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు ఇలా తడిసి మోపెడవుతోంది. గతంలో లాగా వ్యాపారాలు, లాభాలు ఇప్పుడు లేవు. ఇలాంటి అదనపు భారాలతో మరింత నష్టపోతున్నాం.


మా కష్టాలు ఎవరికి చెప్పాలి

- రఘువీర్‌ తిలక్‌, కిరాణ వ్యాపారి

ఏ ప్రభుత్వంలో ఇలాంటి విధానం చూడలేదు. ఇళ్లలో చెత్త తెచ్చి.. తొట్టేలో వేసేవాళ్లం. ప్రజారోగ్య సిబ్బంది తీసుకేళ్లేవారు. స్వచ్ఛ వాతావరణం కల్పిస్తామంటే సంతోషపడ్డాం. ఆటోల ద్వారా ఇంటి వద్దకే చెత్త సేకరణ బాగుందనుకున్నాం. ఇలా మా దుకాణాలకు రూ.150-200 వసూలు చేయడం భావ్యం కాదు. ఏడాదికి రూ.2వేలు- 2500ల దాకా అవుతోంది. ఇంత భారం మోసేదేలా. వ్యాపారుల కష్టాలు ఎవ్వరికి చెప్పుకోవాలి.


ప్రతి నెలా రూ.150

- అశోక్‌, క్షౌర దుకాణ నిర్వాహకుడు, ఆదోని

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చెత్త పన్ను వసూళ్ల పేరుతో క్షౌరదుకాణానికి సైతం విధించడం బాధాకరం. ప్రతి నెలా రూ.150 విధిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చిన్న చిన్న క్షౌరదుకాణాలు సైతం పన్ను చెల్లించాలనడం సరికాదు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని క్షౌరదుకాణాల నిర్వాహకులు మూముమ్మడిగా నిరసన తెలిపినా ప్రభుత్వం పట్టించుకోలేదు.


వాహనాలు మూలకుపడేశారు

- మహిపాల్‌, ఆదోని పట్టణం

ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తామని రూ.కోట్లు నిధులు వెచ్చించి పురపాలక సంఘం పరిధిలో పదుల సంఖ్యలో చెత్త సేకరణ వాహనాలను కొనుగోలు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. గత ఏడాదిగా చెత్త సేకరణ వాహనాల నిర్వహణ చేత కాక ప్రభుత్వం వాటిని మూలనుపడేశాయి. ఈ వాహనాల నిర్వహణను గాలికొదిలేశారు. రూ.కోట్ల నిధులు చెత్తపాలు కావాల్సిందే. ప్రభుత్వం స్పందించి వాహనాలను వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.


దుకాణాలపై భారం

- వి.టి.ప్రకాశ్‌, ఫొటో స్టూడియో యజమాని, ఆదోని

ఒకటే దేశం.. ఒకటే పన్ను అన్నారు ప్రభుత్వం. మరి ఏటా తాము సంపాదించిన దాంట్లో 18 శాతం పన్నులు రూపేణా డబ్బులు చెల్లిస్తున్నాం. మరి వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నెలా నెలా దుకాణాలపై చెత్త పన్ను విధించడం దారుణం. ఏకంగా రూ.250లు చెల్లించమంటే ఎలా. మున్సిపాలిటీ పన్నులో రోడ్డు, వీధిదీపాలు, చెత్త సేకరణ తదితర వసతులను కలిపే వసూలు చేస్తున్నారు. ఇప్పుడు చెత్త పన్ను వసూళ్లు చేయడం సరికాదు. ఈ పన్నును ప్రభుత్వం రద్దు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని