logo

పారిశుద్ధ్య చర్యలేవీ?

జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రెండు రోజులుగా చిన్నపాటి ముసురు వర్షాలు పడుతున్నాయి. జూన్‌ మొదటి వారంలో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా..

Published : 19 May 2024 06:12 IST

వ్యాధుల నివారణకు ముందస్తు కార్యాచరణ అవసరం 

నాగర్‌కర్నూల్‌ రాంనగర్‌ కాలనీలోని కాల్వలో కదలని మురుగు

కందనూలు, న్యూస్‌టుడే : జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రెండు రోజులుగా చిన్నపాటి ముసురు వర్షాలు పడుతున్నాయి. జూన్‌ మొదటి వారంలో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. జిల్లాలోని పురపాలక శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం లేదు. ఏటా ఆలస్యంగా పారిశుద్ధ్య పనులు ప్రారంభించడం వలన దోమల బెడద పెరిగి ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా పురపాలక సంఘాల కమిషనర్లు, పారిశుద్ధ్య నిర్వహణ అధికారులు, ఇతర సిబ్బంది లోక్‌సభ ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. సోమవారం ఎన్నికల పోలింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో పట్టణాల్లో సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. 

మురుగుతో అవస్థలు.. : జిల్లాలోని కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట పురపాలక సంఘాలుగా కొనసాగుతున్నాయి. మొత్తం 86 వార్డులున్నాయి. పట్టణాల్లోని ప్రధాన వార్డుల్లో అధికారులు మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టినా శివారు కాలనీల్లో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో ఇళ్ల సమీపంలోని ఖాళీ స్థలాల్లో మురుగు నిల్వగా మారుతోంది. నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని స్నేహపురి కాలనీలో, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నాలాలు ఉన్నాయి. పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది ఇప్పటి వరకు నాలాలను శుభ్రం చేయడం లేదు. అచ్చంపేట పట్టణంలోని బస్టాండ్‌ వద్ద, వలపట్ల, మారుతీనగర్‌లోని మురుగుకాల్వలు శుభ్రం చేయకపోవడం వలన పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. కల్వకుర్తి పట్టణంలో రాజానగర్, కల్యాణ్‌నగర్‌ కాలనీలోని మురుగు కాల్వల చుట్టూ వివిధ రకాల పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడం వలన ఏటా వర్షాకాలంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొల్లాపూర్‌ పట్టణంలోని పలు వార్డులో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. ఏటా వర్షాకాలంలో ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లాలోని పురపాలక అధికారులు స్పందించి ముందస్తు నాలాలు, మురుగుకాల్వలు శుభ్రం చేసి దోమలను నివారించడానికి రసాయనాలతో పిచికారీ చేయాలని కాలనీవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. 

ప్రణాళికలు సిద్ధం చేశాం.. : వర్షాకాలానికి సంబంధించి పట్టణంలో ముందస్తుగా పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. కొన్ని రోజులుగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండటం వలన పనులు చేపట్టలేదు. శనివారం పారిశుద్ధ్య సిబ్బందితో సమావేశం నిర్వహించి మురుగు కాల్వలు శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేశాం. 

శ్యాంసుందర్, పురపాలక సంఘం కమిషనర్, అచ్చంపేట 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు