logo

ఎన్నికల అధికారులకు కరదీపికలు

ఎన్నికల ప్రక్రియలో పోలింగ్‌ విధులు నిర్వహించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్‌సభ నియోజకవర్గాలుండగా మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ) లోక్‌సభ నియోజకవర్గాలకు నామపత్రాల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది.

Published : 20 Apr 2024 04:20 IST

విధుల నిర్వహణపై సూచనలతో పుస్తకాల పంపిణీ

ఎన్నికల శిక్షణలో పాల్గొన్న ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు

అచ్చంపేట, న్యూస్‌టుడే : ఎన్నికల ప్రక్రియలో పోలింగ్‌ విధులు నిర్వహించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్‌సభ నియోజకవర్గాలుండగా మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ) లోక్‌సభ నియోజకవర్గాలకు నామపత్రాల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది.నామపత్రాల స్వీకరణ నుంచి ఫలితాలు వెల్లడి చేసే వరకు అధికారులు, పోలింగ్‌ సిబ్బంది బాధ్యత, సమన్వయంతో విధులు నిర్వహించినప్పుడే ఎన్నికల ప్రక్రియ విజయవంతమవుతుంది. విధి నిర్వహణలో చిన్న పొరపాట్లు కూడా ఎన్నికల నిర్వహణపై ఎంతో ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నందున కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సూచనలతో కరదీపికలను రూపొందించింది. ఎన్నికల అధికారులు, సిబ్బందికి పోలింగ్‌ నిర్వహణపై మూడు విడతల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండగా ఇప్పటికే మొదటి దశ పూర్తయింది. ఎన్నికల నియమావళి, ఈవీఎంల వాడకంపై అధికారులు శిక్షణలో వివరిస్తున్నారు.

ప్రత్యేక శిక్షణ.. : ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్‌ అధికారి (పీవో), సహాయ ప్రిసైడింగ్‌ అధికారి (ఏపీవో), ఇతర పోలింగ్‌ అధికారులు (వోపీవో) తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియపై మొదటి విడత శిక్షణ పూర్తి చేశారు. పోలింగ్‌ ముందు రోజు, పోలింగ్‌ రోజు నిర్వహించే బాధ్యతలపై శిక్షణ ఇచ్చారు. పోలింగ్‌ ముందు రోజు ఎన్నికల సామగ్రి తీసుకోవడం నుంచి మొదలు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న తరువాత అక్కడ చేసుకోవాల్సిన ఏర్పాట్లు, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వడం, మాక్‌ పోలింగ్‌కు సకాలంలో హాజరయ్యేలా సూచనలు చేయాల్సి ఉంటుంది. పోలింగ్‌ రోజు ముందుగా ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించి ఈవీఎంల పనితీరుపై ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తరువాత ఈవీఎంలతో పాటు పోలింగ్‌ సామగ్రిని అధికారులకు అందించే వరకు సిబ్బంది సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించడంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

చేయాల్సినవి.. చేయకూడనివి : ఎన్నికల విధుల్లో క్రియాశీలకంగా పనిచేసే ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు మూడు విడతల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే మొదటి విడత శిక్షణ పూర్తి కాగా మరో రెండు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నికల నియమావళిపై అధికారులకు కరదీపికలు అందజేశారు. అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నా అక్కడక్కడ పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈసారి ఎన్నికల విధుల్లో చేయవలసినివి, చేయకూడనివి పేరుతో ప్రత్యేక పుస్తకాలు అందజేశారు. ఈ కరదీపికల్లో ప్రధానంగా పంపిణీ కేంద్రం, పోలింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాట్లు, మాక్‌ పోలింగ్‌, తరువాత పోలింగ్‌ ప్రారంభం, ముగింపు, బ్యాలెట్‌ యూనిట్‌, వీవీప్యాట్‌, కంట్రోల్‌ యూనిట్‌ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీల్‌ చేసే విధానం తదితర అంశాలపై పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించడంపై పుస్తకాలు తయారు చేశారు. ఈ కరదీపికలను ఇప్పటికే పీవో, ఏపీవోలకు అందజేశారు.

అనుమానాల నివృత్తికి చెక్‌లిస్ట్‌..

ఎన్నికల విధుల్లో ఎలాంటి సమస్యలు ఎదరు కాకుండా ఉండేందుకు చెక్‌ లిస్ట్‌ పేరుతో మరో పుస్తకాన్ని అందజేశారు. పీవో, ఏపీవోలకు పోలింగ్‌ నిర్వహణ సమయంలో ఏదైనా చిన్న సందేహం వచ్చినా గతంలో కరదీపికలోనే వివరాలు ఉండటంతో పుస్తకం మొత్తం తిరగేయడానికి ఎంతో ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం చెక్‌లిస్ట్‌ పుస్తకాన్ని విడిగా తక్కువ సమాచారంతో ఇవ్వడంతో సులభంగా అనుమానాలను నివృత్తి చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. చెక్‌లిస్ట్‌ పుస్తకంలో వివిధ అంశాలు, వాటికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి అవసరమైన పేజీని తెరచి చదువుకోవచ్చు. దీంతో తక్కువ సమయంలో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ పుస్తకంలో ప్రధానంగా ప్రిసైడింగ్‌ అధికారుల విధులు, పోలింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాట్లు, మాక్‌ పోలింగ్‌, ఏజెంట్ల నియామకం, ఈవీఎంల నిర్వహణ, అవి మొరాయించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలింగ్‌ సమయంలో పాటించాల్సిన సూచనలు, పోలింగ్‌ ముగింపు, నమోదైన ఓట్లు, సీల్‌ చేయడం తదితర అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని