logo

రోడ్లకు మహర్దశ ఎప్పుడో..?

గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మట్టి, కంకర తేలిన రోడ్లపై ప్రయాణాలు చేయలేక ప్రజలు నరకయాతన పడుతున్నారు.

Published : 19 May 2024 06:16 IST

బోయలగూడెం నుంచి సింధనూరు రహదారి 

అయిజ, న్యూస్‌టుడే : గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మట్టి, కంకర తేలిన రోడ్లపై ప్రయాణాలు చేయలేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. నడిగడ్డలోని గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లో రోడ్లకు మహర్దశ ఎప్పుడు వస్తుందా అని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్న అవస్థలు తప్పడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు అంతర్రాష్ట్ర రహదానిని అభివృద్ధి చేస్తామని చెప్పడం వరకే పరిమితమవుతున్నాయి తప్ప అడుగులు పడటం లేదు. అలంపూర్‌లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు సైతం రద్దు చేసింది. 

జిల్లాలో ఇలా.. 

ఇటిక్యాల : ఇటిక్యాల నుంచి చాగాపురం, ఎర్రవల్లి నుంచి శేకుపల్లి, శాసనూలు మీదుగా గార్లపాడు వరకు, వేముల నుంచి బట్లదిన్నె, ఉదండాపురం నుంచి ఎల్కూరు, వావిలాల రహదారులు అధ్వానంగా ఉన్నాయి. వేముల నుంచి బట్లదిన్నె వరకు ఉన్న రహదారి కంకరతేలింది. ప్రైవేటు వాహనదారులు ఈమార్గాల్లో నడిపితే తమకు వచ్చే ఆదాయం కన్నా వాటి మరమ్మతుల ఖర్చులే ఎక్కువ అవుతున్నాయని ఆటోలు, జీపులు కూడా సక్రమంగా నడవడం లేదు. 

మానవపాడు : మావనపాడు నుంచి చిన్నపోతుల మీదుగా పెద్దపోతుల పాడు వరకు, జాతీయ రహదారి నుంచి జల్లాపురం, అమరవాయి నుంచి నారాయణపురం గ్రామాల రహదారులు గుంతలు పడి ప్రయాణానికి వీల్లేని విధంగా మారాయి.  

అలంపూర్‌ : బూడిదపాడు నుంచి లింగనవాయి, ఉండవెల్లి నుంచి తక్కశిల రహదారులు సక్రమంగా లేవు. కొంత కాలంగా ఈగ్రామాలకు బస్సు సర్వీసులు లేవు. 

ఉండవెల్లి : జాతీయ రహదారి నుంచి చిన్నఆముదాలపాడు, ఎ.బూడిదపాడు నుంచి మారమునగాల, పుల్లూరు నుంచి మెన్నిపాడు, బైరాపురం, బస్వాపురం రహదారులు అధ్వానంగా ఉన్నాయి. పుల్లూరు నుంచి మెన్నిపాడు రహదారి కంకర తేలింది.

దుమ్ములేస్తున్న అయిజ-ఎమ్మిగనూరు రహదారి  

రాజోలి : తుమ్మిళ్ల, మాన్‌దొడ్డి, పెద్దతాండ్రపాడు, తనగల, శాంతినగర్, పెద్దధాన్వడ రహదారులు గుంతలు పడి, కంకర తేలాయి. 

గద్వాల : గద్వాల నుంచి శెట్టిఆత్మకూరు, కొండపల్లి, రేపల్లి రహదారులు గుంతలమయంగా మారాయి. గద్వాల నుంచి శెట్టిఆత్మకూరుకు అడుగడుగునా గుంతలే దర్శనమిస్తున్నాయి. 

మల్దకల్‌ : మద్దెలబండ, ఎల్కూరు, ఉదండాపురం, పావనంపల్లి, పెద్దపల్లి, గార్లపాడు గ్రామాల రహదారులు గుంతలు పడి దారుణంగా ఉన్నాయి. కేటీదొడ్డి మండలం మల్లాపురం తాండ, మైలగడ్డ గ్రామాల రహదారి అధ్వానంగా ఉంది. 

గట్టు : మిట్టదొడ్డి నుంచి బల్గెర వరకు అంతర్రాష్ట్ర రహదారి అడుగడుగునా గుంతలే కన్పిస్తున్నాయి. అంతంపల్లి, బోయలగూడెం, ఇందువాసి, రాయాపురం రహదారులు అధ్వానంగా ఉన్నాయి.

అయిజ : ఎమ్మిగనూరు, సింధనూరు, ఎక్లాస్‌పూర్, ఉప్పల, ఉప్పల క్యాంపు, రాజాపూర్, బైనపల్లి, కొత్తపల్లి గ్రామాల రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఎమ్మిగనూరు రహదారి ఆరేళ్లుగా అభివృద్ధి పేరుతో మరమ్మతులు చేస్తూనే ఉన్నారు. అయిజ నుంచి మేడికొండ వరకు బీటీని తీసేసి రోడ్డునిండా కంకర పరచి వదిలేశారు. ఉప్పల, ఎక్లాస్‌పూర్‌కు ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు. 

అభివృద్ధికి ప్రయత్నిస్తాం:  రహదారుల మరమ్మతులు చేసి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. కొన్ని రహదారులను అభివృద్ధి పనుల పేరుతో కంకర వేసి వదిలేసిన వాటిని త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. స్తంభించిన పనులను సైతం పూర్తి చేయిస్తాం. 

కిరణ్, ఆర్‌అండ్‌బీ డీటీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని