logo

మత్తుతో యువత చిత్తు

యువత మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగంతో పక్కదారి పడుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో ప్రమాదాల బారినపడుతూ.. నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

Published : 20 Apr 2024 03:59 IST

హైదరాబాద్‌ నుంచి వస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు 

నాగర్‌కర్నూల్‌ పట్టణంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి

నాగర్‌కర్నూల్‌, బిజినేపల్లి, న్యూస్‌టుడే : యువత మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగంతో పక్కదారి పడుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో ప్రమాదాల బారినపడుతూ.. నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎదుటి వారి ప్రాణాలను తీస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని బస్టాండ్‌లో ఈ నెల 12న ఓ యువకుడి నుంచి 30 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి హైదరాబాద్‌ ధూల్‌పేట్‌ నుంచి నాగర్‌కర్నూల్‌కు సరఫరా అవుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్‌ నుంచి సరఫరా అవుతున్న గంజాయి జిల్లాలోని ఏయే ప్రాతాలకు వస్తోంది? ఎవరెవరు సరఫరా చేస్తున్నారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.  

బిజినేపల్లిలోనే అధికం.. : నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, బిజినేపల్లి మండలంలోని పాలెం, బిజినేపల్లి, వట్టెం, మంగనూర్‌ గ్రామాల్లో యువకులు మత్తు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. బిజినేపల్లి మండలంలోనే వరుస సంఘటనలు జరుగుతున్నాయి. మద్యం ప్రభావం అధికమైంది. మద్యం మత్తులో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. బిజినేపల్లి మండలంలోని గ్రామాలకు నాగర్‌కర్నూల్‌తో పాటు మహబూబ్‌నగర్‌ నుంచి మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నట్లు సమాచారం.

ప్రాజెక్టులలోని కార్మికులకు సరఫరా.. : కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల పరిధిలో కొల్లాపూర్‌ ప్రాంతంలోని ఎల్లూరు, వనపర్తి జిల్లాలోని ఏదుల, బిజినేపల్లి మండలంలోని వట్టెం జలాశయం, కర్వెన జలాశయం ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు గంజాయి వినియోగిస్తున్నారు. ప్రాజెక్టుల పరిధిలో వందల మంది కార్మికులు పనిచేస్తుండటంతో పకడ్బందీగా సరఫరా చేస్తున్నారు. గంజాయితో పాటు మత్తుతో కూడిన సిగరెట్లు సరఫరా అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటితో పాటు సారా అధికంగా సరఫరా అవుతోంది. ఎవరికి తెలియకుండానే నిత్యం కొనసాగుతోంది. వీటి ప్రభావం పరిసర ప్రాంతాల్లోని గ్రామాలపై పడుతోంది. ఆయా గ్రామాల్లో యువత ప్రభావితమవుతున్నారు. మద్యం, మత్తు పదార్థాలను అమ్మే కేంద్రాలుగా మారుతున్నాయి. ఆయా ప్రాంతాలపై ఎక్కడా నిఘా ఉండటం లేదు.

 మత్తు పదార్థాల సరఫరాపై నిఘా పెంచి నియంత్రిస్తామని ఎస్పీ, గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ పేర్కొన్నారు.

వరుస సంఘటనలు ఇలా.. : మార్చి 6న బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్‌ గ్రామంలో మద్యం మత్తులో ఓ తండ్రి కన్న కొడుకును కత్తితో పొడిచి చంపాడు.

  •  మార్చి 16న కల్వకుర్తి పట్టణం నుంచి నాగర్‌కర్నూల్‌ వైపు ఆటోతో వస్తున్న యువకుడు సంపత్‌ మద్యం మత్తులో బస్సును ఢీ కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
  •  మార్చి 17న బిజినేపల్లి మండలంలోని వెంకటాపూర్‌ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కక్కడే మృతి చెందాడు. యువకులు మద్యం మత్తులో ఉన్నట్లుగా గుర్తించారు.
  •  ఈనెల 4న బిజినేపల్లి మండలం వెంకటపూర్‌ శివారులో పాలెం నుంచి నాగర్‌కర్నూల్‌ వైపు వెళ్తున్న నాగనూల్‌కు చెందిన యువకుడు ద్విచక్రవాహనం నుంచి అదుపు తప్పి కిందపడిపోయాడు. అక్కడిక్కక్కడే మృతి చెందాడు.
  •  ఈనెల 8న బిజినేపల్లికి చెందిన యువకుడు శివకుమార్‌ కల్వకుంట తండాకు చెందిన వివాహితను వెల్గొండ శివారులో గొంతు నులిపి హత్య చేశాడు. అక్కడ గంజాయి అనవాళ్లు ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని