logo

‘జే’గనాసురుడి విషపు సుక్క

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్‌ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్‌, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.

Updated : 25 Apr 2024 06:42 IST

నిత్యం రూ.4.50 కోట్ల విక్రయాలు

కర్నూలు, నేరవిభాగం, కర్నూలు వైద్యం న్యూస్‌టుడే

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్‌ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్‌, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దుకాణాల సంఖ్య తగ్గించిన జగన్‌ ధరలు భారీగా పెంచారు. ఒకప్పుడు రూ.50 ఉన్న సీసా ధర ఏకంగా రూ.150కు పెంచేశారు. ఆదాయం పెంచాలన్న ఉద్దేశంతో ఆబ్కారీ శాఖ అధికారులు అనధికారికంగా గొలుసు దుకాణాలు ప్రోత్సహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలా గ్రామాల్లో 24 గంటలపాటు ప్రభుత్వ మద్యం అందుబాటులో ఉంటోంది. విక్రయాలు ఆపేయాలంటూ మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ కార్యాలయాల వద్ద మహిళలు పలుమార్లు ఆందోళన చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.

మద్యం తీసిన ప్రాణం

 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే సరకుపై చాలా మందికి నమ్మకం లేక సరిహద్దు దాటి తెలంగాణ, కర్ణాటక మద్యం తాగుతున్నారు. ఈ క్రమంలో  రోడ్డు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్న ఘటనలు నిరంతరం చోటుచేసుకుంటున్నాయి. కర్నూలు శరీన్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి మద్యం తాగి తిరిగి వస్తూ రహదారి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. పక్షవాతానికి గురైన అతని తండ్రి, అతనికి సేవలు చేసే తల్లి జీవితం ప్రశ్నార్థకంగా మారింది.

 మాటలు చెప్పారు

‘‘ మద్యం కారణంగా అన్యాయానికి గురవుతున్న అక్కచెల్లెమ్మల బాధ చూడలేకున్నా.. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం అమలు చేస్తామని’’ 2017లో ప్రజా సంకల్ప పాదయాత్రకు చాగలమర్రికి వచ్చిన సందర్భంలో జగన్‌ ప్రగల్భాలు పలికారు.

 మడమ తిప్పారు

‘‘ మాట తప్పని.. మడమ తిప్పని వంశమని చెప్పుకొనే జగన్‌.. ‘అధికార’ గద్దెనెక్కగానే దశల వారీగా మద్యపాన నిషేధమంటూ మాట మార్చారు. నవరత్నాల్లో పేర్కొంది మద్యపాన నిషేధం కాదని.. మద్యపాన నియంత్రణ అంటూ ప్లేటు ఫిరాయించారు.  

చీడలా మారారు

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు పెట్టారు.. విక్రయాలు తగ్గించేందుకు ధరలు పెంచినట్లు కనికట్టు చేశారు.. గత మద్యం బ్రాండ్లకు తిలోదకాలు ఇచ్చి నాసిరకమైన మద్యం సరఫరా చేస్తున్నారు. వైకాపా పెద్దల బ్రాండ్లే లక్ష్యంగా విక్రయాలు పెంచేసి రోజూ రూ.కోట్లు దోచేసుకుంటున్నారు. నాసిరకం మద్యం అమ్మేస్తూ విషపు సుక్క పోస్తున్నారు.

డబ్బులు లేక.. ఆరోగ్యశ్రీ వర్తించక..

మద్యానికి బానిసైన మధు కాలేయం దెబ్బతింది. భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిత్యం రూ.5 వేలు వెచ్చించి ఇంజెక్షన్‌ తీసుకుంటున్నారు. అది ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేదు.. ప్రైవేటులో తీసుకోవాల్సిందే. ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు. కొన్ని రోజులు బంధువులు ఆదుకున్నారు.. వారూ చేతులెత్తేయడంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆ కుటుంబం దాతల కోసం ఎదురుచూసే దుస్థితికి చేరింది.

  • కర్నూలు బుధవారపేటకు చెందిన రాజేశ్‌ కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. తండ్రి లేకపోవటంతో భార్య, కుమార్తెతోపాటు తల్లి బాగోగులు తానే చూసుకునేవారు. మద్యానికి బానిసైన అతను పనికి వెళ్లటం మానుకున్నారు. తల్లి, భార్య మందలించటంతో మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబ జీవనం ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని రోజుల కిందట అదే కాలనీకి చెందిన ఓ యువకుడు మద్యానికి బానిస కావటంతో తల్లి మందలించగా హంద్రీలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
  • నందికొట్కూరుకు చెందిన రఫిలా అహ్మద్‌ (50) నాలుగు నెలల కిందట కర్నూలు సర్వజన వైద్యశాలలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో చికిత్స నిమిత్తం చేరారు. మద్యం ఎక్కువగా తాగడం వల్లే లివర్‌ దెబ్బతిన్నదని వైద్యులు చెప్పారు.
  • నంద్యాల జిల్లా ఎర్రగూడూరుకు చెందిన రమణయ్య (40) కాలేయం సమస్యతో వారం కిందట పెద్దాస్పత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో చేరారు.  
  • 2023లో రూ.1,660 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.. ఈ నిధులతో ఆర్డీఎస్‌ ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు. అది పూర్తయితే లక్ష ఎకరాలకు నీరు అందుతుంది.. వేలాది కుటుంబాలు బాగుపడతాయి.. పశ్చిమ ప్రాంతంలో వలస అనే మాట వినిపించదు.

నవరత్నాలే విక్రయించాలని..

లిక్కర్‌కు సంబంధించి 130 బ్రాండ్లు ఉండగా అందులో అధికార పార్టీకి చెందిన కంపెనీవి చెందినవి తొమ్మిది వరకు ఉన్నాయి. సదరు బ్రాండ్లనే అధికంగా విక్రయించాలని ఆబ్కారీ శాఖ అధికారులపై ఒత్తిడి అధికంగా ఉంటోంది. వాటినే విక్రయించాలని మద్యం దుకాణాల్లో సేల్స్‌మెన్లకు చెబుతున్నారు. ఆయా బ్రాండ్లు నాసిరకం కావడంతో కాలేయం దెబ్బతిని ఆసుపత్రుల పాలవుతున్నట్లు ఆరోపణలున్నాయి. మద్యానికి బానిసై అనారోగ్యం బారిన పడటంతో ప్రతి నెలా 40 నుంచి 50 మంది బాధితులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇలాంటి వారు ఏటా 600 మంది వరకు ఉంటున్నారు. గత మూడేళ్లలో వీరి సంఖ్య పెరిగింది. మద్యానికి బానిసలై ఆసుపత్రుల పాలవుతున్న బాధితులంతా లివర్‌ సిర్రోసిస్‌, పాంక్రియాస్‌, కడుపులో మంట, అజీర్తి, కండరాల నొప్పి, తల తిప్పడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ‘‘చాలా ఏళ్లుగా మద్యం తాగుతున్నా.. అంతకు ముందెన్నడూ ఆరోగ్య సమస్యలు లేవని.. స్పిరిట్‌లో రంగు, ఇతర ఫ్లేవర్లు కలుపుతుండటంతో నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని’’ పలువురు బాధితులు పేర్కొన్నారు.

పది పడకలు సరిపోవడం లేదు

కర్నూలు సర్వజన వైద్యశాలలో మత్తు పదార్థాల విమోచన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారికి ఇక్కడ వైద్యసేవలు అందిస్తారు. గత మూడేళ్లలో 9 వేల మంది ఓపీకి రాగా, 3 వేలు ఐపీగా ఉంది. ఇందులో 512 మంది వరకు మద్యానికి బానిసైనవారే.  

పల్లెల్లో 24 గంటలు అమ్మకాలు

ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామంలో గొలుసు దుకాణాలు ఉన్నాయి. వీటిని వైకాపా నాయకులు ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. పట్టణాల్లో బార్లు, మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటలకు మూతపడితే పల్లెల్లోని గొలుసు దుకాణాల్లో 24 గంటలూ విక్రయిస్తున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్లు వైకాపా నేతలు సిఫారసు చేసినవారే కావడంతో గొలుసు దుకాణాలకు కావాల్సినంత మద్యం సరఫరా చేస్తున్నారు. మద్యం అమ్మకాలు పెరిగి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరుతుండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని