logo

అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం

ధన్వాడ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. రైతులు, మామిడి తోటల పెంపకందారులను కోలుకోలేని దెబ్బతీసింది.

Updated : 20 Apr 2024 06:31 IST

మరికల్‌: తీలేర్‌లోని ఓ తోటలో రాలిన మామిడి కాయలు

ధన్వాడ, న్యూస్‌టుడే : ధన్వాడ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. రైతులు, మామిడి తోటల పెంపకందారులను కోలుకోలేని దెబ్బతీసింది. ముఖ్యంగా కోయిల్‌సాగర్‌ ఆయకట్టు పరిధిలోని గోటూర్‌, కొండ్రోన్‌పల్లి గ్రామాల్లో వరి పంటకు అపారనష్టం వాటిల్లింది. పై రెండు గ్రామాల్లో 2,500 వరకు వరి సాగు చేయగా ఇప్పటి వరకు వెయ్యి ఎకరాల్లో కోత పూర్తయ్యింది. మిగిలిన వాటిని నేడో రేపో కోయాలనుకుంటున్న తరుణంలో అకాల వర్షం సుమారుగా 8వందల ఎకరాల పంటను దెబ్బతీసింది. కల్లాలు లేకపోవడంతో లోతట్టు ప్రాంతాల్లో, రోడ్డు పక్కన, కాల్వ గట్టున ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీళ్లు నిలిచి ముద్దగా మారింది. నర్వ మండలంలో అక్కడక్కడ వర్షం కురిసింది. మండల ఇన్‌ఛార్జి వ్యవసాయాధికారి శివకుమార్‌, ఏఈవో రాజుతో కలిసి తడిసిన, దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు. నష్టపోయిన రైతులు ఆదుకోవాలని రైతులు, నాయకులు కోరారు.

నేలరాలిన మామిడి కాయలు

కిష్టాపూర్‌ రెవెన్యూ పరిధిలోని మణిపూర్‌ తండా శివారులో రైతు రూప్లానాయక్‌ రెండు ఎకరాల్లో మామిడితోట, ధన్వాడకు చెందిన టైలర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ నాలుగు ఎకరాల్లో, ఇదే గ్రామానికి చెందిన మెకానిక్‌ భాను పరిస్థితి అలాగే ఉంది. కిష్టాపూర్‌, కొండాపూర్‌, హన్మన్‌పల్లి, చర్లపల్లి గ్రామాల్లోని తోటల్లోనూ మామిడి కాయలు రాలి అన్నదాతలకు నష్టం వాటిల్లింది.

అంధకారంలో గ్రామాలు

ధన్వాడ మండలంలోని గోటూర్‌, కొండాపూర్‌ విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలోని పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఈదురు గాలుల దెబ్బకు చెట్లు నేలకొరిగి విద్యుత్తు తీగలపై పడటంతో తెగిపోయి స్తంభాలు నేలమట్టమయ్యాయి. నియంత్రికలు సైతం పడిపోయాయి. గోటూర్‌తో పాటు కొండ్రోన్‌పల్లి, కిష్టాపూర్‌, మీదితండా గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

మరికల్‌(ధన్వాడ), న్యూస్‌టుడే : మరికల్‌ మండలంలో అకాల వర్షానికి మామిడి, బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తీలేర్‌ గ్రామానికి చెందిన వీరారెడ్డి తోటలో విరివిగా కాసిన కాయలన్ని నేలమట్టమయ్యాయి. పూసల్‌పాడు గ్రామానికి చెందిన రైతు బసిరెడ్డి నాలుగున్నర ఎకరాల్లో రూ. నాలుగు లక్షలు వెచ్చించి బొప్పాయి తోట సాగు చేయగా కొమ్మలు, చెట్లు నేలకొరిగి బొప్పాయి దెబ్బతింది. పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైందని రైతు వాపోయారు. ఈ విషయాన్ని పండ్లతోటల శాఖాధికారులతో పాటు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు బసిరెడ్డి చెప్పారు. పూసల్‌పాడులో విద్యుత్తు స్తంభాలు, నియంత్రికలు పడిపోయి సరఫరా నిలిచిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు