logo

తాపం తట్టుకుంటూ విధి నిర్వహణ

నిత్యం లక్షలాది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే వేడి తట్టుకోలేకపోతున్నారు.

Published : 20 Apr 2024 04:12 IST

వేసవిలో జాగ్రత్తలు తీసుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగులు 

మహబూబ్‌నగర్‌ : సిబ్బందిని పరీక్షిస్తున్న ఆర్టీసీ వైద్యుడు డా.మైనుద్దీన్‌

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ పట్టణం : నిత్యం లక్షలాది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే వేడి తట్టుకోలేకపోతున్నారు. 8 నుంచి 10 గంటల వరకు బస్సుల్లోనే ఉంటూ విధులు నిర్వహించే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పడే అవస్థలు ఇక చెప్పనక్కర లేదు. డ్రైవర్‌ గంటల తరబడి ఇంజిన్‌ వద్ద కూర్చొని వాహనాన్ని తోలడం, భారీగా ఉంటున్న ప్రయాణికుల మధ్యలో తిరుగుతూ కండక్టర్‌ పనిచేయటం చాలా కష్టం. వేసవిలో వారి పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ కథనం.

ఇంజిన్‌ వేడితో అవస్థలు.. : ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంటోంది. వేసవితాపం భరిస్తూ ఆర్టీసీ ఉద్యోగులు తమ విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఆర్టీసీ యాజమాన్యం డిపోల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు మజ్జిగ పంపిణీ చేస్తోంది. సిబ్బంది బస్టాండ్లలోని సత్యసాయి ట్రస్టు చలివేంద్రాల్లో తాగునీటిని తమ సీసాలు నింపుకొని వెళ్తున్నారు. తలకు టోపీ, టవళ్లు ఉండేలా చూసుకుంటున్నారు. ఇంజిన్‌ వేడిని మాత్రం భరించక తప్పడం లేదు. డ్రైవర్లకు కూలింగ్‌ ఫ్యాన్లు ఏర్పాటు చేస్తే ఇంజిన్‌ వేడి, వడగాలుల నుంచి రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుంది.

సిబ్బందికి వైద్యపరీక్షలు : ఆర్టీసీ యాజమాన్యం 2022లో అన్ని స్థాయిల కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు 11 రకాల వైద్యపరమైన పరీక్షలు చేయించింది. గురువారం నుంచి రెండో విడత వైద్య పరీక్షలు ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ డిపోలో ఆర్టీసీ వైద్యుడి పర్యవేక్షణలో పరీక్షలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎత్తు, బరువు, బాడీ మాస్‌ ఇండెక్స్‌(బీఎంఐ), బీపీ, కళ్లు, హిమోగ్లోబిన్‌, సిరమ్‌ క్రియాటీన్‌, ఆర్బీఎస్‌, టోటల్‌ కొలస్ట్రాల్‌, ఈసీజీ తదితర పరీక్షలు చేస్తున్నారు. వీటిలో ఏవైనా తేడాలుంటే వెంటనే హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఆస్పత్రికి లేదా కార్పొరేట్‌ ఆస్పత్రులకు పంపించి చికిత్సలు అందిస్తున్నారు. చిన్న సమస్యలైతే ఇక్కడే మందులు ఇస్తున్నారు.


మజ్జిగతో కాస్త ఉపశమనం : మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రయాణికులను ఎక్కించుకోవడం, దింపడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఎండతో చాలా చెమట వస్తోంది. గ్లూకోజ్‌ లెవల్‌ పడిపోకుండా పానీయాలు, నీరు ఎక్కువగా తాగుతున్నా. డిపోల్లో మధ్యాహ్నం మజ్జిగ ఇవ్వటం కొంత ఉపశమనం కలిగిస్తోంది.

వెంకటయ్య, డ్రైవర్‌


వడగాలులతో ఇబ్బందులు.. : ఎండ చాలా ఎక్కువగా ఉంటోంది. గంటల తరబడి డ్రైవింగ్‌ సీట్లో కూర్చొని బస్సు నడపటం వల్ల చెమట చాలా వస్తోంది. దగ్గర తాగునీరు ఉంచుకుని తరచూ తాగుతున్నా. వడగాలులు ఎక్కువగా ఉన్నప్పుడు వడదెబ్బకు గురవుతాం. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా.

 నర్సింహులు గౌడ్‌, డ్రైవర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని