logo

యువకుడి హత్య కేసులో 8 మందికి రిమాండ్‌

మహబూబ్‌నగర్‌ పట్టణం బండమీదిపల్లిలోని మద్యం దుకాణం వద్ద గత నెలలో దాడి చేయగా యువకుడు మరణించిన కేసులో నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మహబూబ్‌నగర్‌ గ్రామీణ ఠాణా సీఐ గాంధీనాయక్‌ కథనం ప్రకారం.

Published : 19 May 2024 06:27 IST

పరారీలో మరో ఇద్దరు నిందితులు

వివరాలను వెల్లడిస్తున్న సీఐ గాంధీనాయక్, ఎస్సై విజయ్‌కుమార్‌

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌ పట్టణం బండమీదిపల్లిలోని మద్యం దుకాణం వద్ద గత నెలలో దాడి చేయగా యువకుడు మరణించిన కేసులో నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మహబూబ్‌నగర్‌ గ్రామీణ ఠాణా సీఐ గాంధీనాయక్‌ కథనం ప్రకారం.. అడ్డాకుల మండలం బలీదుపల్లికి చెందిన శ్రీకాంత్‌(25) గత నెల 25న మహబూబ్‌నగర్‌ మండలం అల్లీపూర్‌ గ్రామంలో బంధువుల గృహప్రవేశానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా సమీప బండమీదిపల్లిలోని మల్లికార్జున మద్యం దుకాణం వద్దకు వచ్చి బీరు కావాలని కౌంటర్‌లో కూర్చున్న రవికుమార్‌రెడ్డిని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత శ్రీకాంత్‌ అల్లీపూర్‌కు వెళ్లి వాగ్వాదం జరిగిన విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకుందామని వారంతా మద్యం దుకాణం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాల గొడవ చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. శ్రీకాంత్‌పై వైన్స్‌ నిర్వాహకులు, వారి స్నేహితులు, సిబ్బంది మూకుమ్మడిగా కట్టె, చీపురు, చేతులు, కాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. జనం భారీగా పోగు కావటంతో శ్రీకాంత్‌ను వదిలేశారు. శ్రీకాంత్‌కు కడుపులో, ఇతర భాగాల్లో మూగ దెబ్బలు తగిలినా కుటుంబ సభ్యులు, పోలీసులకు చెప్పలేదు. నాలుగైదు రోజుల తర్వాత అతడికి కడుపునొప్పి రావటంతో పాటు విరేచనాలు, వాంతులు కాగా కుటుంబ సభ్యులు కొత్తకోటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్‌ ఆసుపత్రికి, తర్వాత హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నెల 14న చికిత్స పొందుతూ శ్రీకాంత్‌ మృతిచెందాడు. మద్యం దుకాణ నిర్వాహకులు చేసిన దాడి వల్లే తన కుమారుడు మృతిచెందాడని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్‌ తల్లి వెంకటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా 10 మంది నిందితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శ్రీకాంత్‌పై దాడి చేసిన వారిలో చింతలపల్లి రవికుమార్‌రెడ్డి, కోట్ల అరుణ్‌కుమార్‌రెడ్డి, దిర్శనం రాకేశ్, కోట్ల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కోట్ల కృష్ణారెడ్డి, పికిలి వెంకటేశ్, జర్పాటి చెన్నమ్మ, గజగోని చంద్రప్రకాశ్‌ గౌడ్‌ శనివారం పోలీసులకు లొంగిపోగా రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న శివశంకర్, రఘుపతిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు పరిశీలించటంతో పాటు పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చేలా విచారణ చేయటం వల్లనే ఆలస్యమైందని, ఈ కేసుపైసామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై విజయ్‌కుమార్, పోలీసులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు