logo

చినుకు పడాలి.. చింత తీరాలి!

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు పరిస్థితిని గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. సగటున 608.88 మి.మీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 520.7 మి.మీ వర్షపాతమే నమోదయ్యింది.

Published : 19 May 2024 06:50 IST

ఈ నెలాఖరుకు నైరుతి రుతుపవనాలు
వానాకాలం సీజన్‌పై రైతన్న ఆశలు

ఈనాడు, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు పరిస్థితిని గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. సగటున 608.88 మి.మీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 520.7 మి.మీ వర్షపాతమే నమోదయ్యింది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పాలమూరు వాసులు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో రైతులు వర్షాల కోసం నిరీక్షిస్తున్నారు.  యాసంగిలో చాలా మంది పంటలు వేసిన నీటి లభ్యత లేక సాగును మధ్యలోనే వదులుకున్నారు. జలాశయాల్లో నీటిమట్టం పడిపోతుండటం, చెరువులు ఎండిపోవడంతో పంటలు చేతికి రాకుండాపోయాయి. మరోవైపు భూగర్భ జలాలు సైతం పడిపోయాయి. ఈ ఏడాదైనా నైరుతి రుతుపవనాలు తమకు కలిసి రావాలని కోరుకుంటున్నారు. ఈ నెల 31న కేరళ తీరాన్ని ఈ పవనాలు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ సారైనా ఆశించిన స్థాయిలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని కర్షకులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. గత వానాకాలంలో మహబూబ్‌నగర్‌లో 3.26 లక్షలు, నారాయణపేట-4.26 లక్షలు, నాగర్‌కర్నూల్‌-4.46లక్షలు, వనపర్తి-2.23 లక్షలు, జోగులాంబ గద్వాల-2.69 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈసారి కూడా దీనికి కొంచెం అటూఇటూగా పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. 

గత ఏడాది నుంచి..

జోగులాంబ గద్వాల జిల్లాలో గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు సగటున సాధారణం కంటే లోటు వర్షపాతమే ఎక్కువ నమోదైంది. జిల్లాలో గట్టు, అయిజ, వడ్డేపల్లి మండలాల్లో మినహా మిగతా అన్ని మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. వనపర్తి జిల్లాలో పాన్‌గల్, ఆత్మకూర్, వీపనగండ్ల, చిన్నంబావిలో లోటు వర్షపాతం నమోదవగా మిగతా మండలాల్లో సాధారణ స్థాయిలో మాత్రమే వర్షాలు పడ్డాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ, వంగూరు, కోడేరు, కొల్లాపూర్‌ మినహా జిల్లాలో అన్ని మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోనే అత్యధిక వర్షపాతం నమోదు కాగా మరికల్‌లో లోటు వర్షపాతం పడింది. మిగతా చోట్ల సాధారణ వర్షాలే పడ్డాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా మహ్మదాబాద్‌లో అత్యధికంగా వర్షాలు పడ్డాయి. మహబూబ్‌నగర్‌ అర్బన్, రాజాపూర్, జడ్చర్ల, మిడ్డిల్‌ మండలాల్లో తక్కువగా వానాలు కురిశాయి.


అప్రమత్తత అవసరమే..

నైరుతి రుతుపవనాలు మరో 15 రోజుల్లో ఈ ప్రాంతాన్ని తాకే అవకాశాలుండటంతో వివిధ శాఖల అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. భారీ వర్షాలు పడితే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. పురపాలికల్లోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. గతంలో ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు పడితే పట్టణాల్లో పలు కాలనీలు నీట మునిగి ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పుర అధికారులు లోతట్టు ప్రాంతాల పరిస్థితిపై ఓ అంచనాకు రావాల్సి ఉంటుంది. రుతుపవనాలు త్వరగా వస్తే రైతులు కూడా హడావుడి పడతారు. ఈ సమయంలోనే రైతులకు వ్యవసాయ శాఖ సాగుపై సూచనలు, సలహాలు ఇవ్వాలి. గ్రామాల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వానాకాలం సాగుకు సన్నద్ధం చేయాలి. ఒక్కోసారి నైరుతి రుతుపవనాలు రెండు, మూడు రోజులు ఊరించి తర్వాత ముఖం చాటేస్తాయి. ఈ నేపథ్యంలో రైతుల ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా వివరించాలి. సాగునీటి పారుదలశాఖ అధికారులు కూడా ఉమ్మడి జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పరిధిలోని మోటార్‌ పంపులకు డ్రై రన్‌ చేపట్టాలి. వర్షాలతో జలాశయాలకు నీళ్లు వచ్చి చేరితే మోటారు పంపుల ద్వారా తోడి కాలువ నుంచి నీటిని తరలించాల్సి ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని