logo

పంట రుణాలపై సీఐడీ విచారణ

రైతులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అచ్చంపేట బ్రాంచి నుంచి 2017-2019 మధ్య కాలంలో తీసుకున్న పంట రుణాలపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు

Published : 25 May 2024 05:33 IST

రూ.10 కోట్ల మేర అక్రమాలు

వంకేశ్వరంలో రైతును విచారిస్తున్న సీఐడి ఇన్‌స్పెక్టర్‌ 

అమ్రాబాద్, న్యూస్‌టుడే : రైతులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అచ్చంపేట బ్రాంచి నుంచి 2017-2019 మధ్య కాలంలో తీసుకున్న పంట రుణాలపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు లక్ష్మణ్, సైదులు రెండు బృందాలుగా పదర మండలంలోని వివిధ గ్రామాల్లో రెండు రోజులుగా సర్వే నిర్వహిస్తున్నారు. శుక్రవారం మండలంలోని వంకేశ్వరంలో లక్ష్మణ్‌ ఆధ్వర్యంలోని బృందం, సైదులు ఆధ్వర్యంలోని బృందం ఇప్పలపల్లిలో రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సీఐడీ-సీఐ లక్ష్మణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 1,827 మంది రైతులు డీసీసీబీ నుంచి పంట రుణాలు తీసుకున్నారు. ఖాతాలను మదింపు (ఆడిట్‌) చేసే క్రమంలో చెల్లింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు జిల్లా సహకారాధికారి పత్యానాయక్‌కు అనుమానం వచ్చింది. విచారణ కోసం అచ్చంపేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసును పరిశీలించిన అధికారులు అక్రమాలు సుమారు రూ.10 కోట్లకు పైగా ఉండటంతో కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఈ మేరకు అధికారులు గ్రామాల్లో ఖాతాల వారీగా రైతులను కలిసి వివరాలు సేకరిస్తున్నారు. జాబితాలను పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. డీసీసీబీ నుంచి పంట రుణం తీసుకున్నది లేనిది, తీసుకుంటే ఎంత తీసుకున్నారు. తదితర వివరాలను నమోదు చేసుకుంటున్నారు. రైతుల నుంచి సేకరించిన వివరాలను బ్యాంకులోని వివరాలతో పోల్చిచూడనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఉన్న 1,827 మంది రైతులను కలిసి వివరాలు సేకరిస్తామని తెలిపారు. విచారణానంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. 

వంకేశ్వరం పంచాయతీ కార్యాలయంలో పంట రుణాలు తీసుకున్న వారి జాబితాను పరిశీలిస్తున్న రైతులు  

రైతులు సహకరించాలి.. : డీసీసీబీలో జరిగిన అక్రమాలపై విచారణ నిమిత్తం వచ్చే అధికారులకు రైతులు సహకరించాలని సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌ కోరారు. దళారుల మాయమాటలకు తలొగ్గి కొందరు రైతులు వివరాలను సక్రమంగా వెల్లడించటం లేదని తెలిపారు. సరైన వివరాలు అందించని పక్షంలో రైతులే నష్టపోతారని చెప్పారు. వివరాలు సేకరించేందుకు వచ్చే అధికారుల గురించి ఎలాంటి భయాలు అవసరం లేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని