logo

గుట్టుగా మట్టి తరలింపు

జిల్లాలో అనుమతులు లేకుండానే పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలలో అక్రమాలు మాత్రం దండిగా కనిపిస్తున్నాయి. బట్టీల ఏర్పాటు నుంచి ఇటుక తరలింపు వరకు వివిధ స్థాయిల్లో సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.

Published : 19 May 2024 06:08 IST

జిల్లాలో అనుమతుల్లేని ఇటుకబట్టీలు
ఉల్లంఘనలు పట్టని అధికారులు

మరికల్‌ శివారులోని ఇటుక బట్టి వద్ద నిల్వ చేసిన ఒండ్రుమట్టి

న్యూస్‌టుడే, మరికల్‌(ధన్వాడ): జిల్లాలో అనుమతులు లేకుండానే పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలలో అక్రమాలు మాత్రం దండిగా కనిపిస్తున్నాయి. బట్టీల ఏర్పాటు నుంచి ఇటుక తరలింపు వరకు వివిధ స్థాయిల్లో సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. ఎన్నికల తరువాత ఒండ్రుమట్టి తవ్వకాలు విపరీతమయ్యాయి.

నిబంధనలు ఇవీ.. : జిల్లాలో ప్రతి మండల కేంద్రంతో పాటు పెద్ద గ్రామాల్లో ఇటుక బట్టీల్ని ఏర్పాటు చేస్తున్నారు. రాకొండ నుంచి కృష్ణా మండలం టై రోడ్డు వరకు ఇటుక బట్టీలు కొకొల్లలుగా కనిపిస్తున్నాయి. వీటి ఏర్పాటుకు ముందుగా పంచాయతీ అనుమతి పొందాలి. గనులు, రెవెన్యూ, పరిశ్రమలు, కార్మిక, విద్యుత్తు, రవాణాశాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి. వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేస్తే నాలా పన్ను చెల్లించి ధ్రువీకరణ పత్రం పొందాలి. బట్టీని గ్రామానికి అయిదు కిలోమీటర్ల దూరాన ఏర్పాటు చేయాలి. ఈ  అనుమతులేవి తీసుకోకుండానే ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత విద్యుత్తు సౌకర్యాన్ని బట్టీల కోసం వాడుకోరాదు. పట్టా భూముల్లో బోర్లను బట్టీల నీటి అవసరాలకు ఉపయోగించకూడదు.

ఉల్లంఘనలు ఇలా.. : జిల్లాలో నిబంధనలు పాటించుకుండానే ఇబ్బడి ముబ్బడిగా ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. దాదాపు 60 వరకు బట్టీలు ఉంటే అనుమతి పొందినవి పదిలోపే ఉన్నాయి. పంచాయతీ అనుమతులు తీసుకోవడంలేదు. గ్రామాలకు కూత వేటు దూరంలోనే ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అదనంగా ప్రస్తుతం కుంటలు, చెరువుల్లో ఒండ్రు మట్టిని తరలిస్తూ ఇటుకల తయారీ కోసం నిల్వ చేసుకుంటున్నారు. చాలా బట్టీల వద్ద ఒండ్రు మట్టి నిల్వలు భారీ స్థాయిలో కనిపిస్తున్నాయి.మక్తల్‌ నుంచి కృష్ణా వరకు, మరికల్‌ శివారులోని ఆత్మకూర్‌ దారిలో ఉన్న బట్టీల వద్ద ఒండ్రు మట్టి నిల్వలు భారీ స్థాయిలో ఉన్నాయి. మరి కొందరు గుట్టల నుంచి ఎర్రమట్టిని గుట్టుగా తరలిస్తున్నారు. తమ లాభాల కోసం సహజ వనరులను దారి మళ్లించి కొల్లగొడుతున్నా ఎలాంటి చర్యలు ఉండటం లేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని