logo

లోతట్టు ప్రాంతాలపై శీతకన్ను

వర్షాకాలంలో జిల్లాలోని వివిధ పురపాలికలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రతి ఏటా ఇబ్బందులు తప్పడం లేదు.

Updated : 25 May 2024 06:28 IST

అయిజలో ప్రధాన రహదారిపై నిలిచిన వర్షపు నీరు

అయిజ, న్యూస్‌టుడే : వర్షాకాలంలో జిల్లాలోని వివిధ పురపాలికలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రతి ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. ఈఏడాది వేసవికాలం ముగియక ముందే వర్షాలు ప్రారంభమయ్యాయి. చిన్నపాటి వర్షాలకే కాలనీలు జలమయమవుతున్నాయి. పురపాలకవర్గాలు, అధికారులు ప్రణాళిక ప్రకారంగా లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించకపోవడంతో పట్టణ వాసులకు శాపంలా మారుతున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు తాత్కాలిక పనులు చేపట్టడం ఆ తర్వాత విస్మరించడం పరిపాటిగా మారింది. హామీలు ఎన్నికల వరకే పరిమితమవుతున్నాయి తప్ప శాశ్వత పరిష్కారం చూపడంలో శ్రద్ధ పెట్టడం లేదని చెప్పడానికి కాలనీల్లో నెలకొంటున్న పరిస్థితులే అద్దం పడుతున్నాయి. ఈఏడాది భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలున్నాయి. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

లోపించిన సమన్వయం : చర్యలు చేపట్టడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్తే సమస్య చాలా వరకు పరిష్కారం కానుంది. జిల్లాలోని నాలుగు పట్టణాల్లో కలిపి సుమారు 1.80 లక్షల మంది నివసిస్తున్నారు. ఎక్కువగా గద్వాల, తక్కువగా అలంపూర్‌ పట్టణాల్లో పట్టణ జనాభా ఉంది. అయిజ, గద్వాల పెద్ద పట్టణాల్లో సమస్య తీవ్రంగా ఉంది. శివారు కాలనీలు ఎక్కువగా వెలిశాయి. కొత్త కాలనీల్లో సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టలేదు. 

సమస్యలిక్కడే..

 అయిజ పట్టణంలో 20 వార్డులు, సుమారు 30 వేల జనాభా ఉంది. పట్టణంలోని దుర్గానగర్, మారుతీనగర్, నరసింహకాలనీ, పద్మావతికాలనీ, బూరందొడ్డి కాలనీ, పాత, కొత్త ఎస్సీ కాలనీలు, రాఘవేంద్ర కాలనీ, దేవనగర్, కమతంపేట, వాగుగడ్డ కాలనీ, పెద్దబోయపేట తదితర కాలనీలు లోతట్టు కాలనీలుగా గుర్తించారు. దుర్గానగర్, మారుతీనగర్‌ కాలనీలు గద్వాల రహదారికి ఆనుకొని ఉన్నాయి. కాలనీల కన్నా గద్వాల రహదారి ఎత్తుగా ఉండటంతో కాలనీల్లో నుంచి నీరు ముందుకెళ్లే పరిస్థితిలేదు. దీనికి తోడు భారీ మురుగు కాలువ కూడా కాలనీల కన్నా ఎత్తుగా ఉంది. దీంతో ఏటా అక్కడ సమస్య తలెత్తుతోంది. బూరందొడ్డి కాలనీ, పద్మావతికాలనీ, రాఘవేంద్ర కాలనీ, దేవనగర్‌ కాలనీల్లో సీసీ రహదారులు, మురుగు కాలువలు ఏర్పాటు చేయలేదు. నడిం మసీదు, వల్లూరిపేట, పెద్దబోయపేట కాలనీల్లో చిన్నపాటి వర్షానికే నీరు ఇళ్లల్లోకి చేరుతోంది. ఇక్కడ మురుగు కాలువల కన్నా ఇళ్లు లోతుగా ఉన్నాయి.

  • గద్వాల పట్టణంలో 37 వార్డుల పరిధిలో సుమారు 80 వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. సుంకులమ్మ మెట్ట, నల్లకుంట, బీసీ కాలనీ, గంజిపేట, ఒంటెల పేట, బుదరపేట, తూర్పు దౌదర్‌పల్లి కాలనీల్లో ఏటా వర్షాకాలం ఇబ్బందులు తప్పడంలేదు. జనాభాకు అనుగుణంగా మురుగు కాలువలు ఆధునికీకరించలేదు. 
  • వడ్డేపల్లి పురపాలిక పరిధిలో 10 వార్డులు, సుమారు 15 వేల జనాభా ఉంది. శాంతినగర్‌లోని జమ్ములమడుగు, రాజోలి రహదారి కాలనీ, రామాపురం రోడ్డు, బీసీ కాలనీ, సునీతమ్మ కాలనీ, వడ్డేపల్లి రహదారి కాలనీల్లో నీటి నిల్వ అధికంగా ఉంటోంది. శాంతినగర్‌లోని ప్రధాన రహదారికి ఇరువైపులా వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 
  • అలంపూర్‌ పట్టణంలో 10 వార్డులు, సుమారు 15వేల జనాభా ఉంది. పట్టణంలోని మొత్తం కాలనీలకు భూగర్భ మురుగు కాలువకు అనుసంధానం చేయలేదు. నందులమఠం కాలనీ, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, బీసీ కాలనీల్లో వర్షపు నీరు నిలుస్తోంది.

    చర్యలు చేపడతాం

అయిజ పట్టణంలోని సమస్యాత్మక కాలనీల్లో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు చేపడతాం. ఇప్పటికే కొన్ని కాలనీల్లో తాత్కాలికంగా పనులు చేశాం. మడ్డిగుంత కాలనీ నుంచి వాల్మీకి ఆలయం వరకు నీరు ముందుకెళ్లే విధంగా పనులు పూర్తి చేస్తాం. ప్రాధాన్యతాక్రమంలో సమస్యను పరిష్కరిస్తాం.
సత్యబాబు, అయిజ, పుర కమిషనర్‌.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు