logo

అవగాహన.. అప్రమత్తత

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయానికి సిద్ధమయ్యేలా వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది

Updated : 25 May 2024 06:28 IST

నేటి నుంచి రైతు సదస్సులు

దుక్కి దున్నుతున్న మహిళా రైతు 

కొత్తకోట, న్యూస్‌టుడే : ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయానికి సిద్ధమయ్యేలా వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. నేల స్వభావం ఆధారంగా అన్నదాతలను సాగుకు సమాయత్తం చేసే దిశగా కదలాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు వీడియో కాన్ఫరెన్సులో వ్యవసాయ అధికారులను సూచించారు. నకిలీ విత్తనాలతో నష్టపోకుండా అప్రమత్తం చేస్తూ వెంటనే వారికి అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా గ్రామాల వారీగా ఉదయం 7.30 నుంచి 11.30 వరకు నిర్వహించే సదస్సుల్లో ఎక్కువ మంది రైతులు పాల్గొనేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. జూన్‌ 4వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ ఉన్నందున ప్రజా ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించకుండా కార్యక్రమాలు కొనసాగించాలని 5వ తేదీ నుంచి వారిని భాగస్వాములను చేయవచ్చని సూచించింది.

భరోసా కల్పించేలా..: జూన్‌ రెండో వారంలోగా వర్షాలు కురిసి రైతులు తీరిక లేకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయని వెంటనే వారిని సాగుకు సంసిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచనలతో వ్యవసాయ శాఖ అధికారులు ఆమేరకు ప్రణాళికలు రూపొందించారు. పత్తి విత్తనాలు, ఇతర వ్యాపార పంటల కోసం రైతులు సీల్డ్‌ విత్తనాలు కొనేలా అప్రమత్తం చేయాలని, పంట పూర్తయ్యే వరకు ఏ విత్తనం వాడారో గుర్తుండేలా విత్తనాల బస్తాను భద్రపరచేలా సూచనలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో సన్నాలు సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టనుందని అధికారులు చెబుతున్నారు. ముందస్తు సమాచారంతో గ్రామాల్లో సమావేశమైన రైతులకు ఈ విషయాలను స్పష్టం చేయడమే కాకుండా విత్తనాల కోసం ముందుగానే టోకెన్లు ఇచ్చే పద్ధతిని అవలంభించేలా చర్యలు చేపడుతున్నారు.
నకిలీ విత్తనాలు అరికట్టేందుకు..: రైతులను పీడిస్తున్న నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం వ్యవసాయ శాఖను ఆదేశించింది. డీలర్లు విక్రయించే విత్తనాల వివరాలు, ఉత్పత్తిదారులు, కొనుగోలు చేస్తున్న రైతుల వివరాలు నమోదు చేయాలని సూచించింది. ప్రతి రోజూ వీరిపై పర్యవేక్షణ ఉండేలా ఏఈలు, ఏవోలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు డీలర్లపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ప్రభుత్వపరంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీతో అందజేసే విత్తనాలు పక్కదారి పట్టకుండా రైతులకు మాత్రమే అందుబాటులో ఉంచేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రైతు అవగాహన సదస్సులో వివరించాలని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని